హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : ఫార్ములా ఈ-రేస్‌పై శుక్రవారం శాసనసభలో సీఎం మాట్లాడిన తీరు తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. సాక్షాత్తూ ప్రభుత్వమే ఎఫ్ఈవోతో ఒప్పందం చేసుకున్నా, దీనికి సంబంధించిన వివరాలన్నీ ఇదివరకే మీడియాలో వచ్చినా తనకు ఎఫ్ఈఓ ప్రతినిధి చెప్పేదాకా ఏమీ తెలియదని ముఖ్యమంత్రి పేర్కొనడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రతిష్ఠాత్మకమైన ఈవెంట్‌ను నిర్వహించి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను ప్రపంచవ్యాప్తంగా అనుమడింపజేసేలా చేసిన కార్యక్రమంపై సీఎం కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విశ్లేషకులు విమర్శిస్తున్నారు.
సీఎం: బీఏసీలో బీఆర్ఎస్ ఇచ్చిన 9 అంశా ల్లో ఫార్ములా-ఈ అంశం లేదు. ఇప్పుడు చర్చించాలని పట్టుబడుతున్నారు.
వాస్తవం: బీఏసీ సమావేశం నాటికి ప్రభు త్వం ఈ అంశాన్ని ప్రస్తావించలేదు. ఫార్ములా ఈరేస్‌పై ప్రభుత్వం గురువారం కేసు నమోదు చేసింది. అసెంబ్లీలో వాస్తవాలు వెల్లడించేందుకు చర్చకు బీఆర్ఎస్ పట్టుబడుతున్నది.
సీఎం: ఎఫ్ఈవో (ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్) ప్రతినిధి వచ్చి మాకు కేటీఆర్‌తో వ్యవహారం ఉన్నది. రూ.600 కోట్లు ఇవ్వాలని కోరాడు. ఇందులో లోపాయికారి ఒప్ప దం గురించి చెప్పాడు. ప్రజల సొమ్ము ప్రజలకే చెందాలని చెప్పిన. ఆయన చెప్పినప్పుడే అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నా. విచారణ చేయాలని చెప్పిన.
వాస్తవం : 2023 ఫిబ్రవరిలోనే హైదరాబాద్‌లో ఈ-రేస్ నిర్వహించారు. దీన్ని దేశ విదేశాలకు చెందిన అనేకమంది ప్రముఖులు వీక్షించారు. దీనికి కొనసాగింపుగా వచ్చే ఏడాది కూడా రేస్ ఉంటుందని నాడే ప్రకటించారు. ప్రస్తుత సీఎం అప్పుడు మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నారు. ప్రపంచానికి తెలిసిన విషయం ఎఫ్ఈవో ప్రతినిధి వచ్చి తనకు చెప్పేవరకు తెలియదనడం విస్తుగొలుపుతున్నది. ఒప్పందం ప్రకారమే ప్రభుత్వం వారికి రూ.55 కోట్లు చెల్లించినట్టు స్వయంగా కేటీఆర్ ప్రకటించారు.
ప్రభుత్వమే వారికి చెల్లించినట్టు ఆధారాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం చెల్లించకపోవడంతో ఒప్పందాన్ని రద్దుచేసుకున్నట్టు ఎఫ్ఈవో ప్రకటించింది. వ్యవహారం అర్బిట్రేషన్‌లో ఉన్నది. ఈ విషయం స్థానిక, జాతీయ మీడియాలోనూ వచ్చింది. అయినా ఆయన చెప్పేదాకా తనకు తెలియదనడంలో ఆంతర్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఫార్ములా ఈ రేస్ వల్ల హైదరాబాద్ నగరం టోక్యో, షాంఘై, బెర్లిన్, మొనాకో, లండన్ వంటి టాప్-25 నగరాల సరసన హైదరాబాద్ చేరింది. నగర ప్రతిష్ఠ ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. ఈ-రేస్ తర్వాత తెలంగాణకు రూ.700 కోట్ల మేర ఆర్థిక లబ్ధి కలిగినట్టు నిల్సన్ స్పోర్ట్స్ అనాలసిస్ సంస్థ వెల్లడించింది. ఆతిథ్య నగరంగా హైదరాబాద్ పరపతి పెరిగినట్టు సదరు సంస్థ తెలిపింది. ప్రజల సొమ్ము ప్రజలకే చెందాలంటే నగరానికి జరిగిన ఈ మేలు ప్రజాప్రయోజనం కాదా? అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
సీఎం: ఎంఏయూడీ, పోలీసు శాఖ నా దగ్గరే ఉన్నాయి. కేటీఆర్ కోర్టును ఆశ్రయించారు. కోర్టులో వాదనలు జరుగుతున్నా యి కాబట్టి ఇప్పుడు వివరాలు వెల్లడించడం సరికాదు. కోర్టులో పరిస్థితి అంచనా వేశాక సభలో అయినా, ఎక్కడైనా, చివరికి వాళ్ల పార్టీ ఆఫీసులో అయినా చర్చించేందుకు వస్తా. అన్నీ తర్వాత వివరిస్తా.
వాస్తవం: హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచడంతోపాటు పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఫార్ములా ఈ-రేస్‌ను ప్రభుత్వం నిర్వహించింది. ఇందు లో భాగంగానే ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎంఎస్సీఐ)కు రూ.55 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. ఈ విషయాలన్నీ గతంలో కేటీఆర్ వివరించారు. దాస్తున్నదేమీ లేదని తాజా గా ప్రకటించారు. అయినా ఇందులో ఏదో మతలబు ఉన్నట్టు సీఎం చెప్పడంలో ఆంతర్యమేమిటనేది అర్థం కావడంలేదు.