హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తేతెలంగాణ): ‘భర్తను కోల్పోయిన మహిళ కన్నీళ్లు పెట్టుకుంటే కాంగ్రెస్ మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. ఇందిరమ్మ రాజ్యమంటే మహిళలను అవమానించడం, అవహేళన చేయడమేనా?’ అని బీఆర్ఎస్ మహిళా నేతలు ధ్వజమెత్తారు. భారీగా తరలివచ్చిన ప్రజాస్పందనను చూసి, ఆ సమయంలో తన భర్తలేడాయెనని జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్ భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంటే, వారు చులకనగా మాట్లాడటంపై వారంతా భగ్గుమన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో జగిత్యాల మాజీ జడ్పీ చైర్పర్సన్ దావ వసంత బీఆర్ఎస్ ఇతర మహిళా నాయకులతో కలిసి బుధవారం మీడియాతో మాట్లాడారు.
బీఆర్ఎస్ను ఎదుర్కొనే దమ్ము ధైర్యంలేక ఓటమి భయంతోనే కాంగ్రెస్ నేతలు ఇలాంటి దిగజారుడు రాజకీయం చేస్తున్నారని దావ వసంత నిప్పులు చెరిగారు. నాడు ఇందిరమ్మను ఆలయంలోకి అనుమతివ్వకుంటే నానాయాగీ చేసిన కాంగ్రెస్ నాయకులు.. ఇప్పుడు ఆమె పేరు చెప్పుకొని గద్దెనెక్కి అతివలను హేళన చేసేలా వ్యవహరించడం ఆక్షేపణీయమని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతల దుర్మార్గపు పొకడలను మహిళాలోకం గమనిస్తున్నదని, తగిన సమయంలో బుద్ధిచెప్పేందుకు సిద్ధంగా ఉన్నదని హెచ్చరించారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో ఏనాడూ మహిళలను చిన్నచూపుచూడలేదని గుర్తుచేశారు. నేడు కాంగ్రెస్ పార్టీ చెప్పుకునేందుకు ఏమీలేక మహిళల కన్నీళ్లను రాజకీయం చేసి ఓట్లడగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇలాంటి సందర్భంలో జూబ్లీహిల్స్ ప్రజలు ఆడబిడ్డ మాగంటి సునీతాగోపీనాథ్కు అండగా నిలువాలని విజ్ఞప్తిచేశారు.
కాంగ్రెస్ 22 నెలల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీలేదని బీఆర్ఎస్ కార్పొరేటర్ సునీత విమర్శించారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి దుర్మార్గపు పాలనతో రాష్ట్రం పరువు తీస్తున్నారని దుయ్యబట్టారు. భర్తను తలుచుకొని కన్నీళ్లు పెట్టుకున్న మాగంటి సునీతాగోపీనాథ్ను అవమానించేలా.. డ్రామాలు చేస్తున్నదని కాంగ్రెస్ నేతలు మాట్లాడటం బాధాకరమని పేర్కొన్నారు. వారి ఇండ్లలోని వారికి ఇలాంటి పరిస్థితి వస్తే కన్నీళ్లు పెట్టుకోరా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా సునీతకు మంత్రులు పొన్నం, తుమ్మల నాగేశ్వర్రావు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
మాగంటి సునీతాగోపీనాథ్ కుటుంబానికి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే మంత్రులు ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ మహిళా నేత కిర్తీలతాగౌడ్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమి తప్పదనే అసందర్భ ప్రేలాపనలకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. నిజంగా కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే సర్కారు చేసిన అభివృద్ధి పనులు చెప్పి ఓట్లడగాలని డిమాండ్ చేశారు. సునీతాగోపీనాథ్పై వ్యాఖ్యలను మహిళా కమిషన్ సుమోటోగా తీసుకొని విచారణ చేయాలని కోరారు.
మాగంటి సునీతాగోపీనాథ్ను ఉద్దేశించి కించపరిచేలా మాట్లాడిన మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్రావు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ మహిళా నేత పావనీగౌడ్ డిమాండ్ చేశారు. గతంలో ఓట్ల కోసం అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కన్నీళ్లు పెట్టుకోలేదా? అని ప్రశ్నించారు. భర్తను కోల్పోయిన మహిళలపై సానుభూతి చూపకుండా ఇష్టారీతిన మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతల వైఖరిని జూబ్లీహిల్స్ ప్రజలు గమనిస్తున్నారని, ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
సునీతాగోపీనాథ్ను అవహేళన చేసేలా ఉన్న మంత్రులు వ్యాఖ్యలను సభ్యసమాజం సహించబోదని మహిళా నేత ప్రభారెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికైనా మంత్రులు తమ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
లేదంటే ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ వైఖరిని ఎండగడతామని స్పష్టంచేశారు.
మహిళలంటే కాంగ్రెస్ పార్టీ నేతలకు మొదటి నుంచి చిన్నచూపేనని బీఆర్ఎస్ మహిళా నేత నిరోషా ఆరోపించారు. తుమ్మల నాగేశ్వర్రావు తన సామాజికవర్గానికి చెందిన మహిళా నేత సునీతాగోపీనాథ్పై ఇష్టారీతిన మాట్లాడటం సిగ్గుచేటని పేర్కొన్నారు. వారి వైఖరిపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమి భయంతోనే కాంగ్రెస్ చిల్లర డ్రామాలు చేస్తున్నదని బీఆర్ఎస్ కార్పొరేటర్ సామల హేమ ధ్వజమెత్తారు. భర్తను కోల్పోయిన మహిళ ఏడుపును కూడా అవహేళన చేయడం మంత్రులకే చెల్లిందని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో అతివల కోసం అనేక పథకాలు తెచ్చారని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ సర్కారు బూటకపు హామీలతో మోసం చేసిందని నిప్పులు చెరిగారు. గతంలో రాజీవ్‌గాంధీ మరణాన్ని తలుచుకొని సోనియాగాంధీ, ప్రియాంకగాంధీ కన్నీరు పెట్టలేదా? అని ప్రశ్నించారు.
మాగంటి సునీతాగోపీనాథ్పై మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు టీఎస్పీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రా ఆనంద్ తెలిపారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు మర్యాదలేకుండా మాట్లాడటం దురదృష్టకరమని పేర్కొన్నారు. సునీతాగోపీనాథ్ను ఆమె సామాజిక వర్గానికి చెందిన తుమ్మల నాగేశ్వర్రావు అమానించేలా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సునీతాగోపీనాథ్ను ఉద్దేశించి పొన్నం ప్రభాకర్ తప్పుడు వ్యాఖ్యలు చేస్తుంటే మేయర్‌గా ఉన్న మహిళానేత ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. ఇప్పటికైనా తప్పుడు మాటలు మాని, చేసిన అభివృద్ధిని చెప్పుకొని ఓట్లడగాలని హితవు పలికారు.