ఆర్టీసీ గురించి కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఉన్నదేమిటి? ఆ పత్రాన్ని బయటకు తీసి చూడగా అందుకు సంబంధించిన 14వ అంశంలో ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం పేరిట ఐదు హామీలు కనిపిస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళ్లే ముందు, మూడు రోజులపాటు జరిగి 24వ తేదీ రాత్రి ముగిసిన ఆర్టీసీ సిబ్బంది సమ్మె సందర్భంగా ఒక సంగతి స్పష్టమవుతున్నదని చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వం తన పరిపాలనా కాలాన్ని సగం మేర పూర్తి చేసుకున్నది గాని, ఎన్నికల హామీలను ప్రజలకు సంతృప్తికరంగా నెరవేర్చటంలో విఫలమై వేర్వేరు వర్గాల వారు సమ్మెలు, ఆందోళనలు చేయకతప్పని దశకు చేరుకున్నది. తను కోరి సృష్టించుకున్న బలహీనతలు ఇక దాచిపెట్టలేని విధంగా బయటపడటం మొదలైంది. కనుకనే ఉద్యోగుల ఒత్తిడికి తలొగ్గక తప్పలేదు.
సమ్మె సమయంలో ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వం ముందు 32 డిమాండ్లను పెట్టారు. ఏ శాఖకు, విభాగానికి చెందిన సిబ్బందికి అయినా రకరకాల సమస్యలు పేరుకుపోవటం, వాటి పరిష్కారానికి డిమాండ్ చేయటం, దానిపై చర్చలు, కొన్ని పరిష్కారం, కొన్ని వాయిదా వంటివి ఎప్పుడూ ఉండేవే. కానీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తాము స్వయంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను రెండున్నరేండ్లు గడిచినా అమలు పరచకపోవటమే గాక, ఎదురుచూసి చూసి విసుగెత్తిన సిబ్బంది, ఇచ్చిన డిమాండ్లపై నెలలకు నెలలు గడుస్తున్నా వారితో కనీసం చర్చించకపోవటమన్నది ఇక్కడ ప్రత్యేకత. అంతకన్నా విశేషం మరొకటి ఉన్నది.
ఇప్పటి సమ్మెపై చివరకు చర్చలు జరిగినప్పుడు ప్రభుత్వం పక్షాన తక్కిన అన్నిటికీ సానుకూలంగా ఉన్నామంటూ మూడింటిపై పేచీ పెట్టింది. అవి, విలీనం, పీఆర్సీ, గత పీఆర్సీ బకాయిల చెల్లింపు. ఒకసారి పైన పేర్కొన్న మ్యానిఫెస్టో హామీలను మళ్లీ చూడండి. ఈ మూడు హామీలూ అందులో ఉన్నవే. అనగా, తాము స్వయంగా ఇచ్చిన హామీలపైన తామే పేచీ పెడుతున్నారన్నమాట.
సిబ్బంది అందుకు ససేమిరా అనటం, ముగ్గురు ఆత్మహత్యాయత్నం చేయగా ఒకరు చనిపోవడంతో తీవ్రమైన ఒత్తిడి ఏర్పడటం వల్ల ప్రభుత్వం చివరకు రాజీకి రావటమన్నది సరే. కానీ, యథాతథంగా మాత్రం తన హామీలపై తానే హఠం వేయటం ఒక విచిత్ర పరిస్థితి. అయితే, అధికారుల స్థాయి చర్చల తర్వాత మంత్రుల ఉపసంఘానికి నాయకత్వం వహించిన ఉపముఖ్యమంత్రి ప్లస్ ఆర్థికమంత్రి అయిన మల్లు భట్టివిక్రమార్కకు తామిచ్చిన ఎన్నికల హామీలేమిటో గుర్తుండకపోవటం కొత్త కాదు. నిరుద్యోగులకు నిరుద్యోగభృతి హామీని తామసలు ఇవ్వనేలేదని ఆయన నిండుశాసనసభలో ఎంతో ధైర్యంగా ప్రకటించటాన్ని నిరుద్యోగులు ఇప్పటికీ గుర్తుచేసుకుంటారు. అదే పద్ధతిలో ఇతర హామీలు కొన్ని ప్రభుత్వ పెద్దలు మరికొందరు మరిచిపోయారు.
