హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): నేటి డిజిటల్ యుగంలో రాజకీయ పార్టీలు సైతం కొత్తపుంతలు తొక్కుతున్నాయి. సోషల్‌మీడియా హంగులను అద్దుకొని ప్రజలను ఆకర్షించేందుకు దాదాపు అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా ఇన్‌స్టా రీల్స్, షార్ట్ వీడియోలు, మీమ్స్‌తో జెన్‌జీకి చేరువకావడంపై ఫోకస్ పెంచాయి. ఇక రాష్ట్రంలో ఈ కొత్త ఒరవడి తెలంగాణ ఇంటిపార్టీ బీఆర్ఎస్ శ్రీకారం చుట్టింది. పొలిటికల్ రీచ్‌లో కారు పార్టీ టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నది. యువత, ముఖ్యంగా జెన్‌జీకి చేరువయ్యేలా ఇన్‌స్టా రీల్స్, షార్ట్ వీడియోలు, మీమ్స్‌ను రూపొందిస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ఎప్పటికప్పుడు గ్రౌండ్లో నిలదీస్తున్న బీఆర్ఎస్ పార్టీ తాము రోజు వారీగా చేస్తున్న ఆందోళనలు, పార్టీ కార్యక్రమాలను యువతకు మరింత చేరువయ్యేలా రీల్స్, షార్డ్ వీడియోల రూపంలో ఎక్స్, ఇన్‌స్టా ఖాతాల వేదికగా పంచుకుంటున్నది. కాగా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఫాలో అవుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌ను కేవలం పబ్లిసిటీ ప్లాట్‌ఫామ్‌గా మాత్రమే కాకుండా యువతకు మరింత చేరువయ్యే కీలకాస్త్రంగా వినియోగించుకొనేందుకు ఈ రెండు పార్టీలు సైతం సిద్ధమవుతున్నాయి.
సోషల్‌మీడియా వేదికగా ఉద్భవించిన కాక్రోచ్ జనతా పార్టీ ఇటీవల జంతర్‌మంతర్ వద్ద నిర్వహించిన ఆందోళనలు, ధర్నాకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం వంటి పరిణామాలను రాజకీయ పార్టీలు నిశితంగా గమనించాయి. ఉధృతంగా సాగిన ఈ ఆందోళనల్లో సోషల్‌మీడియా కీలక పాత్ర పోషించడంతో డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పై పార్టీల ఫోకస్ మరింత పెరిగింది. జెన్‌జీకి చేరువయ్యేలా పార్టీలు తమ రాజకీయ వ్యూహాలకు మరింత పదును పెడుతున్నాయి. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ 1,000 రోజుల పాలనను పూర్తి చేసుకున్నది. అసెంబ్లీ ఎన్నికలకు మరో 800 రోజులు ఉండగా.. మొబైల్ ఫోన్లలో ఆయా పార్టీల రాజకీయ యుద్ధం రాజుకుంటున్నది. తమ ప్రత్యర్థి పార్టీల విధానాలను ఎండగట్టేందుకు కృత్రిమ మేధ(ఏఐ) టెక్నాలజీతో రూపొందించిన వీడియోలను తయారు చేసి తమ అధికారిక ఎక్స్, ఇన్‌స్టా ఖాతాల్లో ఆయా పార్టీలు పోస్టు చేస్తున్నాయి. కాగా బీఆర్ఎస్ పార్టీకి ఫాలోవర్స్ సంఖ్య ఎక్కువగా ఉంది. ఆ పార్టీ ‘ఎక్స్’ ఖాతాకు 9.44 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ ఖాతాకు 6.92 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. ఇక బీజేపీ తెలంగాణ ‘ఎక్స్’ ఖాతాకు 3.8లక్షల మంది, ఇన్‌స్టా ఖాతాకు 3.97లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో వెనుకబడి ఉంది. తన ‘ఎక్స్’ ఖాతాలో తెలంగాణ కాంగ్రెస్‌కు 1.91లక్షల మంది ఫాలోవర్లు ఉండగా.. ఇన్‌స్టా ఖాతాకు 1.58లక్షల ఫాలోవర్స్ మాత్రమే ఉండటం గమనార్హం.
రాష్ట్రంలో 2024 నాటికి 18 నుంచి 29 ఏండ్ల వయసు ఉన్న 8.7లక్షల మంది ఓటర్లు (22.97శాతం) ఉన్నారని ఎలక్షన్ కమిషన్ డాటా వెల్లడించింది. ఆయా పార్టీలు యువతకు చేరువ కావడంపై ఎందుకు ఫోకస్ చేశాయో ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ వినియోగం ఎక్కువగా ఉండటం, పొలిటికల్ కమ్యూనికేషన్‌కు మొబైల్స్ ప్రాధాన్యం పెరుగడంతో పార్టీలు ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి జెన్‌జీకి మరింత చేరువయితే అధికారం పక్కా అని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఇక ఆయా పార్టీల తాజా వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో చూడాల్సి ఉంది.
రాష్ట్రంలోని రాజకీయనేతల్లో సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్కువమంది ఫాలోవర్లతో టాప్‌లో నిలిచారు. ఆయన ‘ఎక్స్’ ఖాతాకు 46 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌కు 26లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. కేటీఆర్ తన పోస్టుల్లో ఐటీ రంగంలో హైదరాబాద్ సాధించిన ప్రగతి, గత పదేండ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, టెక్నాలజీ రంగంలో చేయాల్సిన కృషి, యువత సక్సెస్ సాధించాలంటే తప్పనిసరిగా అనుసరించాల్సిన మార్గాలు, తనలో స్ఫూర్తి నింపిన అంశాలు, పాడ్‌కాస్ట్‌ల్లో ఇచ్చిన ఇంటర్వ్యూల్లోని కీలక విషయాలను షార్ట్ వీడియోలు, రీల్స్ రూపంలో పోస్టు చేయడంతో యువతతోపాటు అన్ని వర్గాల వారికి ఎక్కువగా రీచ్ అవుతున్నాయి.