హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): యూత్ డిక్లరేషన్ పేరిట అలవిగాని హామీలిచ్చి నిరుద్యోగులను వంచించిన కాంగ్రెస్ సర్కార్ మెడలు వంచేందుకే ఈ నెల 18న సరూర్‌నగర్ సభ నిర్వహిస్తున్నట్టు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్న ఈ సభకు.. యువత పెద్దసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సోమవారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో కలిసి ‘యువ సంగ్రామ సదస్సు’ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. హామీలు అమలు చేయాలని అడిగిన నిరుద్యోగులు, రైతులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, మహిళలకు బేడీలు వేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో నిరుద్యోగ యువతకు మేలు జరిగిందని చెప్పారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత బీఆర్ఎస్కే దక్కిందని తెలిపారు. కాంగ్రెస్ ఓట్ల కోసం ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపి.. గద్దెనెక్కిన తర్వాత మోసం చేసిందని మండిపడ్డారు.
సీఎం రేవంత్‌రెడ్డి చట్టానికి అతీతుడా?
ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడనే కారణంతో ఓ యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. అదే సీఎం రేవంత్‌రెడ్డిని వదిలిపెట్టడం శోచనీయమని తలసాని పేర్కొన్నారు. ‘రైతులకు నీళ్లివ్వమని అడిగితే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులను కోసి పంట పొలాల్లో రక్తం చల్లమంటున్నరు.. డీజీపీని అడుగుతున్న.. ఈ వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేలా లేవా? ఈ విధంగా మాట్లాడడం నేరం కాదా? సీఎం చట్టానికి అతీతుడా?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
నిరుద్యోగుల అరెస్టు దుర్మార్గం : సబిత
జాబ్ క్యాలెండర్ కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. నోటిఫికేషన్లు ఇవ్వమని అడిగిన నిరుద్యోగులను అరెస్ట్ చేయడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు యూత్ డిక్లరేషన్ పేరిట ప్రియాంకగాంధీ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ సర్కార్ మోసం చేస్తున్నదని దుయ్యబట్టారు. నిరుద్యోగులే నోటిఫికేషన్లు వద్దంటున్నారని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పడం ఎంత వరకు కరెక్ట్? అని ప్రశ్నించారు. పోలీసుశాఖలో 20 వేల ఖాళీలు ఉంటే 5 వేలు భర్తీ చేస్తామనడం యువతను వంచించడమేనని మండిపడ్డారు.
కాంగ్రెస్ ద్రోహాన్ని ఎండగడుతాం: శంభీపూర్ రాజు
నిరుద్యోగులకు కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని సరూర్‌నగర్ సభ సాక్షిగా ఎండగడుతామని శంభీపూర్ రాజు స్పష్టంచేశారు. యువత భారీగా తరలివచ్చి బీఆర్ఎస్ పోరాటానికి మద్దతివ్వాలని విజ్ఞప్తిచేశారు. నిరుద్యోగులకు న్యాయంజరిగేదాకా పోరాటాన్ని ఆపబోమని తేల్చిచెప్పారు.
జాబ్ క్యాలెండర్ ఇచ్చేదాక వదిలిపెట్టం: ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
2023 అసెంబ్లీ ఎన్నికల ముందు నిరుద్యోగుల ఓట్ల కోసం కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకగాంధీ కల్లబొల్లి మాటలు చెప్పారని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆరోపించారు. జాబ్‌క్యాలెండర్ ఇచ్చేదాకా ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని స్పష్టంచేశారు. సర్కార్ కండ్లు తెరిపించేందుకే సరూర్‌నగర్ సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, పార్టీ నాయకులు వై సతీశ్‌రెడ్డి, సుమిత్రాఆనంద్, శుభప్రద్ పటేల్, కిశోర్‌గౌడ్, రాఘవ పాల్గొన్నారు.