ఆ వివరాలన్నీ ప్రస్తుతం అక్కరలేదుగాని, ప్రస్తుతం ప్రభుత్వం అంగీకరించిందంటున్న డిమాండ్లలో కొన్ని కీలకమైనవి ఉన్నాయి. వాటిలో కొన్నింటిని పేర్కొనాలంటే, అద్దె బస్సులను అర్టీసీలో కలుపుకొని వాటి సిబ్బందిని సంస్థలో చేర్చుకోవటం, ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేట్ వారు నడపటం కాకుండా ప్రభుత్వమే కొనుగోలు చేసి నిర్వహించటం, 8 గంటల షిఫ్టుల కచ్చితమైన అమలు, మహిళలకు ఉచిత ప్రయాణ పద్ధతిలో సవరణలు మొదలైనవి. ఆర్టీసీ సంస్థ గురించి సిబ్బంది సమస్యల గురించి పరిచయంలేని సాధారణ ప్రజలకు వీటి విషయం అర్థం కాకపోవచ్చు. కానీ వాటిలో ఒక్కొక్క దానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఉదాహరణకు అద్దె బస్సులు, ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులు, ఔట్సోర్సింగ్ వంటివి క్రమంగా ఆ సంస్థను ప్రైవేట్‌పరం చేసి నిర్వీర్యం చేసే చర్యలు.
దేశంలో ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టినప్పటి నుంచి ప్రభుత్వరంగ సంస్థలను, అవి బాగా పని చేస్తున్నప్పటికీ, అట్లానే ఆర్టీసీ వంటి సేవా సంస్థలను బుద్ధిపూర్వకంగా బలహీనపరచి ప్రైవేట్‌పరం చేయటం ఒక విధానంగా మారింది. ఆ ప్రకారం అనేక సంస్థలు ఇప్పటికే కుంటుపడటమో, మూతపడటమో జరిగింది. ఈ విధానాలకు వ్యతిరేకంగా సిబ్బంది ఉద్యమాలు చేస్తున్నారు. ఆర్టీసీ కూడా సరిగా అటువంటి ప్రమాదపు దశలో ప్రవేశిస్తున్నది. అందువల్లనే సిబ్బంది అద్దె బస్సులను, ఉద్యోగుల ఔట్‌సోర్సింగ్‌ను అంత గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఇందుకు సంబంధించిన సిబ్బంది డిమాండ్‌ను అంగీకరిస్తున్నట్టు ఇప్పుడు చెప్తున్న ప్రభుత్వం అందుకు నిజంగా కట్టుబడగలదా అని చూడవలసి ఉన్నది. ఆ పని జరిగితే సిబ్బందికి ఘన విజయమే అవుతుంది. ఈ అంశాలతోనే ముడిబడిన మరొక డిమాండ్, హైదరాబాద్‌లో అద్దె బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు ప్రైవేట్ యాజమాన్యాల కింద పెరిగినా కొద్దీ అక్కడి ఆర్టీసీ సిబ్బందిని జిల్లాలకు బదిలీ చేయటం.
1) ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీన (పరిచే) ప్రక్రియను పూర్తి చేసి, రెండు పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లిస్తాం
2) వచ్చే పీఆర్సీ పరిధిలోకి టీఎస్ఆర్టీసీ కార్మికులను చేరుస్తాం.
3) రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు, సదుపాయాలను కల్పిస్తాం.
4) ఆర్టీసీ బస్సులను ఆధునీకరించి విస్తరిస్తాం. ఆధునాతనమైన సౌకర్యాలతో కొత్త సర్వీసులను ప్రారంభిస్తాం.
5) ఆర్టీసీ యూనియన్ పునరుద్ధరణకు అనుమతిస్తాం.
ఇటువంటి ముప్పును ప్రతిఘటించటం కూడా సమ్మె డిమాండ్లలో ఒకటి. అట్లాగే, పని వేళలు 8 గంటలకు మించి బాగా పెరగటంతో మహిళా ఉద్యోగులకు తీవ్రమైన సమస్యలు ఎదురవుతుండటంతోపాటు మిగిలిన వారికి ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. అందువల్ల, ప్రభుత్వం సమ్మె గండం నుంచి బయటపడ్డాము గదా అని భావించి, డిమాండ్ల అమలులో తిరిగి తాత్సారానికి పాల్పడనట్టయితే సిబ్బందితోపాటు ఆర్టీసీ సంస్థకు కూడా చాలా మేలు కలుగుతుంది. దీనినట్లుంచి, అసలు మ్యానిఫెస్టో హామీల అమలు వైఫల్యం గురించి మొదలు అనుకున్న విషయానికి వద్దాము.
