హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలోని ప్రతి ఆవాసానికి ఒక క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. క్రీడారంగంలో యువతను ప్రొత్సహించడం ద్వారా అద్భుతాలు సృష్టించవచ్చన్న ఆలోచనతో 24 వేల ఎకరాల్లో క్రీడా ప్రాంగణాలు నిర్మించాలని నిర్ణయించారు. ప్రతి ఆవాసంలో కనీసం ఎకరం స్థలంలో తెలంగాణ క్రీడా ప్రాంగణం (టీకేపీ) ఉండాలని, పట్టణాల్లో ప్రతి వార్డుకు ఒక క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో 19,472, పట్టణ ప్రాంతాల్లో 5,001 టీకేపీలను ఏర్పాటు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకొన్నారు.
వీటిలో చాలా టీకేపీల పనులు జోరుగా సాగుతున్నాయి. ప్రతి టీకేపీలో ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, లాంగ్ జంప్ పిట్తో పాటు వ్యాయామం కోసం సింగిల్, డబుల్ బార్లను ఏర్పాటు చేస్తున్నారు. జూన్ 2 నాటికి పట్టణాల్లో 510 క్రీడా ప్రాంగణాలతోపాటు మండలాల్లో కనీసం రెండు చొప్పున టీకేపీలను ప్రారంభించేందుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. క్రీడా ప్రాంగణాల కోసం ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో 9,972 స్థలాలను గుర్తించారు. వాటిలో ఇప్పటికే 24 ఆవాసాల్లో పనులు పూర్తయి ప్రారంభానికి టీకేపీలు సిద్ధమయ్యాయి. మరో 1,366 టీకేపీల పనులు కొనసాగుతున్నాయి.
అలాగే పట్టణ ప్రాంతాల్లో ఇప్పటివరకు 679 ప్రాంగణాలకు 822 ఎకరాలను, జీహెచ్ఎంసీ పరిధిలో 84 క్రీడా ప్రాంగణాలకు 300 ఎకరాలను గుర్తించారు. రాష్ట్రంలోని మొత్తం 142 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మొత్తం 3,618 వార్డులు, డివిజన్లు ఉన్నాయి. జీహెచ్ఎంసీలోని ఒక్కో డివిజన్లో 3, ఇతర కార్పొరేషన్ పరిధిలోని డివిజన్లలో 2, చిన్న మున్సిపాలిటీల్లో వార్డుకు ఒకటి చొప్పున టీకేపీలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిని లెవలింగ్ చేసి గ్రౌండ్లను సిద్ధం చేస్తున్నారు. ప్రతి టీకేపీలో కనీసం 300 మొక్కలను నాటనున్నారు. వీటిని పర్యవేక్షించేందుకు ప్రతి మండలంలో ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశించింది.