న్యాయపోరాటంతో కేసీఆర్ కాపాడిన 50 వేల కోట్ల భూమికి ఎసరు.. నిన్న తీర్పు.. నేడు బేరం
నాలుక ఉన్నదని ఎటుపడితే అటు మడతపెట్టే తత్వం సీఎం రేవంత్‌రెడ్డిది. దశాబ్దాలుగా నలుగుతున్న భూ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించింది బీఆర్ఎస్ అయితే.. చివరికి ఫలితం వచ్చే సమయానికి అధికారంలో ఉన్నందుకు ఆ ఘనతను తన ఖాతాలో వేసుకుంటున్నది రేవంత్ ప్రభుత్వం.
- 550 ఎకరాల మియాపూర్ భూములు అమ్మకానికి!
- కోర్టు తీర్పు వెలువడి 24 గంటలైనా కాకముందే రేవంత్ సర్కార్ నిర్ణయం
- మియాపూర్ సర్వే నంబర్-100, 101లో సర్కారీ జాగ
- నాడు కేసీఆర్ న్యాయపోరాటంతో కొలిక్కి వచ్చిన వివాదం
- సుప్రీంకోర్టు తీర్పుతో హెచ్ఎండీఏకు సంపూర్ణ హక్కులు
- తీర్పు కాపీ అందకముందే విలువైన ప్రజల ఆస్తి ‘ఫర్ సేల్’!
- ఆ భూముల అమ్మకానికి ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశం
ఆ భూములు కాపాడింది కేసీఆర్ ప్రభుత్వమే
2015లోనే సీనియర్ న్యాయవాది వైద్యనాథన్‌ను నియమించి, సుప్రీంకోర్టులో పటిష్ట వాదనలు వినిపించినం : హరీశ్‌రావు
మియాపూర్ భూములను ప్రభుత్వానికి దఖలు పరిచేందుకు సుప్రీంకోర్టులో దాఖలైన కేసులో జరిగిన మొత్తం హియరింగ్స్ 192
ఉమ్మడి రాష్ట్రంలో 2003 నుంచి 2014 ఏప్రిల్ 30 వరకూ 11 ఏండ్లలో జరిగిన హియరింగ్స్ 95 ఈలెక్కన ఉమ్మడి ఏపీలో టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో ఏడాదికి సగటున జరిగిన హియరింగ్స్ 8.63 మాత్రమే.
కేసీఆర్ ప్రభుత్వ (9.7.2014 -7.12.2023) హయాంలో కరోనా సంక్షోభంనాటి రెండేండ్లు మినహాయించి, మిగతా ఏడున్నరేండ్లలో సుప్రీంకోర్టులో జరిగిన విచారణలు 86 అంటే ఏడాదికి సగటున జరిగిన హియరింగ్స్ 11.46
రేవంత్ ప్రభుత్వ హయాంలో ఏడాదిన్నర కాలంలో (7.12.2023 -1.5.2025) సుప్రీంలో జరిగిన విచారణలు 11 అంటే ఏడాదికి సగటున హియరింగ్స్ 7.3 మాత్రమే.
ఈ లెక్కలను చూస్తే అటు ఉమ్మడి రాష్ట్రంలోని ప్రభుత్వాల కంటే, ఇటు రేవంత్ ప్రభుత్వం కంటే కూడా మియాపూర్ భూములను కాపాడటానికి కేసీఆర్ ప్రభుత్వమే ఎక్కువ కృషి చేసినట్టు స్పష్టమవుతున్నది. పట్టుబట్టి సుప్రీంకోర్టులో క్రమం తప్పకుండా విచారణ జరిగేలా కేసీఆర్ ప్రభుత్వం శ్రద్ధ వహించింది. పలువురు ప్రముఖ న్యాయవాదులను నియోగించి కేసు గెలువడానికి, భూములు ప్రభుత్వ పరం కావడానికి రంగం సిద్ధం చేసింది.
