హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): ‘మార్పు.. మార్పని.. వలలో.. మనలని ముంచిండ్రే వలలో..ఆరు గ్యారెంటీలు ఉయ్యాలో.. ఆగమే జేసిన్రు ఉయ్యాలో.. అభయాస్తం ఉయ్యాలో.. శూన్య హస్తమాయే ఉయ్యాలో.. మార్పు..మార్పు అని ఈ చెయ్యి గుర్తుకు ఓటేస్తే ఆగమాగం చేస్తున్రు ఈ కాంగ్రెస్సోళ్లు..’ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బతుకమ్మ పాటలతో రూపొందించిన మూడు సీడీలను గురువారం తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్ మహిళా నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బతుకమ్మ పాటలు పాడుతూ లయబద్ధంగా బతుకమ్మ ఆడారు.
ఉమ్మడి కరీంనగర్ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, సునీతాలక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యే కోవా లక్ష్మి, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, జడ్పీ మాజీ చైర్పర్సన్లు హేమలతా శేఖర్, అరుణా రాఘవరెడ్డి, వసంత, టీజీపీఎస్సీ మాజీ మెంబర్ సుమిత్రాఆనంద్, కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ రజనీసాయిచంద్, లీగల్ సెల్ మెంబర్ లలితారెడ్డి, బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్, దేవీప్రసాద్, గోసుల శ్రీనివాస్, మహిళా నేతలు, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం తెలంగాణభవన్‌లో పాటల వీడియాలను స్క్రీన్లపై ప్రదర్శించగా పార్టీ నేతలు, కార్యకర్తలు ఆసక్తిగా తిలకించారు.
కేసీఆర్ పదేండ్ల పాలనలో అధికారికంగా జరుపుకున్న బతుకమ్మ పండుగ.. రేవంత్‌రెడ్డి 22 నెలల మూర్ఖపు పాలనలో కళతప్పిందని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పేర్కొన్నారు. తెలంగాణ తల్లి రూపం మార్చి, రాష్ట్ర చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణాన్ని తొలగించి కాంగ్రెస్ సర్కార్ అవమానించిందని దుయ్యబట్టారు. తెలంగాణ నేల స్వభావం తెలిసిన కేసీఆర్ మళ్లీ రావాలని, తెలంగాణ తల్లి చేతి లో మళ్లీ బతుకమ్మ చేరాలని ఆకాంక్షించారు.
గురువారం తెలంగాణ భవన్లో బతుకమ్మ పాటల సీడీలను ఆవిష్కరించిన అనంతరం దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. కేసీఆర్ పా లనలో బతుకమ్మలను నిమజ్జనం చేసే చెరువులను మిషన్ కాకతీయ పేరిట బాగుచేసుకున్నామని, కానీ ఇప్పుడు ఈ పండుగ గొప్పదనం గురించి తెలియని నేత మన పాలకుడు కావ డం దురదృష్టకరమని పేర్కొన్నారు. సీఎం రేవంత్ ఓర్వలేనితనం, నరనరాన కేసీఆర్‌పై ద్వేషంతో బతుకమ్మను తెలంగాణ తల్లి నుంచి వేరుచేసి ఆడబిడ్డల మనసులను గాయపరిచారని విమర్శించారు. ఈ పాలనలో అన్నివర్గా లు అరిగోస పడుతున్నాయని వాపోయారు.
సమైక్య రాష్ట్రంలో మన బతుకు పండుగను ఆంధ్రా పాలకులు అవహేళన చేశారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. ఉద్యమ సమయంలో మహిళలతోపాటు బతుకమ్మలను సైతం పోలీస్స్టేషన్లలో నిర్బంధించారని గుర్తుచేశారు. బతుకమ్మ పండుగ గొప్పదనాన్ని కేసీఆర్ చాటిచెప్పారని పేర్కొన్నారు.
పేద, ధనిక తేడా లేకుండా ప్రతి ఆడబిడ్డ జరుపుకొనే గొప్ప పండుగ బతుకమ్మ అని మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రకృతి వేడుక తెలంగాణ సంపూర్ణ అస్థిత్వానికి చిహ్నమని అభివర్ణించారు. కేసీఆర్ హయాంలో ఆడబిడ్డలకు చీరలు ఇచ్చి గౌరవించారని గుర్తుచేశారు. కానీ, కాంగ్రెస్ పాలనలో చీరల్లేవు.. సౌకర్యాలకు నిధులివ్వడంలేదని దుయ్యబట్టారు.
కేసీఆర్ పాలనలో కోటి మంది మహిళలకు చీరల రూపంలో బతుకమ్మ కానుకలు అందజేసేవారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గుర్తుచేశారు. నేతన్నలకు చేతినిండా పనికల్పించడం, అతివల ముఖాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా ఈ బృహత్తర స్కీంను అమలుచేశారని చెప్పారు. కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి పథకాలను తెచ్చి మహిళలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్‌పై అక్కసుతో ఆయన తెచ్చిన స్కీంలకు మంగళం పాడుతున్నదని దుయ్యబట్టారు.
కేసీఆర్ హయాంలో బతుకమ్మ వేడుకలను గొప్పగా నిర్వహించేవారని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ మాత్రం వేడుకల నిర్వహణపై నిర్లక్ష్యం చేస్తున్నదని ధ్వజమెత్తారు. రెండేండ్లుగా బతుకమ్మ చీరల పంపిణీని బంద్ పెట్టడం దుర్మార్గమని దుయ్యబట్టారు.
కేసీఆర్ చీరలు ఇచ్చి గౌరవించారు:
కేసీఆర్ పాలనలో బతుకమ్మ పండుగకు చీరలిచ్చి గౌరవించారని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భానికి ముందు కొన్ని వర్గాలకే పరిమితమైన బతుకమ్మను బీఆర్ఎస్ రాష్ట్ర అధినేత కేసీఆర్ ఖండాంతరాలకు వ్యాపింపజేశారని కొనియాడారు. ఇప్పుడు ఆదివాసీ బిడ్డలు కూడా ఈ బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారని చెప్పారు.
తెలంగాణ ఉద్యమానికి అంకుర్పారణ జరగకముందు లంబాడీలు తీజ్ ఉత్సవాలను జరుపుకొనేవారని, కానీ ఇప్పుడు బతుకమ్మ వేడుకల్లో సైతం అంతే ఉత్సాహంగా పాలుపంచుకుంటున్నారని మాజీ ఎంపీ మాలోత్ కవిత చెప్పారు. కేసీఆర్ ఈ పండుగకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రా పాలకుల మాదిరిగానే నిర్లక్ష్యం చేస్తున్నదని ధ్వజమెత్తారు.
ఈ నెల 21న పితృఅమావాస్య నాటి నుంచి తెలంగాణభవన్‌లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఎంగిలిపూలతో ప్రారంభించి సద్దుల బతుకమ్మ వరకు తొమ్మిదిరోజులపాటు సంప్రదాయబద్ధంగా బతుకమ్మ ఆడనున్నారు. పార్టీ మహిళా నేతలు, హైదరాబాద్ నగరంలోని కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్‌రెడ్డి పిలుపునిచ్చారు.