హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన తమ్మిడిహట్టి బరాజ్‌ను నిర్మించి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పునరుద్ఘాటించారు. హైదరాబాద్ మహానగరానికి గోదావరి జలాల తరలింపు పథకం 2-3 దశలకు గండిపేట వద్ద సోమవారం శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. తమ్మిడిహట్టి బరాజ్ నిర్మాణం కోసం మహారాష్ట్ర ముఖ్యమంత్రితో స్వయంగా మాట్లాడతానని చెప్పా రు.
అక్కడ 152 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మాణం చేపట్టాలనుకోగా… మహారాష్ట్ర 148 మీటర్లకు అంగీకరించిందని, మధ్యేమార్గంగా 149, 150 మీటర్లకు మహారాష్ట్రను ఒప్పించి తమ్మిడిహట్టి దగ్గర బరాజ్ నిర్మాణంతో ఆదిలాబాద్ జిల్లాలో లక్షన్నర, రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు. అదేవిధంగా మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి ఉమ్మడి మెదక్ జిల్లాకు సాగునీరు అందుతుందని… మల్లన్నసాగర్ నుంచి రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ వరకు గోదావరి జలాలను అందిస్తామని చెప్పారు. మూసీ సుందరీకరణలో భాగంగా గోదావరి జలాలను మూసీకి తరలించనున్నట్టు వెల్లడించారు. తద్వారా మూసీ ప్రక్షాళన జరుగుతుందని… ఈ ప్రక్రియతో భువనగిరి, ఆలేరు, మునుగోడు ప్రాంతాల్లో ఫ్లోరైడ్ సమస్య తీరుతుందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
మల్లన్నసాగర్ నుంచి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు గోదావరి జలాలను తరలిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడం విస్మయానికి గురిచేస్తున్నది. కృష్ణా బేసిన్‌లోని రంగారెడ్డి జిల్లాలోని అనేక ప్రాంతాలకు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా కృషా ్ణజలాలను తరలించి ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టు డిజైన్ చేసింది. ఆ మేరకు ఉద్దండాపూర్ వరకు రిజర్వాయర్ నిర్మాణం పూర్తయింది. అక్కడినుంచి ప్రస్తుత రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే కాల్వల నిర్మాణాన్ని రూ.5 వేల కోట్లతో చేపడుతూ కేసీఆర్ ప్రభుత్వం టెండర్లు కూడా పూర్తి చేసింది.
కానీ, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆ టెండర్లను రద్దు చేసింది. అయితే, తిరిగి టెండర్లు పిలుస్తారని అందరూ భావించారు. కానీ, తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి కృష్ణాజలాల తరలింపు లేనట్టేననే సంకేతాలిచ్చారు. మల్లన్నసాగర్ నుంచి ఈ ప్రాంతాలకు సాగునీరు అందించనున్నట్టు స్పష్టంచేశారు. కాగా మూసీ ప్రక్షాళనతో నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడంపై సామాజిక మాద్యమాల్లో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మూసీ ప్రక్షాళనకు… ఫ్లోరైడ్ సమస్యకు ఏం సంబంధం? అని ప్రశ్నిస్తున్నారు. నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యకు మూసీ మురికికూపంగా మారడమే కారణమా? అని సెటైర్లు వేస్తున్నారు.