Hanmanth Rao : హైటెక్ నగరంలో కో-లివింగ్ హాస్టళ్లతో అనర్థమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వీ హన్మంతరావు అన్నారు. ఈ కో-లివింగ్ హాస్టల్స్ సంస్కృతిని ఆపాలని సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబును ఆయన కోరారు. ఒకే హాస్టల్లో ఆడపిల్లలు, మగ పిల్లలు కలిసి ఉంటుంన్నారని.. ఇది మంచి సంస్కృతి కాదని ఆయన వ్యాఖ్యానించారు.
హైదరాబాద్ నెంబర్వన్ సిటీ కావాలంటే ఇలాంటి వాటిని కట్టడి చేయాలని వీహెచ్ అభిప్రాయపడ్డారు. NSUI విద్యార్థి సంఘం కూడా వీటి మీద దృష్టి పెట్టాలని సూచించారు. గతంలో ఫ్యాక్షన్ మర్డర్స్ ఉండేవని, ఇప్పుడు సొంత భర్తను భార్య చంపడం, కూతురు తల్లిని చంపడం లాంటివి జరుగుతున్నాయని, ఇది దారుణమని అన్నారు.
ఇప్పుడు లవ్ మర్డర్స్ జరుతున్నాయని, ఇలాంటి వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేయొద్దని వీహెచ్ రిక్వెస్ట్ చేశారు. ఇవన్నీ చూస్తుంటే సమాజం ఎటువైపు పోతోందని భయమేస్తుందని అన్నారు. హ్యూమన్ రైట్స్ వాళ్లు నక్షలైట్ల హత్యల విషయంలో మాట్లాడుతారని, లవ్ మర్డర్స్పై వాళ్లు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
ఇలాంటి మర్డర్స్ను కూడా మానవ హక్కుల సంఘాలు పరిగణలోకి తీసుకోవాలని వీహెచ్ సూచించారు. సైకాలజిస్టులు, ఇంటలెక్చువల్స్ కూడా ఆలోచన చేయాలని అన్నారు. నిత్యం ఎక్కడో ఒక తప్పు జరుగుతూనే ఉందని, సావిత్రీభాయ్ పూలేను ప్రతి మహిళ ఆదర్శంగా తీసుకోవాలని ఆయన కోరారు.