గజ్వేల్, అక్టోబర్ 18: సీఎం కేసీఆర్‌కు గజ్వేల్ నియోజకవర్గంలో లక్షకు పైగా ఓట్ల మెజార్టీ ఇస్తామని వివిధ సంఘాల ప్రతినిధులు తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో బుధవారం పాస్టర్లు, ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులు, కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ల నియోజకవర్గ స్థాయి సమావేశాలు బుధవారం జరిగాయి. ఆయా సమావేశాల్లో సీఎం కేసీఆర్‌కు మద్దతునిస్తూ ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. ఆయా తీర్మానప్రతులను ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్‌కు ఆయా సంఘాల బాధ్యులు అందజేశారు.
కేసీఆర్‌కు లక్ష ఓట్ల మెజార్టీ తగ్గకుండా ప్రతి ఒక్కరం కృషి చేస్తామని ప్రతినబూనారు. గజ్వేల్ రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. వచ్చే ఐదేండ్లలో పరిశ్రమల ఏర్పాటుకు కేసీఆర్ కృషి చేస్తారని తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు కృషితోనే నేడు గజ్వేల్‌కు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు వచ్చిందని చెప్పారు. ఆయా సమావేశాల్లో గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, రైతుబంధు సమితి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దేవీ రవీందర్, ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పంగ మల్లేశం, కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ సంఘం బాధ్యులు దేవదాసు, వెంకటేశ్వర్లు, రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.