హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా యూనివర్సిటీలో క్యాటగిరీ-3 పీహెచ్‌డీని రద్దు చేశారు. ఈ మేరకు అడ్మిషన్లను నిలిపివేస్తూ ఇటీవల యూనివర్సిటీ పరిపాలనా విభాగం ద్వారా ఉత్తర్వులు జారీచేశారు. మూడో విభాగం పరిశోధన కోర్సుల ప్రవేశాలు నిలిపివేయడంతో డిగ్రీ, ఇంటర్ అధ్యాపకులు, స్కూల్ టీచర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ నిర్ణయంతో పరిశోధనలు కుంటుపడే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో నాణ్యమైన ఫ్యాకల్టీ లేక బోధన ప్రమాణాలు దెబ్బతింటాయని, విద్యార్థులకు నష్టం జరుగుతుందని పేర్కొంటున్నారు.
విశ్వవిద్యాలయాల్లో మూడు రకాలుగా పరిశోధన కోర్సులు నిర్వహిస్తుంటారు. క్యాటగిరీ-1లో జేఆర్ఎఫ్, ఎన్సీఈఆర్టీ, సీఎస్ఐర్, ఐసీఎంఆర్ తదితర జాతీయస్థాయి ఇన్స్టిట్యూట్టు నిర్వహించే ప్రవేశ పరీక్షల ద్వారా ఎంపికైన వారికి అవకాశం కల్పిస్తారు.
క్యాటగిరీ-2లో ఆయా యూనివర్సిటీలు నిర్వహించే ప్రవేశ పరీక్షలు సెట్, నెట్ ద్వారా పీహెచ్‌డీల్లో అడ్మిషన్లు ఇస్తారు. యూనివర్సిటీ డీన్ అనుమతి, డిపార్ట్మెంట్ రీసెర్చ్ కమిటీ సూచనలతో యూనివర్సిటీ ప్రొఫెసర్ల పర్యవేక్షలో పోస్ట్ డాక్టరేట్ కోర్సుల్లో కల్పించే అడ్మిషన్లను క్యాటగిరీ-3గా పరిగణిస్తారు.
క్యాటగిరీ-3 పీహెచ్‌డీల రద్దుతో యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, జూనియర్ కాలేజీల్లో విద్యాప్రమాణాలు దెబ్బతినే ప్రమాదం ఉందని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. అధ్యాపకులు, టీచర్లకు పీహెచ్డీ చేసే అవకాశం కల్పించడం ద్వారా యూనివర్సిటీల్లోనూ పరిశోధనలు మెరుగుపడతాయి. ఇందులో అడ్మిషన్లు తీసుకున్నవారు తమ బోధనా అనుభవంతో పరిశోధనలు పూర్తిచేసి థిసిస్‌ను విశ్వవిద్యాలయాలకు సమర్పిస్తారు.
తద్వారా యూనివర్సిటీల్లోనూ బోధనా ప్రమాణాలు మెరుగవుతాయి. అలాగే వారు బోధించే కళాశాలల్లోనూ మేలైన విద్యనందించే అవకాశం ఉంటుంది. నాణ్యమైన బోధన ద్వారా ఆయా కాలేజీలకు న్యాక్(నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్) గుర్తింపు లభించే అవకాశాలు ఉంటాయి. ఈ గుర్తింపుతో కాలేజీలకు నిధులు వస్తాయి. సౌకర్యాలు కల్పించవచ్చు. దీంతో క్యాటగిరీ-3 పీహెచ్డీ ప్రవేశాలను పునరుద్ధరించాలని డిగ్రీ, ఇంటర్ కాలేజీల అధ్యాపకులు కోరుతున్నారు.