హైదరాబాద్ సిటీబ్యూరో/మారేడ్‌పల్లి, జూలై 27 (నమస్తే తెలంగాణ): యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకులు తమను సంప్రదించిన దంపతుల విషయంలో ఒప్పందం ప్రకారం అసలు సరోగసీ చేయనేలేదని, వేరే వాళ్ల శిశువును తెచ్చి ఇచ్చి చైల్డ్ ట్రాఫికింగ్‌కు పాల్పడ్డారని నార్త్‌జోన్ డీసీపీ రశ్మిపెరుమాళ్ వెల్లడించారు. సృష్టి నిర్వాహకులు ఈ వ్యవహారంలో బాధితుల నుంచి రూ.35 లక్షలు తీసుకున్నారని, ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. సంతానం కావాలంటూ వచ్చే దంపతుల ఆశలతో వ్యాపారం చేస్తూ సరోగసీ పేరుతో పెద్ద ఎత్తున డబ్బులు గుంజి, సరోగసీ కాకుండా వేరేవాళ్ల పిల్లలను తీసుకొచ్చి అమ్మేస్తూ చైల్డ్ ట్రాఫికింగ్‌కు సృష్టి సెంటర్ పాల్పడిందని వివరించారు.
‘సృష్టి’ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత వద్ద సరోగసీ కోసం వచ్చిన అనేక మంది దంపతుల డాటా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. గోపాలపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ వ్యవహారంపై ఆదివారం డీసీపీ కార్యాలయంలో డీఎంహెచ్‌వో వెంకటితో కలిసి నిర్వహించిన మీడియాతో సమావేశంలో డీసీపీ రశ్మిపెరుమాళ్ పలు కీలక అంశాలను వెల్లడించారు. ఈ కేసులో పిల్లల అక్రమ విక్రయం జరుగుతున్నట్టు ప్రాథమికంగా గుర్తించామని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. డాక్టర్ నమ్రత నిర్వహించిన డీఎన్ఏ టెస్టులు, ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్నామని తెలిపారు. సంతానం కలగని దంపతులను డాక్టర్ నమ్రత మోసగించినట్టు గుర్తించామని పేర్కొన్నారు.
డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. సంతానం కలగని బాధిత దంపతులు ‘సృష్టి’కి వెళ్తే పలు పరీక్షలు చేసి ఐవీఎఫ్ సాధ్యం కాదని, సరోగసీ ద్వారా పొందవచ్చని, ఇందుకు రూ.30 లక్షలు ఖర్చవుతుందని డాక్టర్ నమ్రత చెప్పారు. సరోగసీ కోసం విశాఖపట్టణానికి చెందినవారిని ఒప్పించినట్టు, అందుకు వారు రూ.5 లక్షలు అడిగినట్టు కూడా నమ్మించారు. దంపతుల నుంచి అండం, వీర్యం సేకరించి సరోగసీ చేస్తున్నట్టు నమ్మించి, విశాఖపట్టణంలోని ఒక గర్భిణీని సరోగసీ మదర్‌గా చూపించారు. కొన్నాళ్ల తర్వాత విశాఖ దవాఖానలో ఒక శిశువును సరోగసీ ద్వారా పు ట్టిందంటూ ఆ దంపతులకు అప్పగించా రు. సరోగసీకి అంగీకరించిన మహిళ మరికొన్ని డబ్బులు అడుగుతున్నట్టు చెప్పి మరో రూ.పది లక్షలు వసూలు చేశారు. ఈ కేసులో నమ్రత అసలు సరోగసీయే చేయలేదని, శిశువు వద్దనుకున్న అసోంకు చెందిన మహిళకు రూ.90 వేలు ఇచ్చి, ఆమెకు శిశువు పుట్టగానే తీసుకొచ్చారని డీసీపీ తెలిపారు. ఆ తర్వాత దంపతులకు అనుమానం వచ్చి డీఎన్ఏ టెస్ట్ చేయించగా ఆ శిశువు సరోగసీకి ఒప్పుకున్న దంపతులది కాదని తేలిందని వెల్లడించారు. ఈ కేసులో డాక్టర్ అత్తలూరి నమ్రత, పచ్చిపాల జయంత్‌కృష్ణ, వైజాగ్‌కు చెందిన సీ కల్యాణ్ అచ్చాయమ్మ, ఎంబ్రయాలజిస్ట్ గొల్లమండ్ల చెన్నారావు, గాంధీ దవాఖాన అనస్థీషియా స్పెషలిస్ట్ నార్గుల సదానందం, అసోంకు చెందిన ధనశ్రీ సంతోషి, మహ్మద్ అలీ అదిక్, నస్రీన్ బేగమ్‌ను అరెస్ట్ చేసినట్టు డీసీపీ తెలిపారు.
