Districts Reorganization | హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపడతామని, వాటి సంఖ్యను తగ్గిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు అటు నిపుణులను, ఇటు సామాన్యులను విస్మయానికి గురిచేస్తున్నాయి. పది జిల్లాలుగా ఉన్న తెలంగాణను కేసీఆర్ ప్రభుత్వం అనేక చర్చోపచర్చలు, తర్జనభర్జనలు, ప్రజాభిప్రాయ స్వీకరణ అనంతరం 33 జిల్లాలుగా విస్తరించింది. కొత్త జిల్లాల కేంద్రంగా పాలన సవ్యంగా సాగుతున్నది. ఇప్పుడు మళ్లీ జిల్లాల సంఖ్యను కుదిస్తే కొత్త సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొత్త, చిన్న జిల్లాలతో ప్రభుత్వ పాలన ప్రజలకు చేరువైందని, కలెక్లర్ల ప్రత్యక్ష పర్యవేక్షణ పెరిగిందని, ప్రజా సమస్యలు వేగంగా పరిష్కారం అవుతున్నాయని చెప్తున్నారు.
అన్ని శాఖలకు జిల్లా స్థాయి అధికారులు ఉండటంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా ప్రజలకు చేరుతున్నాయని అంటున్నారు. ఎస్పీ కార్యాలయాలు పెరగడంతో నేరాలు గణనీయంగా తగ్గాయని ఉదహరిస్తున్నారు. ఒకప్పుడు ప్రజలు జిల్లా అధికారులను కలవాలంటే వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేదని, ఒకటి రెండు రోజులు సమయం వృథా అయ్యేదని గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం 50-80 కిలోమీటర్ల దూరంలోనే జిల్లా కేంద్రం అందుబాటులోకి వచ్చిందని, ఒక్క రోజులోనే పని పూర్తవుతున్నదని చెప్తున్నారు.
జిల్లాల సంఖ్యను తగ్గించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందన్నది నిపుణుల మొదటి ప్రశ్న. జిల్లా కేంద్రాలు అభివృద్ధికి చిహ్నాలని, విద్య, ఉద్యోగ, పారిశ్రామికీకరణ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి వీలు కలుగుతుందని చెప్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు జనాభా, జనసాంద్రత, భౌగోళిక విస్తీర్ణం, ఆ ప్రాంత ప్రజల జీవనశైలి, ప్రజల నుంచి వచ్చే డిమాండ్లు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. గతంలో జరిగిన కొత్త జిల్లాల ఏర్పాటులో ఇలాంటి పద్ధతే పాటించారు. ఏపీలో ఇటీవల జరిగిన జిల్లాల పునర్విభజనలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేశారు. సీఎం ప్రతిపాదిస్తున్న పునర్విభజన లేదా పునరేకీకరణకు ప్రతిపాదిక ఏమిటనేది ఇంకా స్పష్టత రాలేదు. 2026లో నియోజకవర్గాల పునర్విభజన ఉన్నదని, మరి అప్పుడు కూడా మళ్లీ కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు.
కొత్త జిల్లాల ఏర్పాటు లేదా జిల్లాల తగ్గింపు సులభం కాదని విశ్లేషకులు చెప్తున్నారు. ఉద్యోగుల సర్దుబాటు కష్టమవుతుందని స్పష్టం చేస్తున్నారు. జిల్లాల వారీగా ఉద్యోగుల విభజన పూర్తయిందని, క్యాడర్ స్ట్రెంత్ నిర్ణయం అయ్యిందని, కొత్త జిల్లాలతో మళ్లీ మొదటికి వస్తుందని అంటున్నారు. ఎన్ని జిల్లాలు తగ్గిస్తే.. అదే సంఖ్యలో కలెక్టర్ పోస్టులు, హెచ్వోడీలు, ఆయా కార్యాలయాల్లో పనిచేసే అటెండర్ల వరకు అన్ని పోస్టులు రద్దు అవుతాయని చెప్తున్నారు. ఫలితంగా ఉన్నతాధికారుల సంఖ్య భారీగా పడిపోతుందని, ఇప్పుడు పదోన్నతులు వేగంగా వస్తున్నాయని, జిల్లాల సంఖ్య తగ్గితే ఆలస్యం అవుతాయని వివరిస్తున్నారు.