CM Revant Reddy | త్వరితగతిన ఆర్ఆర్ఆర్ భూసేకరణ.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం
CM Revant Reddy | ప్రాంతీయ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగానికి సంబంధించి భూ సేకరణను త్వరగా పూర్తి చేయాలని సీఎం ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. రైతులకు పరిహారం నిర్ణయించే విషయంలో ఉదారంగా వ్యవహరించాలని సూచించారు.
CM Revant Reddy | ప్రాంతీయ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగానికి సంబంధించి భూ సేకరణను త్వరగా పూర్తి చేయాలని సీఎం ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. రైతులకు పరిహారం నిర్ణయించే విషయంలో ఉదారంగా వ్యవహరించాలని సూచించారు. ఆర్బిట్రేటర్లుగా ఉన్న జిల్లా కలెక్టర్లు వీలైనంత ఎక్కువ మొత్తంలో రైతులకు పరిహారం అందేలా చూడాలన్నారు. ఆర్ఆర్ఆర్, జాతీయ రహదారుల భూ సేకరణ, పరిహారం, హ్యామ్ (హైబ్రీడ్ యాన్యుటి మోడల్) విధానంలో రహదారుల నిర్మాణం, రేడియల్ రోడ్ల నిర్మాణాలపై రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. భూ సేకరణ సమయంలో స్థానిక ప్రజా ప్రతినిధులతోనూ చర్చించాలని చెప్పారు. తరచూ రైతులతో సమావేశమై.. ఆయా రహదారుల నిర్మాణాలతో కలిగే ప్రయోజనాలను వివరించి భూ సేకరణను వేగవంతం చేయొచ్చని అన్నారు. ఆర్ఆర్ఆర్ (దక్షిణ)కు ఎన్హెచ్ఏఐ సూత్రప్రాయ ఆమోదం తెలిపినందున హెచ్ఎండీఏతో అలైన్మెంట్ చేయించాలని సూచించారు.
హైదరాబాద్‌ను కలిపే 11 రహదారులకు ఆటంకం లేకుండా రేడియల్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రేడియల్ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండడం, పారిశ్రామికాభివృద్ధికి అనుకూలంగా ఉండడంతో పాటు ఔటర్ రింగు రోడ్డు, ఆర్ఆర్ఆర్ అనుసంధానంలో ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. రాష్ట్రంలోని మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్-భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, ఖమ్మం మీదుగా సాగే నాగ్‌పూర్-విజయవాడ (ఎన్‌హెచ్-163జీ) రహదారి, ఆర్మూర్-జగిత్యాల-మంచిర్యాల రహదారి (ఎన్‌హెచ్-63), జగిత్యాల-కరీంనగర్ (ఎన్‌హెచ్ 563) రహదారుల నిర్మాణంతో పాటు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల (ఎల్‌డబ్ల్యూఎఫ్) రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ, అటవీ అనుమతుల్లో అడ్డంకుల తొలగింపునకు సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు.
ప్రజలకు ఉపయోగపడే రహదారుల నిర్మాణంలో అటవీ శాఖ ఎందుకు కొర్రీలు పెడుతోందని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు (పీసీసీఎఫ్) డోబ్రియల్‌ను సీఎం ప్రశ్నించారు. గతంలో కొన్ని నిబంధనలు పాటించకపోవడంతో సమస్యలు ఉన్నాయని పీసీసీఎఫ్ బదులిచ్చారు. రాష్ట్ర స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యలను ఇక్కడే పరిష్కరిస్తామని, కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు సంబంధించిన సమస్యలపై వెంటనే నివేదిక రూపంలో సమర్పించాలని సీఎం ఆదేశించారు. ఆర్ అండ్ బీ, అటవీ శాఖ నుంచి ఒక్కో అధికారిని ప్రత్యేకంగా ఈ సమస్యల పరిష్కారానికి కేటాయించాలని సీఎం సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వారితో పది రోజులకోసారి సమీక్షించి త్వరగా క్లియరెన్స్ వచ్చేలా చూడాలని, ఇక్కడ కాకపోతే ఆర్ అండ్ బీ, అటవీ శాఖ మంత్రులు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి, అధికారులతో సమావేశమై అనుమతులు సాధించాలని సూచించారు. జాతీయ రహదారుల నిర్మాణంలో అండర్ పాస్‌ల నిర్మాణాన్ని విస్మరిస్తుండడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆ సమస్య ఎదురుకాకుండా నిర్మాణ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. రైతులు కిలోమీటర్ల కొద్ది దూరం వెళ్లి తిరిగి వచ్చే పరిస్థితి లేకుండా చూడాలని సీఎం సూచించారు.
హ్యామ్ విధానంలో రోడ్ల నిర్మాణం
రాష్ట్రంలో హ్యామ్ విధానంలో ఆర్ అండ్ బీ పరిధిలో 12 వేల కిలోమీటర్లు, పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 17,700 కిలోమీటర్లు రహదారులు నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ రహదారుల నిర్మాణంలో పాత జిల్లాలను యూనిట్‌గా తీసుకోవాలని సూచించారు. ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖ అనే తేడా లేకుండా ఒకే రకమైన నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఇందుకు అవసరమైన కన్సల్టెన్సీల నియామకం, డీపీఆర్ ల తయారీ, రహదారుల నిర్మాణం విషయంలో క్రియాశీలకంగా వ్యవహరించాలని అధికారులను సీఎం ఆదేశించారు. మూడేండ్లలో ఈ రహదారుల నిర్మాణం పూర్తికావాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బ తిన్న రహదారుల మరమ్మతులు చేపట్టాలని, కూలిన వంతెలను వెంటనే నిర్మించాలన్నారు.
రహదారుల నిర్మాణం, మరమ్మతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వాటా నిధులు వెంటనే విడుదల చేసి, కేంద్రం నుంచి రావాల్సిన మ్యాచింగ్ గ్రాంట్‌ను పొందాలని ఆర్థిక శాఖ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. సమీక్షలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఆర్ అండ్ బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్, సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీలు వీ శేషాద్రి, జీ చంద్రశేఖర్‌రెడ్డి, సీఎం కార్యదర్శులు షానవాజ్ ఖాసీం, మాణిక్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