మియాపూర్ భూమి గత ప్రభుత్వపు పోరాట ఫలం. ప్రభుత్వ భూములను కాపాడాలన్న ఉక్కుసంకల్పంతో సివిల్‌కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా ఎడతెగకుండా జరిపిన యుద్ధ ఫలితం. ఆ ప్రభుత్వం కష్టపడి సాధించిన ఫలాన్ని తానేదో పోరాడి సాధించినట్టు ప్రచారాలు చేసుకుంటూ ఆ ఘనతను తన ఖాతాలో వేసుకొంటున్నది కాంగ్రెస్ సర్కార్. అదీ చాలక ఆరోపణల బురద చల్లి రంకెలు వేస్తున్నది. అంతకుమించి నాటి ప్రభుత్వం కాపాడిన రూ.50 వేల కోట్ల విలువైన భూమిని అమ్మకానికి పెట్టి, ప్రజల కండ్లకు గంతలు కట్టాలని చూస్తున్నది.
అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దొరికింది దొరికినట్టు.. ఉన్నకాడికి భూములను తెగనమ్ముకోవడమే తప్ప రాష్ర్టానికి పైసా లాభం చేయడం చేతగాని కాంగ్రెస్ సర్కార్.. సుప్రీంకోర్టులో తీర్పు వచ్చి 24 గంటలు గడవకముందే, రూ.50 వేల కోట్ల విలువైన భూమిని తెగనమ్ముకోవాలని ఆరాటపడుతున్నది. పండిన ఊర్లకు అందరూ ప్రభువులే అని బీఆర్ఎస్ ప్రభుత్వం నానా కష్టాలు పడి సాధించిన భూమిని ఒక్క రోజైనా కాకముందే అంగట్లో పెట్టి అర్రాస్ పాడేందుకు ఉవ్విళ్లూరుతున్నది.
ఇవాళ తెలంగాణ రాష్ట్రం, ఇక్కడ పోగైన సంపద.. అంతా కేసీఆర్ కృషి ఫలితం. ఇవాళ సర్కార్ ఖజానాకు వస్తున్న ప్రతి పైసా వెనుక కేసీఆర్ విజన్ ఉన్నది. తపన ఉన్నది. గుమ్మి కింద చేరిన పందికొక్కుల్లా అందినకాడికి బుక్కడమే తప్ప ఈ సర్కార్ రాష్ర్టానికి చేసిందేమిటి? ఒక్క నిర్మాణం చేసిందా? ఒక్క పరిశ్రమ తెచ్చిందా? ఒక్క ప్రాజెక్టు కట్టిందా? ‘కూశమ్మ కూడ బెడితే మాచమ్మ మాయం చేసిందని’ తీర్చిదిద్దిన తెలంగాణలోని విలువైన ప్రజల ఆస్తులను అమ్ముకోవడం, కబ్జాలు పెట్టడం తప్ప ఈ సర్కార్ చేసిందేమిటి? ఈ రాష్ర్టానికి ఒరిగిందేమిటి? సకుటుంబ సపరివార సమేతంగా భూదందాలు చేయడం తప్ప.
హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ) : నాలుక ఉన్నదని ఎటుపడితే అటు మడతపెట్టే తత్వం సీఎం రేవంత్‌రెడ్డిది. దశాబ్దాలుగా నలుగుతున్న భూ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించింది బీఆర్ఎస్ అయితే.. చివరికి ఫలితం వచ్చే సమయానికి అధికారంలో ఉన్నందుకు ఆ ఘనతను తన ఖాతాలో వేసుకుంటున్నది రేవంత్ ప్రభుత్వం. ‘ఉట్టి తెగే సమయానికి నక్క వచ్చినట్టు’ సరిగ్గా మియాపూర్ భూముల అంశం సుప్రీంకోర్టులో తేలే సమయానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 1995 నుంచి నలుగుతున్న సమస్య తుది అంకానికి చేరుకుంటున్న సమయంలో అసలు మియాపూర్ భూముల కోర్టు కేసుల గురించి ఏనాడూ సమీక్ష కూడా చేయని రేవంత్‌రెడ్డి ఈ రోజు కోర్టు తీర్పును నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకుంటున్నాడు. అనుముల బ్రదర్స్ అంటేనే రాష్ట్రంలో భూ దందాలకు పెట్టింది పేరు. అలాంటి రేవంత్‌రెడ్డి తెలంగాణ ఉద్యమసేనాని కేసీఆర్‌పై నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నాడు. మియాపూర్ భూముల వ్యవహారాన్ని అడ్డంపెట్టుకొని బీఆర్ఎస్పై అడ్డగోలుగా మాట్లాడుతున్నారు.
