Contract Lecturers | జియాగూడ, ఏఫ్రిల్ 8 : కోఠిలోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో కాంట్రాక్ట్ అధ్యాపకులు తరగతులు బహిష్కరించి క్యాంపస్‌లోని బ్రిటిష్ రెసిడెన్సి వద్ద ఆందోళనకు దిగారు. కొత్తగా అధ్యాపకుల నియామకాల కోసం ఇచ్చిన జీవో 21ను రద్దు చేసి… రాష్ట్ర వ్యాప్తంగా 12 విశ్వ విద్యాలయాలలో పని చేస్తున్న 1270 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని మహిళ విశ్వవిద్యాలయం కాంట్రాక్ట్ అధ్యాపకుల జేఏసీ కన్వీనర్ ఉపేందర్ రావు డిమాండ్ చేశారు. ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన జీవో 21ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
అనంతరం ఉపేందర్ రావు మాట్లాడుతూ.. నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్లను భర్తీ చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. కాంట్రాక్టు అధ్యాపకుల సేవలను పూర్తి స్థాయిలో పర్యవేక్షించిన తర్వాతే కొత్త నియామకాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలలో గత 25 నుంచి 30 ఏళ్లుగా కాంట్రాక్టు పద్ధతిలో సేవలందిస్తున్న అధ్యాపకులు చాలీచాలని జీతాలతో పని చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం రెగ్యులర్ అధ్యాపకుల సంఖ్య సుమారు 700 ఉంటే కాంట్రాక్టు అధ్యాపకుల సంఖ్య 1270 ఉన్నారని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు కావస్తున్నా ఇంకా ఆంద్రప్రదేశ్ యూనివర్సిటీ చట్టం 1994 అనుసరించడం జరుగుతోందని, రాష్ట్రానికి ప్రత్యేకంగా తెలంగాణ యూనివర్సిటీల చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చేంత వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో కాంట్రాక్ట్ అధ్యాపకులు డాక్టర్ వినీత పాండే, డాక్టర్ రజిని, డాక్టర్ సనత్, డాక్టర్ రవి, డాక్టర్ సునీత, జ్యోతి, డాక్టర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.