హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : బీఈ, బీటెక్ సీట్ల భర్తీకి నిర్వహించే ఎప్‌సెట్ వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలయ్యింది. ఈ ఏడాది కన్వీనర్ కోటా సీట్లకు సమాంతరంగా మేనేజ్మెంట్ కోటా సీట్లను భర్తీచేస్తారు. ఇదివరకు బీ క్యాటగిరీ సీట్లను కాస్త ఆలస్యంగా భర్తీచేయగా, ఈసారి సమాంతరంగా భర్తీ చేయబోతున్నారు. కన్వీనర్ కోటాలో సీటు వచ్చిన వారు మేనేజ్మెంట్ కోటాలో.. బీ క్యాటగిరీ సీటు ఖరారు చేసుకున్న వారికి ఏ క్యాటగిరీలో సీట్లు రావడంతో ఆయా సీట్లను రద్దుచేసుకోవడం, కొన్ని సీట్లు మిగిలిపోవడం జరుగుతున్నది. దీనికి చెక్‌పెడుతూ రెండు కౌన్సెలింగ్‌లను సమాంతరంగా చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. బీటెక్ ఫస్టియర్ సీట్లను ఈసారి మొత్తం మూడు విడతల్లో భర్తీచేస్తారు. ఈ నెల 19 నుంచి మొదటి విడత వెబ్ కౌన్సెలింగ్ ప్రారంభంకానున్నది. జూలై 17 నుంచి రెండో విడత, జూలై 31 నుంచి తుది విడత సీట్లను భర్తీ చేయనున్నారు.
సోమవారం మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఎప్‌సెట్ ప్రవేశాల కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, ఇతర అధికారులు పాల్గొని ఎప్‌సెట్ వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఖరారుచేసి విడుదల చేశారు. రెండో విడత సీట్ల కేటాయింపు తర్వాత విద్యార్థులంతా కాలేజీల్లో తప్పనిసరిగా రిపోర్ట్‌చేయాలి. ఒరిజినల్ టీసీ, సర్టిఫికెట్ల జిరాక్స్‌లు కాలేజీల్లో సమర్పించాలి. రిపోర్ట్చేయకపోతే ఫైనల్ ఫేజ్‌లో వెబ్ ఆప్షన్లకు అనుమతించరు. మూడు విడతల కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత ఆగస్టు 16న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల చేస్తారు. తుది విడత కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత సీట్లు రద్దుచేసుకోవడం ఉండదు. ఆగస్టు ఒకటి నుంచి బీటెక్ ఫస్టియర్ క్లాసులు ప్రారంభంకానున్నాయి.