ఆనాడు కాపాడిందే కేసీఆర్
2017లో మియాపూర్ భూముల వ్యవహారం బయటకు వచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్టు సీఎంగా ఉన్న కేసీఆర్ దృష్టికి వెళ్లడంతో తక్షణం స్పందించి సర్వే నంబర్లు 100, 101లో జరుగుతున్న రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పూర్తిగా నిలుపుదల చేయించారు. దీనిపై ఆనాడు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించడంతోపాటు సీఐడీ విచారణ జరిపించారు. పోలీసు కేసులు కూడా పెట్టారు. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ శాఖలోని కొందరు అధికారుల పాత్ర ఉన్నదని తేలడంతో వారిపై కూడా కఠిన చర్యలు తీసుకున్నారు. 1997, 2003ల్లో న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను ఊటంకిస్తూ ఆ భూములను స్వాధీనం చేసుకోవాలని ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఆదేశించింది. అప్పటి నుంచి ప్రభుత్వ ఆధీనంలోనే భూములున్నాయి. 2017లో భూముల రిజిస్ట్రేషన్ల వ్యవహారం బయటకు రాకముందే ఈ విలువైన భూములను కాపాడాలని నాటి కేసీఆర్ ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణలో భూ కబ్జాదారుల చెరలో ఉన్న భూములను విడిపించేందుకు ప్రత్యేక ప్రణాళికతో కేసీఆర్ ముందుకువెళ్లారు.
దీంట్లో భాగంగా 2015లో దేశంలోనే భూ వివాదాల కేసులు వాదించడంలో మంచి పేరున్న సీఎస్ వైద్యనాథన్‌ను సుప్రీంకోర్టులో తెలంగాణ తరఫున ప్రత్యేక న్యాయవాదిగా నియమించారు. 2015 ఏప్రిల్ 7 నుంచి వైద్యనాథన్ తెలంగాణ ప్రభుత్వం తరఫున మియాపూర్ భూముల కోసం వాదిస్తూ వచ్చారు. 2015 నుంచి 2023 వరకు ఎనిమిదేండ్లపాటు బీఆర్ఎస్ ప్రభుత్వం అలుపెరుగని పోరాటం చేసింది. ఆ భూములకు సంబంధించిన సమగ్ర నివేదికలు, అఫిడవిట్లు, డాక్యుమెంట్లను సుప్రీంకోర్టు ముందు పెట్టింది. ఈ కేసులో 2023 జూన్ 15న తెలంగాణ ప్రభుత్వం విజయం సాధించింది. ఇదే ట్రినిటి ఇన్ఫ్రా వెంచర్స్, గోల్డ్‌స్టోన్ ప్రసాద్‌కు సంబంధించిన కేసులోనే బీఆర్ఎస్ ప్రభుత్వం విజయం సాధించింది. ఇదే విషయం సుప్రీంకోర్టు ఉత్తర్వుల్లో కూడా స్పష్టంగా ఉన్నది. ఆనాడు వచ్చిన తీర్పునకు కొనసాగింపుగా ఇప్పుడు వచ్చింది తుది తీర్పు మాత్రమే. దీన్ని చూసి మొత్తం తీర్పు తన కృషి వల్లే వచ్చిందని రేవంత్‌రెడ్డి బిల్డప్ ఇస్తున్నాడు.
