ఖైరతాబాద్, జూలై 21: కార్టూన్లు వేసే వృత్తి అంతరించిపోయే దశలో ఉందని, ఆ వ్యవస్థను బతికించుకోవాలని తెలంగాణ మీడి యా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కార్టూనిస్టు శేఖర్ మెమోరియల్ అవార్డు ప్రదానోత్సవ సభ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఓయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ రఘు అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీనివాస్‌రెడ్డి తెలంగాణ టుడే ఎడిటోరియల్ కార్టూనిస్టు పీ నర్సింకు కార్టూనిస్టు శేఖర్ మెమోరియల్ అవార్డును అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతికారంగంలో ప్రూఫ్ రీడర్స్ వ్యవస్థ ఉండేదని, ఆ తరం అంతరించిపోయిందని, రిపోర్టర్లు, సబ్ఎడిటర్లే నేడు ఆ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారని తెలిపారు.
రాష్ట్రంలో 3వేల మంది జర్నలిస్టులకు ఇంటిస్థలాలు ఇచ్చే యోచనలో ఉన్న ట్టు తెలిపారు. నవతెలంగాణ పూర్వసంపాదకుడు ఎస్ వీరయ్య మాట్లాడుతూ సామాజిక స్పృహ కలిగిన కార్టూనిస్టు శేఖర్ అని, కార్టూనిస్టు నర్సిం కూడా అదే కోవకు చెందినవాడని కొనియాడారు. కార్యక్రమంలో కవి, జర్నలిస్టు ప్రసేన్, అరుణోదయ విమలక్క,హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యులు చలకాని వెంకట్‌యాదవ్, సాక్షి కార్టూనిస్టు శంకర్, చిత్రకారులు కూరెళ్ల శ్రీనివాస్, చంద్రకళా శేఖర్ పాల్గొన్నారు.