విధుల్లో క్రమశిక్షణారాహిత్యం నమ్మకద్రోహమే
పోలీసులకు స్పష్టం చేసిన హైదరాబాద్ సీపీ
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 13 (నమస్తే తెలంగాణ): పో లీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్, టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్గా పోస్టింగ్ ఇచ్చేందుకు పోలీసుల వ్యక్తిగత అంశాలు, డ్యూ టీ విషయాలు కూడా పరిగణనలోకి తీసుకొంటామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. స్టేషన్ ఇన్స్పెక్టర్.. పోలీస్ ప్రతిష్ఠను పెంచేలా ఉండాలని, నిజాయితీ, నిబద్ధత ఉన్న వారికే పోస్టింగ్ ఇస్తామని స్పష్టం చేశారు. విధుల్లో క్రమశిక్షణారహితంగా పనిచేసే అధికారి వృత్తికి నమ్మకద్రోహం చేసినట్టేనని అన్నారు.
బుధవారం నగరం లో 69 మంది ఇన్స్పెక్టర్లను సీపీ బదిలీ చేశారు. అంతకుముందు శాంతిభద్రతలు, ట్రాఫిక్, ఇతర విభాగాల్లో బదిలీ ఉత్తర్వులు అందుకొన్న అధికారులు, 3 ఏండ్లకు పైగా ఒకే విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఇన్స్పెక్టర్లతో బషీర్బాగ్ పోలీసు కమిషనర్ కార్యాలయంలో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో పోలీస్ ఉన్నతాధికారులు డీఎస్ చౌహాన్, ఏఆర్ శ్రీనివాస్, రంగనాథ్, రమేశ్, విశ్వప్రసాద్, కార్తీకేయ, గజరావు భూపాల్ పాల్గొన్నారు.