ఆరు గ్యారెంటీల రూపంలోనైతేనేమి, ఇతరత్రానైతేనేమి వెనుక ముందులు ఆలోచించకుండా కేవలం ఓట్ల కోసం ఇచ్చిన హామీల వైఫల్యంతో, ఆర్టీసీ సిబ్బంది వలెనే ఇతర వర్గాలు కూడా సమ్మెలకు, ఆందోళనలకు పూనుకోవటం అనే ప్రశ్న తలెత్తుతున్నది. వాస్తవానికి గత ఏడాది కాలంగా చిన్నవి, పెద్దవి అట్లా జరుగుతూనే ఉన్నాయి. ఉదాహరణకు ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, నిరుద్యోగుల విషయం కనిపిస్తూనే ఉన్నది.
పోయినసారి వీరంతా ఎన్నెన్నో ఆశలతో దాదాపు మూకుమ్మడిగా కాంగ్రెస్‌కు ఓటు వేశారు. ఈ మూడు వర్గాల కోసం మ్యానిఫెస్టోలో ఏమేమి చెప్పారన్న వివరాలు ఇక్కడ పేర్కొనటం లేదుగాని ప్రభుత్వం తీరుతో విసుగెత్తి వారు వరుసగా నిరసనలు ప్రకటిస్తుండటం తెలిసిందే. రిటైర్డ్ సిబ్బంది అయితే చివరకు కోర్టుకు వెళ్లి ఉత్తర్వులు తెచ్చుకోవలసి వచ్చింది. నిరుద్యోగులు నిరుడు కనీసం అరడజనుసార్లు పోలీసుల నిర్బంధాలకు, లాఠీచార్జీలకు గురయ్యారు. ఉద్యోగ సంఘాల నాయకులను ఏదో చేసి ప్రతిసారి బుజ్జగిస్తున్నారు గాని, ఉద్యోగులు మాత్రం కుతకుత ఉడుకుతున్నారు. ప్రభుత్వ పాలన సగకాలం గడవకముందే, ‘ఏమీ చేయలేను, నన్ను కోసుకు తింటారా?’ అని ఉద్యోగులతో అంటూ ఉద్యోగ భర్తీల గురించి నిరుద్యోగులతో పచ్చి అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, మిగిలిన సగకాలంలో అసంతృప్తి మరెంత ప్రబలవచ్చునో ఎవరైనా ఊహించగలరు.
రైతులు, మహిళలు, విద్యార్థులు, సామాజిక సంక్షేమ పెన్షన్‌దారుల గురించి అయితే చెప్పనక్కరలేదు. వారికిచ్చిన అనేకానేక హామీల్లో కొన్నిటికి కాలవ్యవధిని సైతం లోగడనే ప్రకటించారు. అది చాలదన్నట్టు గిరిజనుల భూముల ఆక్రమణలు, పేదల ఇండ్ల కూల్చివేతలు, అభివృద్ధి నిర్మాణాలేవీ కొత్తగా మొదలైనా కాకపోవటం, ప్రజలకు ఎందుకోసం ఉపయోగకరమో తెలియని భారీ కార్యక్రమమేదో ప్రకటించటం, అవసరమైన వాటికి నిధులు లేవనటం, స్వయంగా కుప్పతెప్పలుగా అప్పులు చేస్తూ, చేయని అప్పులకు గత ప్రభుత్వాన్ని నిందించటం, మేడిగడ్డ బరాజ్‌లో కుంగిన రెండు పిల్లర్లకు మరమ్మతులు చేయకుండా వదిలివేసి, గత ప్రభుత్వాన్ని నిందించి, ఇప్పుడు ఇంతకాలానికి తామే మరమ్మతులు చేస్తున్నామంటూ బయలుదేరటం వంటివన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.. మాట్లాడుకుంటున్నారు కూడా. ఆర్టీసీ సమ్మె అందుకు మరొక సందర్భం అవుతున్నది. మూడు రోజులు మాత్రమే జరిగినా ఆ సంస్థ సిబ్బందితోపాటు సమాజంలోని అన్ని వర్గాల అసంతృప్తికి సంకేతప్రాయంగా నిలిచిన ఈ ఆందోళన, ప్రజలందరిని ఆలోచనలో పడవేయగలదని భావించవచ్చు. పర్వత సానువుల్లో షూటింగ్ జోన్ సిండ్రోమ్ అని ఒకటి జరుగుతుంటుంది. పైభాగంలో చిన్న రాయి కదిలి కిందకు దొర్లివచ్చినా ఆ వేగంతో, తాకిడితో పెద్ద రాళ్లను కూడా దొర్లించుకుపోతుంది అది.