హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): ‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తాపత్రయం పడుతున్నది నేను. నాకు తోడుగా ఉండండి. రక్షణ కవచంలా ఉండి రిజర్వేషన్లను కాపాడుకోండి’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీసీ నేతలకు సూచించారు. 2029 ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లే ప్రధాన జెండా కావాలని చెప్పారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చినందుకు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, ఇతర నాయకులు రేవంత్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రిజర్వేషన్లపై ఎవరైనా కోర్టుకు వెళ్తే వాదించడానికి ఢిల్లీ నుంచి ఉద్ధండులైన న్యాయవాదులను నియమిస్తామని తెలిపారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఎంపీలతోపాటు ఇండియా కూటమి ఎంపీలకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని, అన్నిరాష్ట్రాల్లో రిజర్వేషన్లు అమలైతేనే నిజమైన విజయమని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్ చేర్చి చట్టబద్ధత కల్పించాల్సింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేనని స్పష్టంచేశారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు లక్ష్మణ్, ఆర్ కృష్ణయ్య దీనిని సాధించాలని కోరారు.