Revanth Reddy | హైదరాబాద్/కరీంనగర్/నిజామాబాద్/మంచిర్యా ల, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధులు): ‘ఒక్క ఎమ్మెల్సీ ఓటమితో నా ప్రభుత్వానికి వచ్చే ఇబ్బందేం లేదు.. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి ఓడినా నష్టమేం లేదు’ అని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. సోమవారం నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల్లో నిర్వహించిన పట్టభద్రుల సమ్మేళనాలు, సభలో రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతలను విస్మయానికి గురిచేశాయి. ఆయన మాటలు ఎన్నికల ముందే ఓటమిని అంగీకరించినట్టు ఉన్నాయని పార్టీ శ్రేణులు పెదవి విరుస్తున్నారు. ‘మహిళలకు ఉచిత బస్సు, రూ.500 సిలిండర్, రాజీవ్ ఆరోగ్య శ్రీ రూ.10 లక్షలకు పెంపు, 200 యూనిట్ల దాకా ఫ్రీ కరెంట్, రైతు కూలీలకు 12వేలు.. ఇవన్నీ మీకు అందితేనే కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యిండ్రి.. రైతు భరోసా వస్తేనే.. రుణమాఫీ అయితేనే ఓటెయ్యిండ్రి.. రాకపోతే మీ ఇష్టం ఉన్న నిర్ణయం తీసుకోండి’ అని సూచించడంతో పట్టభద్రులు తెల్లముఖం వేశారు.
పట్టభద్రుల సమ్మేళనాలు, సభలో తమ గురించి, తమ సమస్యల పరిష్కారం గురించి మాట్లాడాలి గాని ఇలా పథకాలపై ప్రచారం చేయడం ఏమిటని విస్తుపోయారు. ఇపుడున్న ఇంజినీరింగ్ కళాశాలల్లో చదివిన ఇంజినీర్లకంటే మేస్త్రీలకే ఎక్కువ నైపుణ్యం ఉంటున్నదని, అలాంటి వారి కోసమే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని స్థాపించామని సీఎం చెప్పారు. అన్నిచోట్లా రేవంత్ ప్రసంగం కేసీఆర్, బీఆర్ఎస్ జపంతోనే సాగింది. ఆయాచోట్ల కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై రేవంత్ విరుచుకుపడ్డారు. హైదరాబాద్ మెట్రోరైలు విస్తరణకు క్యాబినెట్లో ఆమోదం రాకపోడానికి కారణం కిషన్‌రెడ్డేనని, కేంద్రంలో ఆయన అడ్డుకోవడం వల్లే తెలంగాణ ప్రాజెక్టులన్నీ నిలిచి పోతున్నాయని, నీటి కేటాయింపులు తేలడం లేదని ఆరోపించారు. ఈ విషయాలన్నీ స్వయంగా బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులే తనతో చెప్పారన్నారు. రేవంత్‌రెడ్డి గవర్నమెంట్‌కు ఎలా సహకరిస్తారని కేంద్ర మంత్రులను కిషన్‌రెడ్డి బెదిరిస్తున్నారని మండిపడ్డారు.
మూసీ నది ప్రక్షాళనకు, రీజినల్ రింగ్ రోడ్డుకు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు, సీతారామ నీటి కేటాయింపులకు, రక్షణ భూములు బదిలీ కాకుండా కిషన్‌రెడ్డి అడ్డుకుంటున్నారని, తెలంగాణ దివాలా తీయాలని బీజేపీ వాళ్లంతా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో రెండు కోట్ల ఉద్యోగాల సంగతి ఏమోగాని, కిషన్‌రెడ్డికి, బండి సంజయ్‌కి మోదీ రెండు ఉద్యోగాలైతే ఇచ్చారని ఎద్దేవాచేశారు. కులగణన విషయంలో కిషన్‌రెడ్డి, బండి సంజయ్ సొల్లు వాగుడుతో ప్రజలను తప్పుదోవ పట్టించి బలహీనవర్గాకే తీరని నష్టం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్యక్రమాల్లో మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, సీతక్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేకుమార్ గౌడ్, ఎమ్మెల్సీ కోదండరాం, విప్‌లు అడ్లూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, గడ్డం వివేక్, గడ్డం వినోద్, కవ్వంపల్లి సత్యనారాయణ, సీహెచ్ విజయరమణారావు, మేడిపల్లి సత్యం, ఠాకూర్ మక్కాన్ సింగ్, కొక్కిరాల సురేఖ పాల్గొన్నారు.
