హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 30 (నమస్తే తెలంగాణ): ‘ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నాయకుడు. ఆయన వెంట 60 లక్షల మంది బీఆర్ఎస్ సైన్యం ఉన్నది. ఉద్యమ వీరులను నేరుగా ఎదుర్కొనే దమ్ములేక, కొందరు చేతకాని దద్దమ్మలు దొంగచాటున ఫోన్‌కాల్స్‌తో బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు’ అని బీఆర్ఎస్ నేతలు స్పష్టంచేశారు. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు ఇటీవల వచ్చిన బెదిరింపు కాల్స్‌ను తీవ్రంగా పరిగణించిన బీఆర్ఎస్ నేతలు శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఆధ్వర్యంలో బుధవారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతిని కలిసి ఫిర్యాదు చేశారు. నిందితులను వెంటనే గుర్తించి, చట్టపరంగా కఠినంగా శిక్షించాలని మధుసూదనాచారితోపాటు ఎమ్మెల్సీలు శంబీపూర్ రాజు, దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యే సంజయ్, బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, రాగిడి లక్ష్మారెడ్డి, తకెళ్లపల్లి రవీందర్రావు.. సీపీని కోరారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. శంభీపూర్ రాజు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారని, ఆయన వెంట లక్షల మంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారని మధుసూదనాచారి తెలిపారు. బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టంచేశారు. దీనిపై పోలీసులు లోతైన విచారణ జరిపించి, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మైనంపల్లి హనుమంతరావు రౌడీలా వ్యవహరిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని నిప్పులుచెరిగారు.
గూండాల పాలైన తెలంగాణ: ఆర్ఎస్పీ
ఎందరో ఉద్యమకారులు తమ ప్రాణాలను పణంగా పెట్టి సాధించిన తెలంగాణ రాష్ట్రం.. ప్రస్తుతం గూండాల పాలైందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజ్‌కు మైనంపల్లి హనుమంతరావు, రోహిత్‌కుమార్ ఫోన్లు చేసి చంపుతామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇటీవల రోహిత్ రోడ్డుపై 300 వాహనాలతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించ న్యూసెన్స్ సృష్టించారని, అయినా పోలీసుల నుంచి స్పందన కరువైందని మండిపడ్డారు.
అదుపు తప్పిన శాంతిభద్రతలు: ఎమ్మెల్యే వివేకానంద
తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని ఎమ్మెల్యే వివేకానంద ఆందోళన వ్యక్తంచేశారు. మలాజిగిరిలో మైనంపల్లి గూండాలాగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు వస్తున్న బెదిరింపు కాల్స్‌పై చర్యలు తీసుకోవాలని సీపీని కోరామని తెలిపారు. దీనికి స్పంధించిన సీపీ.. కేసు నమోదు చేసి విచారణ చేపడతామని తెలిపారని చెప్పారు.
గతంలోనూ ‘రేవంత్’ రౌడీ వ్యాఖ్యలు: దాసోజు శ్రవణ్‌కుమార్
అరవై లక్షల మంది సభ్యులు కలిగిన తమ పార్టీ తిరగబడితే మీరెకడ ఉంటారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు. ‘సీఎంను కాకపోయి ఉంటే నేను రౌడీని అయ్యే వాడిని’ అంటూ స్వయంగా రేవంత్‌రెడ్డి గతంలో అనడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఎంతో అభివృద్ధి చెందిన తెలంగాణలో ప్రశాంతంగా ఉన్న హైదరబాద్‌ను గూండాలు, రౌడీలు చుట్టుముట్టారని ఆందోళన వ్యక్తంచేశారు. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్న నాయకుడని చెప్పారు. సమస్య ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. తెలంగాణలో దాడులతోపాటు గంజాయి వాడకం పెరిగిపోతున్నదని, హైదరాబాద్‌లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని తెలిపారు.