చిక్కడపల్లి, నవంబర్13: కొడంగల్‌లో ఫార్మా కంపెనీ ఏర్పాటు ఆవశ్యకతపై నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటుకు గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సదస్సును నిర్వహిస్తున్నట్టు సేవాలాల్ సేనా వ్యవస్థాపక అధ్యక్షుడు భూక్యాసంజీవ్ నాయక్, ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రామ్బల్ నాయక్ తెలిపారు. బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం ఈ సదస్సును నిర్వహిస్తామని పేర్కొన్నారు. బుధవారం సుందరయ్య పార్కు వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
కొడంగల్‌లోని గిరిజనుల భూములను లాక్కోవడానికి ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. లగచెర్ల, రోటిబండా తండా, పులిచర్ల కంట తండా, గడ్డమీది తండా, మైసమ్మ గడ్డ తండా, ఈదుల కుంట తండా, హక్కీం పేట తదితర తండాలను సందర్శించి వాస్తవాలను తెలుసుకునేందుకు ప్రముఖులచే నిజానిర్ధారణ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. సమావేశానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్ తదితరులు హాజరవుతారని పేర్కొన్నారు.