Balka Suman | హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో నడిచేది ప్రజాపాలన కాదని, అన్నివర్గాలను దగాచేసే పాలన అని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ధ్వజమెత్తారు. సంక్షేమ, యూనివర్సిటీ క్యాంపస్ హాస్టళ్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని ఆందోళన వ్యక్తంచేశారు. హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ అనేది సాధారణ విషయంగా మారిందని, చట్నీల్లో ఎలుకలు, అన్నంలో బల్లులు వస్తున్నాయని, కలుషితాహారం తిని భువనగిరిలో ఒకరిద్దరు విద్యార్థులు చనిపోయారని ఆవేదన వ్యక్తంచేశారు.
తెలంగాణభవన్‌లో బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ యూనివర్సిటీల్లో 2014కు ముందు పరిస్థితులు నెలకొన్నాయని, యూనివర్సిటీలకు పూర్తిస్థాయి వైస్చాన్స్లర్లు లేరని, నిరుద్యోగులపై ప్రభుత్వం దమనకాండ సాగిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. యూనివర్సిటీ హాస్టళ్లల్లో కరెంటు కూడా తీసేస్తున్నారని తెలిపారు. ఉగ్రవాదులను వెంటాడినట్టు విద్యార్థులు, నిరుద్యోగులను వెంటాడుతున్నారని, రేవంత్‌రెడ్డి పాలనలో ఎస్సీ, బీసీ మంత్రులు, అధికారులకు అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయని చెప్పారు.
యాదాద్రిలో ఉప ముఖ్యమంత్రి భట్టి, కొండా సురేఖకు, బలంపేట ఎల్లమ్మతల్లి సాక్షిగా మంత్రి పొన్నం ప్రభాకర్‌కు అవమానం జరిగిందని గుర్తుచేశారు. దళిత ఎస్సై శ్రీరాములు శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడని, రేవంత్ పాలనలో మాటల్లోనే తప్ప చేతల్లో సామాజిక న్యాయం లేదని, కార్పొరేషన్ చైర్మన్ల నియామకంలో సామాజిక న్యాయం జరగలేదని విమర్శించారు. కాంగ్రెస్ బీసీ ఎమ్మెల్యే స్వయంగా రేవంత్‌రెడ్డి సామాజిక న్యాయంపై సోషల్ మీడియాలో నిరసన స్వరం వినిపిస్తే కొన్ని గంటల్లోనే ఆ ఎమ్మెల్యేపై ఒత్తిడి తెచ్చి వ్యాఖ్యలను డిలీట్ చేయించారని గుర్తుచేశారు.
మహబూబ్‌నగర్‌లో నిరుద్యోగులు, విద్యార్థులను సీఎం అవమానించేలా మాట్లాడడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. నిరుద్యోగులను నడ్డివిరిచేలా రేవంత్‌రెడ్డి వ్యవహారం ఉన్నదని, అందరి గొంతులు నొకుతున్నాడని, పోలీసులను అడ్డం పెట్టుకుని నిరసనలను అణచివేసే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. సమైక్య పాలనను మించి రేవంత్‌రెడ్డి పాలన నడుస్తున్నదని ఆరోపించారు.
జర్నలిస్ట్‌ల గొంతునొక్కుతున్నారు
ఓయూలో జర్నలిస్ట్‌పై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రభుత్వం జన్నలిస్టుల గొంతునొక్కుతున్నదని సుమన్ విమర్శించారు. సమస్యలపై గొంతెత్తుతున్న ప్రతివర్గానికీ బీఆర్ఎస్ అండగా ఉంటుందని స్పష్టంచేశారు. రేవంత్ కడప వెళ్లి షర్మిల కోసం ఊరూరా తిరుగుతా అంటున్నారని, సమైక్యవాదుల కోసం రేవంత్ తాపత్రయపడుతున్నారని చెప్పారు. చంద్రబాబు వచ్చిన తీరు, ఓయూలో పోలీసుల దమనకాండ చూస్తుంటే మనం తెలంగాణలోనే ఉన్నామా? లేక సమైక్యరాష్ట్రంలో ఉన్నామా? అనే అనుమానం కలుగుతున్నదన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నేతలు పల్లె రవికుమార్, ఇస్లావత్ రామచంద్రునాయక్, తుంగ బాలు, రవీందర్‌రెడ్డి, రాజా రమేశ్ పాల్గొన్నారు.