Ajith | కోలీవుడ్ స్టార్ హీరో, ప్రొఫెషనల్ కార్ రేసర్ అజిత్ కుమార్ మరోసారి ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. సినిమాలతో పాటు కార్ రేసింగ్‌పై అజిత్‌కు ఉన్న మక్కువ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం యూరప్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఎండ్యూరెన్స్ రేసింగ్ పోటీల్లో అజిత్ కుమార్ రేసింగ్ టీమ్ పాల్గొంటోంది. ఈ క్రమంలో ఆదివారం జరిగిన రేస్‌లో అజిత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురవడం కలకలం రేపింది. రేసింగ్ ట్రాక్‌పై వేగంగా దూసుకెళ్తున్న సమయంలో అజిత్ ఉన్న కారు అదుపుతప్పి మరో వాహనాన్ని ఢీకొట్టింది. హైస్పీడ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, వివరాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రేసింగ్ సమయంలో ఇలాంటి ప్రమాదాలు సహజమే అయినప్పటికీ, అజిత్ స్వయంగా కారులో ఉండటంతో అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
అయితే అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో అజిత్ కుమార్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. ఆయన సురక్షితంగా బయటపడినట్లు తెలియడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. తమ అభిమాన హీరో క్షేమంగా ఉన్నారని తెలుసుకున్న తర్వాత సోషల్ మీడియాలో అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. సినిమా షూటింగ్‌ల మధ్య కూడా అజిత్ కార్ రేసింగ్‌కు సమయం కేటాయిస్తుంటారు. కేవలం సరదా కోసం మాత్రమే కాకుండా, ప్రొఫెషనల్ స్థాయిలో రేసింగ్ పోటీల్లో పాల్గొంటూ తన సత్తా చాటుతున్నారు. అంతర్జాతీయ వేదికలపై తన టీమ్‌తో కలిసి ఎండ్యూరెన్స్ రేసింగ్ పోటీల్లో పాల్గొంటున్న అజిత్, నటుడిగానే కాకుండా రేసర్‌గా కూడా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.
అయితే రేసింగ్‌లో వేగం ఎంత కీలకమో, భద్రత కూడా అంతే ముఖ్యమనే విషయం మరోసారి ఈ ఘటనతో స్పష్టమైంది. భారీ వేగంతో జరిగిన ఢీకొన్న ఘటన నుంచి అజిత్ ఎలాంటి గాయాలు లేకుండా బయటపడటం అభిమానులకు పెద్ద ఊరట కలిగించింది. సినిమాల విషయానికి వస్తే, ఇటీవల ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ తో ప్రేక్షకులను అలరించిన అజిత్ కుమార్, ఇప్పుడు దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డేర్ డెవిల్స్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, ఈ చిత్ర నిర్మాణ బాధ్యతల్లో అజిత్ సతీమణి షాలిని అజిత్ కుమార్ కూడా భాగమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై కోలీవుడ్‌లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది.