మహబూబ్‌నగర్, మే 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ క్యాడర్‌పై, సానుభూతిపరులపై కాంగ్రెస్ నేతలు నిత్యం వేధింపులకు దిగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక గులాబీ పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడుతున్నారు. సోమవారం కొల్లాపూర్‌కు చెందిన బీఆర్ఎస్ నేత, పాస్టర్ నర్సింహ ఇంటిపై దాడి జరిగింది. ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఉన్న ఫ్యామిలీ గొడవ స్థానిక కౌన్సిలర్ భర్త ప్రోద్బలంతో తగాదా మరింత ముదిరింది. ఇద్దరి మధ్య ఉన్న స్థల వివాదం కోర్టులో ఉండగానే.. కౌన్సిలర్ భర్త పేదోడి ఇంటిపైకి బుల్డోజర్ను తీసుకొచ్చి గోడతోపాటు రేకులను కూలగొట్టారు. బాధిత కుటుంబ సభ్యులు అడ్డుకోవడానికి యత్నించినా వారు వినలేదు. ఇదంతా ఒకటో వార్డు కౌన్సిలర్ భర్త చెప్పుచేతల్లో జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. తమపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని నర్సింహ వాపోయాడు. దాడి చేయడంతోపాటు తిరిగి తమపైనే అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.
మంత్రికి ప్రమేయం లేదు
మంత్రికిగానీ.. నాకు గానీ ఎలాంటి ప్రమే యం లేదు. ఇది అన్నదమ్ముల పంచాయితీ.. మా వార్డులో గొడవ జరుగుతుందని తెలిసి అక్కడికి వెళ్లాను. అప్పటికే ఇద్దరి మధ్య పంచాయతీ నడుస్తుంది. కావాలని మాపై బురద జల్లుతున్నారు. నరసింహ ఇంటిని కూలగొట్టడానికి మాకు ఎలాంటి సంబంధం లేదు.
– పినిశెట్టి శేఖర్, వార్డు కౌన్సిలర్ భర్త
దౌర్జన్యంగా కూలగొట్టారు
నేను కొనుగోలు చేసిన ఇంటిపై కోర్టులో కేసు నడుస్తుండగా జేసీబీ తీసుకొచ్చి కూలగొట్టారు. మంత్రి కనుసన్నల్లోనే కౌన్సిలర్ భర్త దగ్గరుండి చేశారు. 12 ఏండ్ల కిందట మా అన్నయ్యతో పాత ఇంటిని కొనుగోలు చేశాం. నేను బీఆర్ఎస్లో తిరుగుతున్నానని మా అన్నయ్యకు కాంగ్రెసోళ్లు కొల్లాపూర్ మున్సిపాలిటీలో ఓనర్షిప్ సర్టిఫికెట్ ఇప్పించారు. అప్పట్లో దీనిపై ఫిర్యాదు చేయగా, మున్సిపల్ కమిషనర్ తప్పయిందని ఒప్పుకొన్నారు. కోర్టులో కేసులు నడుస్తుండగానే బుల్డోజర్ పెట్టి ఈరోజు ఇంటిని కూలగొట్టి మాపై దాడికి దిగారు. గతంలో ఇదేవిధంగా చేసి మమ్మల్ని బైండోవర్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో మా వార్డు బీఆర్ఎస్కు లీడ్ ఇవ్వడంతోనే మంత్రి, ఆయన అనుచరులు మాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు.
– బాధితుడు నరసింహ, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్ జిల్లా
అన్నదమ్ములది సివిల్ పంచాయితీ..
ఇది సివిల్ పంచాయితీ.. అన్నదమ్ముల ఆస్తి గొడవ కోర్టులో నడుస్తుంది. దీనిపై పర్మినెంట్ ఇంజక్షన్ ఆర్డర్ ఉంది. నరసింహ పోలీసుల ప్రమేయం వద్దని కోర్టు నుంచి తీసుకొచ్చారు. ఇది సివిల్ దావా అయినందున మేము జోక్యం చేసుకోలేదు. గొడవ జరుగుతుందని తెలిస్తే పోలీసులను పంపించాం. ఆ తర్వాత ఇరు వర్గాలు పిటిషన్లు ఇచ్చాయి. ఈ పిటిషన్లన్నీ మామూలు గొడవలే కాబట్టి ఎఫ్ఐఆర్ చేయలేదు. ఈ వ్యవహారంలో మాపై ఒత్తిడి ఉన్నదన్న ప్రచారంలో నిజం లేదు.
– రిషికేశ్, ఎస్సై కొల్లాపూర్