మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Nov 16, 2020 , 02:59:34

ఆర్టీసీకి ఆసరా

ఆర్టీసీకి ఆసరా

  • ప్రభుత్వ సంస్థలను బతికించుకుంటాం
  • కరోనాతో వెనుకబడిన ప్రగతి రథాన్ని ఆదుకొంటాం
  • లాక్‌డౌన్‌లో కోత విధించిన వేతనాలు వెంటనే చెల్లింపు
  • రాష్ట్రంలో బస్సు సర్వీసులు యాభై శాతానికి పెంచాలిసంస్థ
  • పనితీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష
  • పార్శిల్‌ సేవలు విజయవంతంపై హర్షం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఎన్ని కష్టాలకు ఓర్చయినా ప్రభుత్వరంగ సంస్థలను బతికించుకుంటామని, అదే తెలంగాణ ప్రభుత్వం విధానమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఉద్ఘాటించారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీ.. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ప్రగతిపథంలోకి వచ్చిందని, కరోనా నేపథ్యంలో వెనుకంజ వేసిన ఆ సంస్థను తిరిగి సాధారణ స్థితికి చేరుస్తామని చెప్పారు. లాక్‌డౌన్‌ సమయంలో ఉద్యోగుల వేతనాల్లో కోత విధించిన 50 శాతాన్ని వెంటనే చెల్లించాలని, బస్సు సర్వీసులను 50 శాతానికి పెంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం ప్రగతిభవన్‌లో ఆర్టీసీపై సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలతో లాభాలబాట పడుతున్న సమయంలోనే ఆర్టీసీకి కరోనా కష్టాలను తెచ్చిపెట్టిందని, అయినప్పటికీ వెనుకడుగు వేయకుండా సంస్థను తిరిగి బతికించుకుంటామని తెలిపారు. ప్రజలకు అత్యంత చౌకగా రవాణా అందిస్తున్న సంస్థ ఆర్టీసీ అని, ఆనేక కుటుంబాలు దానిపై ఆధారపడి బతుకుతున్నాయని చెప్పారు. ఈ కారణాల వల్లే లాభనష్టాల గురించి ఆలోచించకుండా ఆర్టీసీని కాపాడుకొనేందుకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నామని వివరించారు. లాక్‌డౌన్‌ సమయంలో రెండునెలల పాటు ఉద్యోగుల వేతనాల్లో కోత విధించిన యాభైశాతం సత్వరమే చెల్లించాలని.. ఇందుకోసం అవసరమైన రూ.120 కోట్లను వెంటనే విడుదల చేయాలని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు.

కార్గో సేవలపై హర్షం

కరోనా భయంతో అనేకమంది వ్యక్తిగత వాహనాల వాడకానికే మొగ్గుచూపుతుండటంతో ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో తగ్గిపోయిందని, ఇది తిరిగి నష్టాలకు దారితీస్తున్నదని సీఎం కేసీఆర్‌ వివరించారు. కరోనా కష్టాలను దాటుకుంటూ తగు నిర్ణయాలను తీసుకోవాలని, ఎలాంటి చర్యలు తీసుకుంటే ఆర్టీసీని మళ్లీ కరోనా ముందటి పరిస్థితికి తీసుకురాగలమో విశ్లేషించుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడుతున్న నేపథ్యంలో బస్సు సర్వీసులను 50 శాతానికి పెంచాలని సూచించారు. హైదరాబాద్‌లో సిటీ బస్సుల సంఖ్యను పెంచడం ద్వారా జిల్లాల నుంచి వచ్చిపోయేవారికి రవాణా భరోసా దొరుకుతుందని వివరించారు. ఆర్టీసీ ప్రవేశపెట్టిన కార్గో సేవలను ప్రజలు గొప్పగా ఆదరిస్తున్నారని, భవిష్యత్‌లో రైల్వేల మాదిరి ఆర్టీసీ కూడా కార్గో సేవలతో లాభాలతో నడుస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. కార్గో సేవలను ప్రారంభించిన కొద్దికాలంలోనే మిలియన్‌ పార్శిళ్లను రవాణా చేయడంపై సీఎం కేసీఆర్‌ హర్షం వ్యక్తంచేశారు. అందుకు కృషిచేసిన రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఆర్టీసీ అధికారులను అభినందించారు.


ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేస్తున్న కేంద్రం

కేంద్రప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు ప్రభుత్వరంగ సంస్థలకు శాపంగా మారాయని, ప్రభుత్వోద్యోగులు అభద్రతాభావానికి గురవుతున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆవేదన వ్యక్తంచేశారు. ఎల్‌ఐసీసహా అనేక ప్రభుత్వరంగ సంస్థలను ఎన్డీయే సర్కారు ప్రైవేట్‌పరం చేస్తూ వస్తున్నదని మండిపడ్డారు. విద్యుత్‌శాఖలోనూ ప్రైవేటు భాగస్వామ్యం పెంచాలని కేంద్రం ఒత్తిడి తీసుకువచ్చిందని.. అందుకు తెలంగాణ ప్రభుత్వం ససేమిరా అన్నదని వివరించారు. అంతేకాక విద్యుత్‌శాఖలో వేలమంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేశామని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రభుత్వ రంగసంస్థలన్నింటినీ ప్రభుత్వం కాపాడుకుంటుందని, ఉద్యోగ భద్రతను కల్పిస్తున్నదని పేర్కొన్నారు. సమావేశంలో మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్‌, సబితా ఇంద్రారెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, సీఎం ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, రెవెన్యూశాఖ కార్యదర్శి శేషాద్రి, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, సీఎంవో అధికారులు, ఎంఏయూడీ డైరెక్టర్‌ సత్యనారాయణ, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ రఘునందన్‌రావు, ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

సీఎంకు మంత్రి పువ్వాడ కృతజ్ఞతలు

ఆర్టీసీకి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నివిధాలుగా అండగా ఉంటున్నారని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ చెప్పారు. కోత విధించిన వేతనాలను చెల్లించేందుకు రూ.120 కోట్లను మంజూరు చేయడంపై ఆయన హర్షం వ్యక్తంచేశారు. సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలు, సూచనల వల్లే ఏపీతో ఒప్పందం కుదిరిందని.. తెలంగాణ ఆర్టీసీకీ అదనంగా లక్షలాది కిలోమీటర్ల రవాణా హక్కు దక్కిందని పేర్కొన్నారు.

కరోనా భయంతో అనేకమంది వ్యక్తిగత వాహనాల వాడకానికే మొగ్గుచూపుతుండటంతో ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో తగ్గిపోయింది, ఇది తిరిగి నష్టాలకు దారితీస్తున్నది. కరోనా కష్టాలను దాటుకుంటూ తగు నిర్ణయాలను తీసుకోవాలి. ఎలాంటి చర్యలు తీసుకుంటే ఆర్టీసీని మళ్లీ కరోనా ముందటి పరిస్థితికి తీసుకురాగలమో విశ్లేషించుకోవాలి. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడుతున్న నేపథ్యంలో బస్సు సర్వీసులను 50 శాతానికి పెంచాలి. హైదరాబాద్‌లో సిటీ బస్సుల సంఖ్యను పెంచడం ద్వారా జిల్లాల నుంచి వచ్చిపోయేవారికి రవాణా భరోసా దొరుకుతుంది.

- సీఎం కేసీఆర్‌

కేంద్రప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు ప్రభుత్వరంగ సంస్థలకు శాపంగా మారాయి. ప్రభుత్వోద్యోగులు అభద్రతాభావానికి గురవుతున్నారు. ఎల్‌ఐసీసహా అనేక ప్రభుత్వరంగ సంస్థలను ఎన్డీయే సర్కారు ప్రైవేట్‌పరం చేస్తూ వస్తున్నది. విద్యుత్‌శాఖలోనూ ప్రైవేటు భాగస్వామ్యం పెంచాలని కేంద్రం ఒత్తిడి తీసుకువచ్చింది. అందుకు తెలంగాణ ప్రభుత్వం ససేమిరా అన్నది. విద్యుత్‌శాఖలో వేలమంది కాంట్రాక్టు ఉద్యోగులను 

రెగ్యులరైజ్‌ చేశాం. ప్రభుత్వ రంగసంస్థలన్నింటికీ భరోసానిస్తూ ఉద్యోగ భద్రతను కల్పిస్తున్నాం.

-ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు