గురువారం 04 జూన్ 2020
Telangana - Jan 31, 2020 , 02:08:03

చరిష్మా తగ్గని చార్మినార్‌!

చరిష్మా తగ్గని చార్మినార్‌!
  • ప్రతినెలా లక్షకుపైగా సందర్శకులు
  • గతేడాది పర్యాటకులు 13 లక్షలు
  • రాత్రి సందర్శనకు ఆసక్తి చూపుతున్న యువత
  • ప్రత్యేక ఆకర్షణగా షాపింగ్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: చార్మినార్‌ను నిర్మించి నాలుగు వందల ఏండ్లుదాటినా దాని చరిష్మా ఏమాత్రం తగ్గలేదు సరికదా.. రోజురోజుకు పెరుగుతూనే ఉన్నది. చెక్కుచెదరని క్రేజ్‌ సంపాదించుకొని దేశంలోని ఇతర చారిత్రక కట్టడాల కంటే మిన్నగా సందర్శకులను ఆకర్షిస్తున్నది. పెద్దసంఖ్యలో పర్యాటకులు తరలివస్తుండటంతో పగలు, రాత్రి తేడా లేకుండా చార్మినార్‌ ప్రాంతం కళకళలాడుతున్నది. ఈ క్రమంలో భారత పురావస్తుశాఖ, తెలంగాణ పర్యాటకశాఖ సందర్శకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. చార్మినార్‌ చరిత్ర తెలిసేలా సమాచార బోర్డులను ఏర్పాటు చేయడంతోపాటు పాదచారులమార్గాన్ని సౌకర్యవంతంగా తీర్చిదిద్దుతున్నది. 


భారత పురావస్తుశాఖ వద్ద ఉన్న సమాచారం ప్రకారం, హైదరాబాద్‌కు చార్మినార్‌ను సందర్శించేందుకు వస్తున్నవారి సంఖ్యే ఎక్కువగా ఉన్నది. ప్రతి నెలా లక్షకుపైగా సందర్శకులు చార్మినార్‌ను తిలకించేందుకు వస్తున్నారు. గత ఏడాది 13 లక్షల వరకు సందర్శకులు చార్మినార్‌ను సందర్శించారని గణాంకాలు చెప్తున్నాయి. ఇందులో 10శాతం విదేశీ పర్యాటకులు ప్రతి ఏడాది ఆగస్టు, ఫిబ్రవరిలో ఎక్కువగా వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తున్నది. ఇక దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువగా నవంబర్‌ నుంచి జనవరి మధ్యలో వస్తున్నట్టు వెల్లడవుతున్నది. పక్క రాష్ట్రాలు, స్థానిక పర్యాటకులు వేసవికాలంలో హైదరాబాద్‌ పర్యటనలో భాగంగా చార్మినార్‌ను కూడా సందర్శిస్తున్నారు.


ప్రత్యేక ఆకర్షణగా షాపింగ్‌

చార్మినార్‌కు వచ్చేవారిలో ఎక్కువ మంది అక్కడి వీధి షాపింగ్‌ను ఎంజాయ్‌ చేస్తారు. లాడ్‌ బజార్‌ గాజులు, ఆ పక్కనే లభించే అత్తర్లు, దుస్తులు, ఎత్నిక్‌ చీరలు, షేర్వానీలు, లెహంగాలు, డిజైనర్‌ చీరలు, బొమ్మలు, సుర్మా, మెహందీ కోన్స్‌ వంటివి తప్పనిసరిగా కొనుగోలు చేస్తున్నారని, దీని వల్ల ఇక్కడి మార్కెట్‌ మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నదని అధికారులతోపాటు వ్యాపారస్తులు చెప్తున్నారు.


రాత్రివేళ సందర్శనకు యువత ఆసక్తి

రాత్రివేళ, విద్యుత్‌ కాంతుల మధ్య చార్మినార్‌ను తిలకించాలనుకొనే యువకుల సంఖ్య ఎక్కువవుతున్నది. కాలేజీ విద్యార్థులు, యువ ఉద్యోగులు ఎక్కువగా రాత్రి వేళ చార్మినార్‌ సందర్శనకు వస్తున్నారు. పెద్దసంఖ్యలో చార్మినార్‌ వద్దకు చేరుకొని సందడి చేస్తున్నారు. కేకులు కట్‌చేస్తూ పుట్టినరోజులు, ఇతర శుభదినాలను సెలబ్రేట్‌ చేసుకొంటున్నారు. సాయంత్రం వేళ షాపింగ్‌చేస్తూ, చార్మినార్‌లో లభించే ప్ర త్యేక రుచులను ఆస్వాదిస్తున్నారు. చాలా మంది అర్ధరాత్రివరకు అక్కడే గడుపుతూ చార్మినార్‌ ముందు నిలబడి సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్‌ చేస్తున్నారు. 


logo