మెదక్ అర్బన్/టేక్మాల్, డిసెంబర్ 19: ప్రభుత్వం మహిళలకు కోసం ప్రవేశపెట్టిన ఉచి త బస్సు ప్రయాణం కారణంగా తమకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు ఆందోళన బాటపట్టారు. మెదక్ డిపోలోని డ్రైవర్లు మంగళవారం విధులు బహిష్కరించారు. డిపోలోని 59 అద్దె బస్సుల డ్రైవర్లంతా తాత్కాలికంగా విధులు బహిష్కరించారు.
డిపో ఎదుట డ్రైవర్లు మాట్లాడుతూ.. ఉచి త ప్రయాణంతో బస్సుల్లో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కుతున్నారని, ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తున్నారని, రద్దీతో ఎవరు కింద పడుతారోనని భయాందోళనకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం టేక్మాల్ రూట్లో ప్రయాణికులు ఎక్కువగా ఉన్నారని సోలోజిపల్లి వద్ద బస్సు ఆపక పోవడంతో ఓ ప్రయాణికురాలి భర్త ఎర్రోల్ల మోహన్ కర్రతో డ్రైవర్‌పై దాడి చేయడానికి వచ్చాడని తెలిపారు.
ఈ విషయంపై టేక్మాల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. ఇదిలా ఉండగా, టేక్మాల్ రూట్లో బస్సు ఆపలేదని మరో ప్రయాణికురాలి భర్త అద్దె బస్సు డ్రైవర్ దూదేకుల అస్లాంపై దాడికి యత్నించినట్టు తెలిసింది.. ఆ డ్రైవర్ ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకురాలేదని ఆర్టీసీ మెదక్ డిపో మేనేజర్ సుధ తెలిపారు. ఏదైనా ఇబ్బంది ఉంటే, సమస్య ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రయాణికులు ఇబ్బంది పడేలా ఆకస్మికంగా బస్సులు నిలిపివేస్తే అగ్రిమెంట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.