ములుగు రూరల్, జూన్ 26 : మంత్రి సీతక్కతో తనకు ప్రాణహాని ఉందని బీఆర్ఎస్ ములుగు జిల్లా నాయకుడు భూక్యా జంపన్న పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ములుగులో మీడియాతో మాట్లాడుతూ.. రూ. 4 వేల కోట్ల విలువైన ఇసుక తవ్వకాల బాగోతం శాటిలైట్ చిత్రాల ద్వారా ప్రపంచం మొత్తం తెలిసిందని, అదే విషయమై విచారణ జరపాలని తాను కోరినట్టు తెలిపారు. మేడారం జాతర పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించపోవడం వల్ల ఒక బాలుడు కాలు కోల్పోయిన సంగతి నియోకజవర్గ ప్రజలకు తెలిసిందేనన్నారు. మంత్రి సీతక్క బినామీలకు వందలాది టిప్పర్లు ఎలా వచ్చాయని ప్రజల పక్షాన నిలదీస్తే ఆమె అనుచరులు వ్యక్తిగత విమర్శలు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీతక్క గిరిజనులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రాణం ఉన్నంత వరకు ప్రజల పక్షాన బీఆర్ఎస్ నాయకుడిగా పోరాటం చేస్తానని పేర్కొన్నారు.