నిబంధనలు ఉల్లంఘించిన సృష్టి
సృష్టి టెస్ట్‌ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకులు వైద్య, ఆరోగ్య శాఖ నియమనిబంధనలు ఉల్లంఘించారని, దవాఖాన రిజిస్ట్రేషన్ గడువు కూడా 2021లోనే తీరిందని డీఎంహెచ్‌వో వెంకటి తెలిపారు. మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ లేకుండా దవాఖానను నిర్వహిస్తున్నట్టు పలు ఫిర్యాదులు రావడం, కోర్టులో కేసులు ఉండటంతో సదరు దవాఖానను మూసివేస్తున్నట్టు నిర్వాహకులు కోర్టుకు తెలిపారని, అయితే, చాటుమాటుగా సెంటర్‌ను నిర్వహిస్తున్నారని, దీంతో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించలేకపోయారని డీఎంహెచ్‌వో వివరించారు.
తల్లీ కొడుకులు కలిసి..!
డాక్టర్ అత్తలూరి నమ్రత యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పేరుతో విజయవాడ, సికింద్రాబాద్, విశాఖపట్టణం, కొండాపూర్‌లో సెంటర్లు నడుపుతున్నట్టు, వీటిలో పెద్దఎత్తున అక్రమ సరోగసీలు, ఫెర్టిలిటీ స్కామ్‌లు చేసినట్టు పోలీసులు గుర్తించారు. 1995లో మెడికల్ ప్రాక్టీస్ ప్రారంభించిన నమ్రత 1998లో ఫెర్టిలిటీ సర్వీసెస్‌లోకి మారారు. ఆ తర్వాత అనైతికంగా, అక్రమంగా ప్రాక్టీస్ చేస్తూ ఒక్కొక్క పేషంట్ నుంచి రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షలు వసూలు చేశారు.
ఆ తర్వాత తమకు పిల్లలు వద్దంటూ అబార్షన్స్ చేయించుకోవడానికి ప్రయత్నించే మహిళలతో మాట్లాడి, వారికి డబ్బులు ఇచ్చి వారి శిశువులను తీసుకొచ్చేవారని, ఆ శిశువులను సరోగసీ కోసం వచ్చిన దంపతులకు మోసపూరితంగా అప్పగించేవారని పోలీసుల దర్యాప్తులో తేలింది. సరైన లైసెన్స్ లేకుండా నమ్రత ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసేవారని, బాధితులు తమకు అన్యాయం జరిగిందని సెంటర్ వద్దకు వచ్చి ప్రశ్నిస్తే, వారిని తన కార్యాలయంతోపాటు నమ్రత ఆర్థిక వ్యవహారాలు చూసుకునే ఆమె కొడుకు, అడ్వకేట్ పచ్చిపాల జయంత్కృష్ణతో బెదిరించేవారు. నమ్రత తదితరులపై గతంలో మహారాణిపేట, విశాఖ టూటౌన్, హైదరాబాద్-గోపాలపురం, గుంటూరులో పది కేసులు నమోదయ్యాయి.