హైదరాబాద్, జూన్13 (నమస్తే తెలంగాణ): ప్రిన్సిపాల్స్ సెలక్షన్స్లో ఇప్పటివరకు అమలు చేస్తున్న ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేస్తామని, సీనియారిటీ ప్రాతిపాదికనే ఎంపిక చేస్తామని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ సెక్రటరీ సీతాలక్ష్మి వెల్లడించారు. కోర్టుకు వెళ్లినవారికి ఎలాంటి ప్రమోషన్లు, బదిలీలు ఉండబోవని స్పష్టం చేశారు. 317 జీవో అమలు, బదిలీలు, ప్రమోషన్లు, నూతనంగా సొసైటీకి ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్స్ ఇవ్వడంపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ఆమె గురువారం చర్చించి, పలు అంశాలపై స్పష్టతనిచ్చారు. ప్రిన్సిపాల్ సెలక్షన్స్లో ఇంటర్వ్యూలను రద్దు చేస్తామని వెల్లడించారు. అన్ని క్యాడర్లకు సంబంధించి సీనియర్ జాబితాలను 18వ తేదీలోగా 317 జీవో ప్రకారం ఫైనల్ చేస్తామని వివరించారు. వివిధ అంశాలపై 88 మంది ఉపాధ్యాయులు కోర్టుకు వెళ్లారని, వాటిపై స్టేటస్కో అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రస్తుత ప్రమోషన్లు, బదిలీల్లో సదరు ఉద్యోగులు, ఉపాధ్యాయులను పరిగణనలోకి తీసుకోబోమని, ప్రస్తుతం ఉన్న ప్రదేశం, జోన్లో మాత్రమే వారు యథావిధిగా కొనసాగుతారని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిషేధం ఎత్తివేస్తేనే బదిలీలు ఉంటాయని, లేదంటే ప్రమోషన్లు మాత్రమే కల్పిస్తామని తేల్చిచెప్పారు. 317 జీవో అమలు, పోస్టింగ్స్, ప్రమోషన్స్, సాధారణ బదిలీల సందర్భంగా సీవోఈ పాఠశాలలు, కళాశాలల్లోని అన్ని పోస్టులతో ఖాళీలను వెల్లడిస్తామని, ఏ పోస్టు కూడా బ్లాక్ చేయబోమని చెప్పారు. ప్రమోషన్స్, పోస్టింగ్స్ అన్నీ వెబ్ కౌన్సెలింగ్ ద్వారానే నిర్వహిస్తామని తెలిపారు.
ఇటీవల ట్రిబ్ ద్వారా సోషల్ వెల్ఫేర్ సొసైటీకి ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 20 నుంచి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ప్రారంభించనున్నట్టు సొసైటీ సెక్రటరీ సీతాలక్ష్మి వెల్లడించారు. జూలై 1 నాటికి ఉత్తర్వులు ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. అప్పటిలోగా 317 జీవో అమలు, ప్రమోషన్స్, బదిలీలన్నీ పూర్తి చేస్తామని తెలిపారు. నూతనంగా రెగ్యులర్ అయిన కాంట్రాక్ట్ టీచర్లకు కూడా 317 జీవో ప్రకారం వెబ్ కౌన్సెలింగ్ ద్వారా కేటాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. సొసైటీ సెక్రటరీ నిర్ణయంపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగుల తరఫున ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వ రెసిడెన్షియల ఇన్స్టిట్యూట్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిడి నారాయణ, జనరల్ సెక్రటరీ డాక్టర్ మధుసూదన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గణేశ్, భిక్షంయాదవ్, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బాలరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.