సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం!
స్వపక్ష ప్రజాప్రతినిధులపై నమ్మకం సన్నగిల్లిందో? లేక వారిపై అనుమానపు బీజాలు మరింత బలపడ్డాయో? తెలియదు కానీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత పార్టీ ఎమ్మెల్యేలను దోషులుగా నిలబెట్టిన తీరు కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపుతున్నది. ప్రజా సమస్యల పరిషారం కోసం నిర్వహించాల్సిన కార్యక్రమాన్ని కాస్తా ఎమ్మెల్యేల విశ్వసనీయతను శంకించే నిఘా వేదికగా మార్చేశారు.
- ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు
- గన్మెన్లతో క్షణక్షణం పహారా
- సీఎం ప్రకటనతో ముసలం
హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ) : స్వపక్ష ప్రజాప్రతినిధులపై నమ్మకం సన్నగిల్లిందో? లేక వారిపై అనుమానపు బీజాలు మరింత బలపడ్డాయో? తెలియదు కానీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత పార్టీ ఎమ్మెల్యేలను దోషులుగా నిలబెట్టిన తీరు కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపుతున్నది. ప్రజా సమస్యల పరిషారం కోసం నిర్వహించాల్సిన కార్యక్రమాన్ని కాస్తా ఎమ్మెల్యేల విశ్వసనీయతను శంకించే నిఘా వేదికగా మార్చేశారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను స్వతంత్ర నాయకులుగా చూడాల్సింది పోయి, నేరస్తుల మాదిరిగా వారి ఫోన్లలో లొకేషన్ ట్రేసింగ్ యాప్‌లు పెడుతామని, గన్మెన్లతో క్షణక్షణం నిఘా పెట్టిస్తామని సాక్షాత్తు రాష్ట్ర పాలకుడే హెచ్చరికలు చేయడంతో కాంగ్రెస్ శాసనసభ్యులను తీవ్ర ఆత్మరక్షణ, అవమానభారంలోకి నెట్టినట్టయింది.
ఎగ్గొడితే కుదరదు
హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో నిర్వహించిన పార్టీ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ ఎమ్మెల్యేల గుండెల్లో గుబులు పుట్టించాయి. సంక్రాంతి తర్వాత గత టీడీపీ హయాం నాటి ‘జన్మభూమి’ తరహా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని, మే వరకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తప్పనిసరిగా గ్రామాల బాట పట్టాల్సిందేనని ఆదేశించారు. ఈ ఆదేశాల వెనుక ఇచ్చిన హెచ్చరికలే అసలు రగడకు కారణమయ్యాయి. ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయికి వెళ్లకుండా ఎగ్గొట్టే ప్రమాదం ఉన్నదనే రీతిలో మాట్లాడిన సీఎం.. ప్రజాప్రతినిధుల ఫోన్లలో లొకేషన్ ట్రేస్ యాప్‌లను ఇన్స్టాల్ చేస్తామని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. మొబైల్ ఫోన్లనే గ్రామాలకు పంపి, ప్రజాప్రతినిధులు తమకు ఇష్టమొచ్చిన చోట జల్సాలు చేస్తామంటే కుదరదని హెచ్చరించారు.
పర్యవేక్షణకు స్ట్రిక్ట్ ఆఫీసర్
సొంత పార్టీ ఎమ్మెల్యేల వెంట ఉండే సెక్యూరిటీ సిబ్బందిని కూడా ఇన్ఫార్మర్లుగా మార్చేశారనే సంకేతాలిచ్చారు. ‘మీ వెంట ఉండే గన్మెన్లు మా వాళ్లే.. పొద్దున ఎకడున్నరు.. సాయంత్రం ఎటుపోయిండ్రు అనే సమగ్ర సమాచారం క్షణాల్లో మా వద్దకు చేరుతుంది’ అని సీఎం హెచ్చరించారు. ఎమ్మెల్యేలు నిజంగా ఊర్లలో ఉంటున్నారా.. లేదా? అని నిఘా పెట్టేందుకు సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును ‘స్ట్రిక్ట్ ఆఫీసర్’గా పర్యవేక్షణ బాధ్యతల్లో పెడుతున్నామని, ఊర్లలో తిరగని వారిపై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి చర్యలు తీసుకుంటారని హెచ్చరించడం సొంత ప్రజాప్రతినిధులపై యాజమాన్య తరహా పెత్తనాన్ని గుర్తుచేస్తున్నదని పార్టీ వర్గాలు మండిపడుతున్నాయి.
ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే
బీఆర్ఎస్ విమర్శలు, ఆరోపణలను ఎండగట్టే ఓపిక కాంగ్రెస్ నేతలకు లేదంటూ వేదికపైనే వారిని కించపరిచిన సీఎం, ఆపై వారిపైనే ఫోన్ ట్రాకింగ్, నిఘానీడలు కమ్ముకునేలా హెచ్చరికలు జారీ చేయడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే ఉన్నదనే అనుమానాలు బలపడుతున్నాయి. ప్రజల మద్దతుతో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టిన శాసనసభ్యులను నమ్మకుండా, వారిపై గూఢచర్యం చేస్తామనడం వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని ఎమ్మెల్యేలు అంటున్నారు. సొంత ఎమ్మెల్యేల కదలికలపైనే సీఎంకు ఇంతటి అపనమ్మకం ఉంటే, అసలు ప్రభుత్వం, పార్టీపై ఆయనకు ఎంతమాత్రం పట్టు ఉన్నదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయని, రేవంత్‌రెడ్డి స్వయంగా విత్తిన ఈ అనుమాన బీజాలు మున్ముందు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీలో ఎ లాంటి అంతర్గత ముసలానికి దారితీస్తాయోనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

