హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): మెడికల్ సీట్ల బ్లాకింగ్ కేసులో చలిమెడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చైర్మన్ చలిమెడ లక్ష్మీనరసింహారావు శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు. మెడికల్ సీట్లను బ్లాక్ చేసి, అధిక ధరలకు విక్రయించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనను ఈడీ అధికారులు గంటలపాటు ప్రశ్నించారు.
కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న 12 మెడికల్ కాలేజీల్లో సీట్లను బ్లాక్ చేసి, ఎక్కువ ధరలకు విక్రయించినట్టు ఆరోపణలు రావడంతో నిరుడు జూన్‌లో ఈడీ దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా ఆయా కాలేజీల యాజమాన్యాలకు సమన్లు పంపిన ఈడీ అధికారులు.. ఇటీవల మల్లారెడ్డి మెడికల్ కాలేజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సురేందర్‌రెడ్డి వాంగ్మూలాన్ని నమోదు చేశారు.