హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో భూరికార్డుల ప్రక్షాళన, ధరణి తెచ్చిన విప్లవం ఉత్తరభారతానికి పాకింది. రాష్ట్రంలో ధరణి అమలు తీరును ఇప్పటికే పలు రాష్ర్టాలు అధ్యయనం చేశాయి. అనేక రాష్ర్టాల నుంచి భూ సంబంధశాఖ అధికారులు పరిశీలించివెళ్లారు. తాజాగా శుక్రవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సుధీర్ గార్గ్ నేతృత్వంలోని అధికారుల బృందం ధరణిపై అధ్యయనం చేసింది. ఆ బృందం సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్తో భేటీ అయింది. రాష్ట్రంలో ధరణి అమలు తీరును అడిగితెలుసుకున్నారు.
ధరణికి ముందు, తర్వాత వచ్చినమార్పులపై యూపీ బృందం ఆసక్తిగా పరిశీలించింది. ధరణితో భూ రికార్డుల ప్రక్షాళన ఫలితాలను, భూయజమానులకు కలిగిన ప్రయోజనాలను సీసీఎల్ఏ నుంచి అడిగి తెలుసుకున్నారు. భూక్రయవిక్రయాల విధానాన్ని, మ్యూటేషన్ జరిగే పద్ధతిని చూసి యూపీ బృందం ఆశ్చర్యపోయింది. ఎలాంటి రికార్డులు, దరఖాస్తు దస్తావేజుల పనిలేకుండానే ధరణి ద్వారా జరుగుతున్న మ్యూటేషన్ తీరుపై ఆ బృందం ప్రత్యేక ఆసక్తిని కనబరచింది. కాగా, ఈ బృందం శనివారం కూడా పలు అంశాలపై అధ్యయనం చేయనున్నది.