Mahabubnagar | మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘ఏడున్నావ్ రా?.. లం.. కొడుకా.. వస్తున్నా ఆగురా.. నీ సంగతి ఏమిటో తేలుస్తా’.. అంటూ ఓ కాంగ్రెస్ నాయకుడు, మాజీ కౌన్సిలర్.. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌పై రాయలేని భాషలో తిట్ల పురాణం సాగించాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో సంచలనం రేపింది. మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కథనం ప్రకారం.. మంగళవారం ఇంటి నుంచి ఉద్యోగుల సమావేశానికి హాజరయ్యేందుకు కమిషనర్ వెళ్లే క్రమంలో సాయంత్రం 4.33 గంటల నుంచి 4:42 గంటల మధ్య 7వ వార్డు మాజీ కౌన్సిలర్ కట్టా రవికిషన్‌రెడ్డి దాదాపు 14 సార్లు ఫోన్ చేశాడు.
అయితే ఆ సమయంలో అతడు వాష్ రూమ్‌లో ఉన్నాడు. తర్వాత ఫోన్ లిఫ్ట్ చేస్తే బూతులు తిట్టాడు. ‘ఎక్కడున్నావ్ రా నువ్వు’? అంటే.. ఆఫీసుకు వస్తున్నానని కమిషనర్ సమాధానం చెప్పినా.. వస్తున్నా ఆగురా అంటూ ఫోన్ పెట్టేశాడు. తర్వాత కార్యాలయానికి వెళ్లగా.. అక్కడ కమిషనర్ లేకపోవడంతో తిరిగి వెళ్తున్న క్రమంలో కమిషనర్ రావడాన్ని చూసి అతడితో గొడవకు దిగాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు తప్పతాగి ఉన్న మాజీ కౌన్సిలర్‌ను వారించినా వినలేదు. దాడికి ప్రయత్నించగా అతడిని అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం కమిషనర్ ప్రవీణ్ కుమార్‌రెడ్డి ఎస్పీ జానకి, అడిషనల్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన ఆడియో రికార్డింగ్‌ను కూడా కమిషనర్ వారికి అందజేశారు.ఉన్నతాధికారుల సూచన మేరకు కమిషనర్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. సదరు మాజీ కౌన్సిలర్‌ను అదుపులోకి తీసుకొని స్థానిక ప్రభుత్వ దవాఖానకు తరలించి టెస్టులు చేయించారు. అప్పటికే తప్ప తాగి ఉన్నట్టు నిర్ధారించారు.
ఇలా అదుపులోకి తీసుకొని అలా వదిలేయడం.. కమిషనర్ స్థాయి వ్యక్తినే దూషించినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి. ఇదిలావుండగా 7వ వార్డు మాజీ కౌన్సిలర్ కాంగ్రెస్‌లో చేరాడు. అదే వార్డులో మరో కాంగ్రెస్ నేత అనుచరులు పనులు చేస్తున్నారని.. వారికే బిల్లులు ఇస్తున్నారని.. దీనికంతటికి మున్సిపల్ కమిషనరే కారణమని.. తన వార్డులో ఇతరుల పెత్తనం ఏమిటని ప్రశ్నించేందుకే.. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లినట్టు సమాచారం.