కరువు పాపం సర్కార్‌దే!
రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడటానికి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని బీఆర్ఎస్ ప్రతినిధులు కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.
- కృష్ణా, గోదావరి జలాలను ఒడిసిపట్టడంలో ఘోర వైఫల్యం
- వరదనీటిని నిల్వ చేయడంలో ముందుచూపులేని తీవ్రనిర్లక్ష్యం
- కరువును ఎదుర్కోవడంపై స్పష్టతేది?
- 25 వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వండి
- అఖిలపక్ష భేటీకి సీఎం ఎందుకు రాలే?
- బీఆర్ఎస్ ప్రతినిధులు నిరంజన్‌రెడ్డి, ఎల్ రమణ, వినోద్‌కుమార్
హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడటానికి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని బీఆర్ఎస్ ప్రతినిధులు కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. హైదరాబాద్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన బుధవారం జరిగిన అఖిలపక్ష సమావేశానికి బీఆర్ఎస్ తరఫున మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి, మండలిలో బీఆర్ఎస్ పక్ష ఉపనేత ఎల్ రమణ, మాజీ ఎంపీ బీ వినోద్‌కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కరువు పరిస్థితులను ఎదుర్కోవడంలో ప్రభుత్వ వైఫల్యాలపై ప్రభుత్వాన్ని ఎండగట్టారు. పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
హెచ్చరికలు బేఖాతరు: నిరంజన్‌రెడ్డి
‘ఇది ఎల్ నినో వల్ల వచ్చిన కరువు కాదు. కాంగ్రెస్ తెచ్చిన కరువు. ఎల్ నినో వస్తుందని ఏడాది నుంచి శాస్త్రవేత్తలు, నిపుణులు హెచ్చరిస్తున్నా.. ఈ ప్రభుత్వానికి ముందుచూపు లేదు’ అని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. ఈ ఏడాది 25శాతం లోటు వర్షపాతం నమోదైందని, గతంలో కూడా 25 శాతం లోటు వర్షపాతం నమోదైనా అప్పుడు పంటలు ఎండిపోలేదని తేల్చి చెప్పారు. కృష్ణా, గోదావరి నీటిని ఒడిసిపట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అందుకే ఈ కరువొచ్చిందని తెలిపారు. ప్రభుత్వమే 24.30 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని ప్రకటించిందని, ఎండిన పంటలన్నింటికీ నష్టపరిహారం అందించాల్సిందేనని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం నుంచి ఇప్పటివరకూ పరిహారంపై ఎలాంటి స్పష్టత లేదని చెప్పారు. అఖిలపక్ష సమావేశానికి సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు హాజరుకాలేదని ప్రశ్నించారు. నీటి నిల్వలపై ప్రభుత్వానికి ముందుచూపులేదని, కరువు పరిస్థితుల్లో ప్రజలను ఆదుకునేందుకు స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని ప్రభుత్వానికి సూచించారు. పంటలు ఎండిపోయిన రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ, అనుబంధ రంగాలను ఆదుకునేందుకు ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని కోరారు. యాసంగి పంటకు రైతుబంధు ఇస్తారో? ఇవ్వరో? స్పష్టతనివ్వాలని కోరారు. విద్యుదుత్పత్తికి సరిపడా బొగ్గు నిల్వలను పెట్టుకోవాలని సూచించారు. కరువు నుంచి ప్రజలను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.
కాళేశ్వరం జలాలను
వృథా చేసిన ప్రభుత్వం: ఎల్ రమణ
మూడేండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును పడావుపెట్టి, నీటిని వృథా చేసిన ఫలితంగానే రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని మండలిలో బీఆర్ఎస్ పక్ష ఉపనేత ఎల్ రమణ విమర్శించారు. కృష్ణా, గోదావరి జలాలను ఒడిసిపట్టకుండా ఏపీకి వదిలిపెట్టిందని తెలిపారు. ఇది ఎల్ నినో వల్ల వచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువేనని స్పష్టంచేశారు.
వరదనీటిని నిల్వ చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వానికి ముందు చూపులేదని, కేవలం కేసీఆర్‌ను, ఆయన కుటుంబాన్ని బదనాం చేయాలనే చూసిందని మండిపడ్డారు. పంటలు ఎండిపోయిన రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కరువును ఎదుర్కొనేందుకు రాజకీయాలకు అతీతంగా కలిసొచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.
కరువు నివారణలో స్పష్టతేది?: వినోద్‌కుమార్
రేవంత్‌రెడ్డి సీఎం అయిన మూడేండ్ల తర్వాత నిర్వహించిన మొదటి అఖిలపక్ష సమావేశం ఇదేనని, ఈ సమావేశంలో కరువును ఎదుర్కోవడంపై సర్కార్ ఎలాంటి స్పష్టమైన విధానాన్ని ప్రకటించలేదని మాజీ ఎంపీ బీ వినోద్‌కుమార్ తెలిపారు. కరువును ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ నిధులను కేటాయిస్తుందని, ఇటీవల మహారాష్ట్రకు రూ.5 వేల కోట్లు ఇచ్చిందని, మన రాష్ర్టానికి ఇప్పటివరకు ఏమైనా కేటాయించిందా? అని ప్రశ్నించారు. దీనికి బదులుగా ఎలాంటి నిధులు ఇవ్వలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు.
జిల్లాల వారీగా కరువు పరిస్థితులను నిర్దిష్టంగా కేంద్రానికి పంపి, జాతీయ విపత్తు నిధులను రాబట్టాలని వినోద్‌కుమార్ సూచించారు. కృష్ణా, గోదావరి జలాలను ఏపీకి వృథాగా వదిలిపెట్టడం వల్లే కరువొచ్చిందని తెలిపారు. పంటలు నష్టపోయిన రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని, ప్రభుత్వం తక్షణమే ‘స్పెషల్ డ్రాట్ రిలీఫ్ ఫండ్’ను రిలీజ్ చేయాలని, ఎకరాకు రూ.25 వేల చొప్పున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

