Akhil | అక్కినేని యువ హీరో అఖిల్ అక్కినేని కెరీర్లో ఎంతో కీలకమైన మలుపు తీసుకొచ్చిన చిత్రం ‘లెనిన్’. చాలా కాలంగా సరైన కమర్షియల్ విజయం కోసం ఎదురుచూస్తున్న అఖిల్‌కు ఈ సినిమా భారీ ఊరటనిచ్చింది. కేవలం హిట్‌తో సరిపెట్టకుండా రూ.100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిన ఈ చిత్రం అఖిల్ కెరీర్‌కు కొత్త ఊపునిచ్చింది. దీంతో అక్కినేని అభిమానులు కూడా ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇప్పుడు ఆ సక్సెస్ జోష్‌లోనే అఖిల్ తన తదుపరి సినిమాకు సిద్ధమవుతున్నారనే ప్రచారం నడుస్తోంది.‘లెనిన్’ సినిమాలో అఖిల్ తొలిసారిగా పూర్తిస్థాయి గ్రామీణ యువకుడి పాత్రలో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. రింగుల జుట్టు, గుబురు గడ్డం, కోర మీసాలతో పక్కా రగ్గడ్ లుక్‌లో కనిపించిన అఖిల్.. సినిమా ప్రమోషన్ల సమయంలోనూ అదే గెటప్‌ను కొనసాగించారు.
అయితే తాజాగా అఖిల్ తన లుక్‌ను పూర్తిగా మార్చేశారు. ఇటీవల తన సతీమణి జైనబ్‌తో కలిసి ఎయిర్‌పోర్టులో కనిపించిన అఖిల్.. హెయిర్ కట్, ట్రిమ్ చేసిన గడ్డంతో ఎంతో స్టైలిష్‌గా దర్శనమిచ్చారు. ఈ కొత్త మేకోవర్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అఖిల్ కొత్త లుక్‌ను చూసిన అభిమానులు వెంటనే ఇది ఆయన తదుపరి సినిమా కోసమే అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘Akhil 7’ గురించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే అఖిల్ తన తదుపరి ప్రాజెక్టుపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖిల్ ఓ సినిమా చేయనున్నారని, ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు దర్శకుడు పరశురామ్ పెట్లాతో కూడా అఖిల్ ఓ ప్రాజెక్ట్ చేయవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీటిలో ఏది నిజమనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
‘ఏజెంట్’ సినిమా తర్వాత కొంతకాలం విరామం తీసుకున్న అఖిల్.. ‘లెనిన్’తో మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చారు. ఈ సందర్భంగా అభిమానులకు ఇకపై ఎక్కువ గ్యాప్ తీసుకోనని హామీ ఇచ్చారు. తన వద్ద ఇప్పటికే రెండు కథలు సిద్ధంగా ఉన్నాయని, త్వరలోనే కొత్త సినిమా గురించి ప్రకటన చేస్తానని ఆయన చెప్పారు. అంతేకాదు, తన తదుపరి రెండు సినిమాలు కూడా పీరియడ్ నేపథ్యం లేదా విభిన్నమైన కాన్సెప్ట్‌లతో ఉండే అవకాశం ఉందని అఖిల్ గతంలో సూచించారు. ఈసారి సినిమా నుంచి సినిమాకు ఎక్కువ విరామం తీసుకోనని, అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా వరుసగా సినిమాలు చేస్తాననే సంకేతాలు ఇచ్చారు.