Health Department | వైద్యారోగ్యశాఖలో 310 ఫార్మాసిస్టు పోస్టులకు కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. గురువారం డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిధిలో 105 పోస్టులకు అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించారు. టీవీవీపీ పరిధిలోని 135 పోస్టులకు, డీఎంఈ పరిధిలోని 70 పోస్టులకు శుక్రవారం కౌన్సెలింగ్ జరుగనున్నది. వీరికి త్వరలో ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చేతులమీదుగా నియామక పత్రాలు అందజేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 369 ఫార్మాసిస్ట్ పోస్టుల భర్తీకి 2018 జనవరి 25న టీఎస్పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో డీపీహెచ్ పరిధిలో 125, డీఎంఈ 96, టీవీవీపీలో 148 పోస్టులు ఉన్నాయి.
అయితే, కోర్టు కేసుల కారణంగా ఫలితాల వెల్లడి ఆలస్యమైంది. ఇందులో 310 పోస్టుల భర్తీకి న్యాయస్థానం తాజాగా అనుమతి ఇచ్చింది. దీంతో టీఎస్పీఎస్సీ ఈ నెల 12న 310 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో డీపీహెచ్ పరిధిలో 105, డీఎంఈ పరిధిలో 70, టీవీవీపీ పరిధిలో 135 పోస్టులు ఉన్నాయి. వీరికి కౌన్సెలింగ్ నిర్వహించి కోరుకున్న చోట పోస్టింగ్ ఇవ్వనున్నారు. ఫార్మాసిస్టులుగా నియమితులవుతున్న వారికి మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో వైద్యారోగ్య రంగంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానానికి చేరిందని, మంచి సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు.