హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తేతెలంగాణ) : హైదరాబాద్ హైటెక్‌సిటీలోని యశోద హాస్పిటల్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సీకేడీ) క్లినిక్‌ను జగద్గురువు శివరాత్రి దేశికేంద్ర మహాస్వామీజీతో కలిసి యశోద హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ గోరుకంటి రవీందర్రావు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రవీందర్రావు మాట్లాడుతూ మన దేశ జనాభాలో 17 శాతం మంది మూత్రపిండాల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని తెలిపారు. ఏటా దాదాపు 5 లక్షల మంది డయాలసిస్ దశకు చేరుకుంటున్నారని, దీన్ని దృష్టిలో పెట్టుకొని దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధిగ్రస్తుల కోసం ఈ క్లినిక్‌ను ఏర్పాటుచేసినట్టు చెప్పారు. రెండు తెలుగు రాష్ర్టాల్లోని జనాభాలో 20 శాతం మందిలో ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ ప్రాబల్యం పెరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ దేవదాస్, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి, నెప్రాలజీ స్పెషలిస్టు రాజశేఖర చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు