హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): పోలీస్ శాఖలో భారీ నోటిఫికేషన్ రానున్నదని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) చైర్మన్ వీవీ శ్రీనివాస్ రావు తెలిపారు. భారీ స్థాయిలో పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నదని వెల్లడించారు. అతి త్వరలోనే నోటిఫికేషన్లు వెలువడనున్నాయని, అభ్యర్థులు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ ప్రారంభించుకోవాలని సూచించారు. అత్యంత పారదర్శకంగా నియామకాలు చేపట్టేందుకు బోర్డు సిద్ధంగా ఉన్నదని అన్నారు. ప్రభుత్వం వయోపరిమితిని మూడేం డ్లు పెంచటం అభ్యర్థులకు గొప్ప అవకాశమని చెప్పారు. ఈ సారి అన్ని ఉద్యోగాలకు కలిపి 7 లక్షలకు పైనే దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నట్టు వివరించిన ఆయన.. ‘నమస్తే తెలంగాణ’ ద్వారా అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
రిక్రూట్మెంట్కు పక్కా ప్లానింగ్
2018 రిక్రూట్మెంట్ స్థాయిలోనే ఇది ఉండబోతున్నది. అప్పుడు 18 వేల పైచిలుకు పోస్టులను భర్తీ చేశాం. ఇప్పుడు కూడా దాదాపు ఆ స్థాయిలోనే రిక్రూట్మెంట్ ఉంటుంది. గత అనుభవాలు దృష్టిలో పెట్టుకొని పక్కాగా ముందుకు వెళ్లేలా కార్యాచరణ రూపొందించుకొంటున్నాం. ఎక్కడా పొరపాట్లకు తావులేకుండా అన్ని ఏర్పాట్లతో బోర్డు సిద్ధంగా ఉన్నది.
అభ్యర్థులూ.. వెంటనే ప్రిపరేషన్ ప్రారంభించండి
భారీ సంఖ్యలో పోలీసు ఉద్యోగాల భర్తీకి ప్రభు త్వం అనుమతి ఇచ్చింది. నోటిఫికేషన్ అతి త్వరలోనే విడుదల కానున్నది. అభ్యర్థులు ఇప్పటి నుంచే ప్రిలిమ్స్ కోసం ప్రిపరేషన్ ప్రారంభించుకోవాలి. ఫిజికల్ ఈవెంట్స్‌కు కూడా ప్రాక్టీస్ ప్రారంభిస్తే ఆశించిన ఫలితాలు వస్తాయి. ఇప్పటి నుంచే ప్రిలిమ్స్‌తోపాటు ఫిజికల్ ఈవెంట్స్ ప్రిపరేషన్‌కు కొంత సమయం పెట్టుకోవాలి.
పూర్తి స్థాయిలో సాంకేతికతను వాడుకొంటాం
ఎస్సై, కానిస్టేబుల్, ఇతర క్యాటగిరీల పోస్టుల భర్తీలో టెక్నాలజీ వినియోగాన్ని మరింత పెంచుతాం. దీనివల్ల రిక్రూట్మెంట్లో సమయం ఆదా అవుతుంది. మనిషి ప్రమేయం లేకుండా చేసి మరింత పారదర్శకత పెంచుతాం. అభ్యర్థుల్లో అది భరోసా పెంచుతుందనేది మా ఉద్దేశం. ఫిజికల్ ఈవెంట్స్‌కు సమయం ఉన్నందున గతంలో మాదిరి ఆర్ఎఫ్ఐడీ టెక్నాలజీ తరహాలో మరింత నాణ్యత పెంచే టెక్నాలజీని తేవాలని ఆలోచిస్తున్నాం. ఏ తరహా టెక్నాలజీ వాడబోతున్నామన్నది మీరు భవిష్యత్తులో చూస్తారు.
అక్రమార్కులను నమ్మి మోసపోవద్దు
అన్ని దశల్లోనూ సాంకేతికతను వాడుతూ నియామక ప్రక్రియను పారదర్శకంగా చేపడుతున్నాం. ప్రతి దశలో అభ్యర్థుల ఫలితాలు వారికి తెలుస్తాయి. ఫిజికల్ ఈవెంట్స్ తర్వాత కూడా వారికి రీడింగ్‌లు చూపించి సంతకాలు తీసుకొంటాం. ప్రవేశ పరీక్షల్లోనూ బయోమెట్రిక్ విధానం ఉంటుంది. ఓఎంఆర్ షీట్లు సైతం ఇస్తాం. ఇంత పకడ్బందీగా ప్రక్రియ కొనసాగుతున్నందున ఎక్కడా అవకతవకలకు ఆస్కారం ఉండదు. ఎవరైనా పోలీస్ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశపెడితే మోసపోవద్దు. అలాంటి వారి సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకొంటాం.
ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా మన టెక్నాలజీ
పోలీస్ ఉద్యోగాల భర్తీలో తెలంగాణ పోలీస్ శాఖ వాడుతున్న సాంకేతికత, అనుసరిస్తున్న పారదర్శక విధానాలు ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా ఉంటున్నాయి. సీసీ కెమెరాల వాడకం మొదలు ప్రతి దశలో అభ్యర్థుల బయోమెట్రిక్ తప్పనిసరి చేయడం, ఫిజికల్ ఈవెంట్స్, లాంగ్ జంప్, హై జంప్, షార్ట్‌పుట్ వేసినప్పుడు ఆ దూరాలను డిజిటల్ థియోడలైడ్స్ పరికరాలతో కొలవటం, ఆ కొలతలు నేరుగా కంప్యూటర్లో నిక్షిప్తం అవటం వంటి సాంకేతికతలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ వంటి కేంద్ర బలగాల రిక్రూట్‌మెంట్‌లోనూ ఇంత టెక్నాలజీ వాడటం లేదు.