హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. తెలంగాణ అమరవీరుల కాలిగోటికి సరిపోడని రెడ్ కో చైర్మన్ వై సతీశ్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. రెండు కండ్ల సిద్ధాంతమంటూ యువతను రెచ్చిగొట్టిన మాజీ సీఎం చంద్రబాబు సంకలో చేరి ఆనాడు ఈ ప్రాంత బిడ్డల ప్రాణత్యాగాలకు రేవంత్‌రెడ్డి కారకుడయ్యాడని, తెలంగాణ కోసం తానేదో చేసినట్టుగా నేడు ఉద్యమకారుల గురించి ఆయన మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
టీడీపీలో ఉంటూ చంద్రబాబు చెప్పుచేతల్లో పనిచేస్తూ తెలంగాణ ఉద్యమానికి వెన్నుపోటు పొడిచిన నీచ చరిత్ర రేవంత్‌దని విమర్శించారు. మలి ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతచారి, యాదిరెడ్డి, కానిస్టేబుల్ కిష్టయ్య లాంటి ఎందరో యోధుల పేర్లను పలికే నైతిక అర్హత ఆయనకు లేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారుల వెన్నంటి ఉంది కాబట్టే అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కూతురు ఎంబీబీఎస్ చదవగలిగి ప్రభుత్వ దవాఖానలోనే డాక్టర్‌గా ఉద్యోగం చేస్తున్నారని తెలిపారు. అమరుల త్యాగాలకు నివాళిగా అద్భుతమైన స్మారకచిహ్నం నగరం నడిబొడ్డున నిర్మించుకోగలిగిందని పేర్కొన్నారు.