Congress Govt | హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): ‘మొగుడు కొట్టినందుకు కాదు.. తోటి కోడలు నవ్వినందుకు’ అన్నట్టుగా దక్షిణ తెలంగాణకు చెందిన ఇద్దరు మంత్రుల నడుమ టెండర్ల లొల్లి మొదలైంది. కోట్ల రూపాయల టెండర్లను దక్కించుకోవాలని ఏడాది కాలంగా ఎదురుచూసిన ఓ మంత్రికి ఇప్పుడు విసుగొచ్చిందట! అది కూడా తనకు పనులు దక్కలేదని కాదట! ఏ టెండర్లు చూసినా మరో మంత్రికే ఇస్తరా? అని గుర్రుగున్నరట. సాగునీటి ప్రాజెక్టులు.. రోడ్లు సహా అన్ని టెండర్లూ ఆయనకేనా? అని పనులు దక్కని మంత్రి తెగ ఆవేదన పడిపోతున్నారట! ఈ క్రమంలో సదరు మంత్రి జిల్లాలో ఓ సాగునీటి ప్రాజెక్టు టెండర్లు ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటున్నాయి. దీంతో ఆ ప్రాజెక్టు టెండర్లన్నీ తనకే ఇవ్వాలని
ఆ మంత్రి గట్టిగా డిమాండ్ చేస్తున్నారట! ఇంతకీ ఆయనకు చెందిన నిర్మాణ కంపెనీలకే ఆ టెండర్లు ఇస్తారా? అంటే.. ఏమోనట! ఆయనకు ఇచ్చిన పనులు ఆయన ఇష్టం.. ఎవరికైనా ఇచ్చుకోవచ్చన్న మాట వినిపిస్తున్నది. ప్రస్తుతం ఆ ప్రాజెక్టు పనులు సర్వే దశలో ఉన్నయి. వాటి టెండర్లు పూర్తయ్యే నాటికి గతంలో వరుసగా పనులు దక్కించుకున్న మంత్రి చక్రం తిప్పుతారా? లేక గుర్రుగా ఉన్న మంత్రితో రాజీ కుదుర్చుకుంటారా? అనేది వేచిచూడాల్సిందే.
ఏడాదిపాటు ఎదురుచూసి..
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న లోకనీతిని కాంగ్రెస్ పార్టీ నాయకులు బాగానే ఒంట పట్టించుకున్నారు. అసలే అధికార పార్టీ.. అందునా బుగ్గకారు హోదా కూడా వచ్చిందంటే నాలుగు చేతులా కాకున్నా రెండు చేతులానైనా పనులు దక్కించుకోవాలనే లక్ష్యం ఉంటుంది. అందులో భాగంగానే దక్షిణ తెలంగాణలోని ఓ జిల్లాకు చెందిన మంత్రి భారీ టెండర్లకే గురి పెట్టారు. ఒకటీ అరా కాదు.. ఏకంగా రూ.16 వేల కోట్ల ఓ రహదారి ప్రాజెక్టు రూపుదిద్దుకుంటే తనకు పేరుతోపాటు పనులు కూడా దక్కుతాయని గంపెడాశతో ఉత్సాహంతో ముందుకుసాగారు. కానీ, ఏడాది గడచినా ఆ ప్రాజెక్టు భవితవ్యం ఇప్పట్లో తేలేలా కనిపించకపోవడంతో విసిగిపోయారు. ఒక్కసారి చుట్టూ చూస్తే.. పక్క మంత్రి ఒకరు రూ.వేల కోట్ల ప్రాజెక్టులను దక్కించుకున్న విషయం గుర్తొచ్చింది. దీంతో చిర్రెత్తిపోయిన ఆ మంత్రి.. అరె ఇదేందీ? అన్ని పనులు ఆయనకేనా? సాగునీటి ప్రాజెక్టులు, రోడ్ల పనులు సహా అన్ని టెండర్లూ ఆయనకే ఇస్తే ఎట్లా? అని ప్రభుత్వ పెద్దల వద్ద తన అసంతృప్తిని వెళ్లగక్కడంతోపాటు పనిలో పనిగా ఓ షరతు కూడా పెట్టినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఆ ప్రాజెక్టు పనులు నాకే..
ఏడాదికిపైగా ఒక్క కాంట్రాక్టు లేకుంటే ఎలా? అని ప్రభుత్వ పెద్దలను ప్రశ్నించిన ఆ మంత్రి.. తనను నమ్ముకొని ఇంకొకరున్నరని, అందుకే తన జిల్లాలో సర్వే దశలో ఉన్న సాగునీటి ప్రాజెక్టు పనులు తనకే ఇవ్వాలని, ఇందులో ఎవరూ జోక్యం చేసుకోకూడదని, ముఖ్యంగా ఇప్పటికే పనులు దక్కించుకున్న మరో మంత్రి జోక్యం చేసుకుంటే సహించేదే లేదని కరాఖండిగా స్పష్టం చేసినట్టు తెలిసింది. ఇదే విషయాన్ని సంబంధిత శాఖ మంత్రికి కూడా చెప్పారని, తన జిల్లాలో చేపట్టే ప్రాజెక్టు పనులు తనకే దక్కాలని పట్టుబట్టారని సమాచారం. దీంతో ఆ ప్రాజెక్టు ఇంకా టెండర్ల దశకే రాలేదని, మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆ శాఖ మంత్రి తల పట్టుకున్నట్టు తెలిసింది. ఈ విషయం ఇతర మంత్రులకు, ప్రభుత్వంలోని కొందరు పెద్దలకు తెలవడంతో లోలోపలే నవ్వుకుంటున్నట్టు ప్రచారం సాగుతున్నది. ఎవరి జిల్లాలోని ప్రాజెక్టుల పనులు వారికే దక్కాలనుకోవడం సరికాదని, టెండర్లు దక్కాలంటే దానికో లెక్క, పత్రం ఉంటుందని, ‘పెట్టే చేతికే’ ఇచ్చేదుంటదిగానీ ఎవరి ఇలాకాలోనిది వాళ్లకేనంటే బండి ఎట్ల నడవాలె అని మనసులో అనుకుంటున్నరట. ఆ ప్రాజెక్టు టెండర్ల దశకు వచ్చేలోగా షరతు పెట్టిన మంత్రికి తత్వం బోధపడుతుందిలే అనుకుంటూ ప్రస్తుతానికి ఆ కోల్డ్వార్ను పట్టించుకోవడం లేదట.