ప్రసంగిస్తుండగానే వెళ్లిపోయిన పట్టభద్రులు
మంచిర్యాలలో మధ్యాహ్నం రెండు గంటల వరకు అనుకున్న సమ్మేళనం సాయంత్రం 5.30 గంటల వరకు కొనసాగింది. దీంతో పట్టభద్రులు విసుగెత్తిపోయారు. కాంగ్రెస్ లీడర్లు అందరూ మాట్లాడాక సీఎం ప్రసంగం ప్రారంభించగా అప్పటికే సాయంత్రం ఐదు దాటిపోవడంతో వచ్చిన ప్రైవేట్ స్కూళ్ల సిబ్బంది లేచి వెళ్లిపోపోయారు. వెంటనే అప్రమత్తమమైన స్థానిక కాంగ్రెస్ నాయకులు, పోలీసులు సభ నుంచి ఎవరూ వెళ్లకుండా అడ్డుకోవడం కనిపించింది. నిజామాబాద్‌లోనూ ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లోని రెండు హాళ్లలో పట్టభద్రులు కూర్చునేందుకు ఏర్పాట్లు చేసినా ఒక్క హాల్ కూడా పూర్తిగా నిండలేదు. రేవంత్ ప్రసంగిస్తుండగానే పట్టభద్రులు లేచి వెళ్లిపోయారు. హాల్ ఖాళీ అవుతుండడంతో ఎవరు బయటకు వెళ్లకుండా తలుపులు మూసేయడం కనిపించింది.
ఎంత ప్రయత్నించినా ప్రతికూల పవనాలు
కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం. ఈ స్థానాన్ని మళ్లీ నిలుపుకునేందుకు సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని పక్కన పెట్టి విద్యా వ్యాపారి అల్ఫోర్స్ నరేందర్‌రెడ్డిని బరిలో నిలిపింది. అభ్యర్థి గెలుపు కోసం ఏకంగా ఏడుగురు మంత్రులు, 23 మంది ఎమ్మెల్యేలను రంగంలోకి దింపింది. తమ అభ్యర్థి కోసం ఎంత ప్రచారం చేసినా ప్రతికూల పవనాలే వీస్తున్నట్టు చర్చ జరుగుతున్నది. స్వయంగా ముఖ్యమంత్రి వచ్చి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్తున్నా.. ఇంకో అడుగు ముందుకేసి.. ‘రైతులు గుండెల మీద చెయ్యి వేసుకొని, ఆలోచన చేసి రుణమాఫీ జరిగిందని మీరు నమ్మితేనే పట్టభద్రులైన మీ పిల్లలతో మాకు ఓటేయించండి.. సన్న వడ్లకు బోనస్ పడ్డదని మీరు విశ్వసిస్తేనే మాకు ఓటు వేయించండి’ అని పట్టభద్రల తల్లిదండ్రులకు పిలుపునివ్వడం గమనార్హం. ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి పూర్తిగా విస్మరించిన కాంగ్రెస్‌పై పట్టభద్రులు అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తున్నది. మరోవైపు ప్రచారం మొదలు పెట్టిన నాటి నుంచే కాంగ్రెస్ అభ్యర్థి సొంత విద్యాసంస్థల పూర్వ విద్యార్థులు, తల్లితండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలో రేవంత్ కూడా ‘నరేందర్‌రెడ్డి ఓడినా నష్టం లేదు’ అని మాట్లాడడంతో కాంగ్రెస్ శ్రేణుల గొంతులో వెలక్కాయ పడ్డట్టయింది.
బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్
రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో బీఆర్ఎస్ నాయకులతో పాటు పలువురు ఆటో యూనియన్ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేసి ఠాణాలకు తరలించారు. కోటపల్లి మండలం రాంపూర్‌లో బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి మారిశెట్టి విద్యాసాగర్‌తో పాటు పార్టీ నాయకులను, శ్రీరాంపూర్‌లో బీఆర్ఎస్ మండల కార్యదర్శి పంబాల ఎర్రయ్య, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండీ రఫీక్ఖాన్ను, చెన్నూర్‌లో రేవెల్లి మహేశ్, బుర్ర రాకేశ్ గౌడ్, వేముల మహేందర్, షఫీని, భీమారం మండలంలో దాసరి మధునయ్యను, జైపూర్, బెల్లంపల్లిలో ఆటో యూనియన్ నాయకులను అరెస్ట్ చేశారు.