CM KCR | హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ బహుజన చైతన్యానికి, మహిళా శక్తికి చాకలి ఐలమ్మ ప్రతీక అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ఐలమ్మ 38వ వర్ధంతి (సెప్టెంబర్ 10) సందర్భంగా సాయుధ తెలంగాణ పోరాట కాలంలో ఐలమ్మ కనబరిచిన ధైర్య సాహసాలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. వివక్షను ఎదురిస్తూ సాగిన నాటి ఆమె పోరాట స్ఫూర్తి, తెలంగాణ సాధన ఉద్యమంలో ఇమిడి ఉన్నదని సీఎం తెలిపారు. ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ, తెలంగాణ పోరాట యోధులను సమున్నత రీతిలో స్మరించుకుంటున్నదని తెలిపారు. సబ్బండ కులాలు, మహిళల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికి ఆదర్శవంతంగా నిలిచాయని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.