ట్రినిటి పార్థసారథిని అరెస్టు చేసింది కేసీఆర్ సర్కారే
ఆనాడు మియాపూర్‌లోని సర్వే నంబర్ 101లో అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడ్డ ట్రినిటి ఇన్ఫ్రా వెంచర్స్ సంస్థ అధినేత, గోల్డ్‌స్టోన్ ప్రసాద్ తమ్ముడు పార్థసారథిని కేసీఆర్ ప్రభుత్వం అరెస్టు చేసింది. ఆయనతోపాటు ఇదే కేసులో ఆ సంస్థకే చెందిన పీవీఎస్ శర్మను కూడా అరెస్టు చేశారు. మొత్తం వ్యవహారంపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. కూకట్పల్లి పోలీసు స్టేషన్లో పార్థసారథి, పీవీఎస్ శర్మతోపాటు నాటి కూకట్పల్లి సబ్‌రిజిస్ట్రార్ రాచకొండ శ్రీనివాస రావుపై కూడా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. సబ్‌రిజిస్ట్రార్ రాచకొండ శ్రీనివాసరావును నాటి ప్రభుత్వం ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసింది. దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 72 మంది సబ్ రిజిస్ట్రార్లను బదిలీ చేసి రిజిస్ట్రేషన్ శాఖలో సమూల ప్రక్షాళన చేపట్టింది. అప్పటి వరకు ఉన్న ‘ఎనీవేర్’ సాఫ్ట్‌వేర్‌ను కూడా తీసివేసింది. ఉమ్మడి రాష్ట్రంలో తీసుకువచ్చిన ఎనీవేర్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి ఇక్కడ అక్రమాలకు పాల్పడినట్టు ప్రభుత్వం గుర్తించి చర్యలు తీసుకున్నది.
ఏసీబీ కేసులు కూడా
స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగడంతో 2017 మేలో రిజిస్ట్రేషన్ శాఖ మొత్తం ప్రక్షాళనైంది. ఈ క్రమంలోనే ట్రినిటి ఇన్ఫ్రా వెంచర్స్‌కు చెందిన పార్థసారథి, పీవీఎస్ శర్మను అరెస్టు చేయడంతోపాటు సబ్‌రిజిస్ట్రార్ రాచకొండ శ్రీనివాస్‌రావును కూడా అరెస్టు చేశారు. అనంతరం ఏసీబీలో కూడా ఒక కేసు నమోదు చేయించారు. సబ్రిజిస్ట్రార్ల నివాసాలపై ఏకకాలంలో భారీ ఎత్తున దాడులు చేయించింది నాటి కేసీఆర్ ప్రభుత్వమే. ఏసీబీలో కూడా ఇంకా దీనికి సంబంధించిన కేసు ఫైలు ఉన్నది. కూకట్పల్లి పోలీసుస్టేషన్లో క్రిమినల్ కేసులు, సీఐడీ విచారణ, ఏసీబీ కేసులు.. ఇన్నిపెట్టిన కేసీఆర్ భూములను కాపాడలేదంటూ రేవంత్‌రెడ్డి వితండవాదన చేయడం విడ్డూరం.
ఒక్కసమీక్షా చేయని రేవంత్
మియాపూర్ భూముల గురించి, వీటిలో ఉన్న న్యాయపరమైన చిక్కుల గురించి సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి ఒక్కనాడు కూడా సమీక్ష చేయలేదు. కనీసం సమీక్షించినట్టు మీడియాకు ఆయన పీఆర్ బృందం ప్రెస్‌నోట్ కూడా ఇవ్వలేదు. మూడేండ్లుగా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న వ్యకి,్త కనీసం ఒక్క రోజు కూడా ప్రభుత్వం మియాపూర్ భూముల కోసం కొట్లాడుతున్న విషయం కూడా తెలువని వ్యక్తి, ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు రావడంతో అంతా తానే చేశానంటూ గొప్పలు చెప్పుకోవడం విస్తుగొలుపుతున్నది. ఈ కేసులో అత్యంత కీలకమైన న్యాయవాది వైద్యనాథన్‌ను అపాయింట్ చేసింది కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం. కనీసం అది కూడా తెలుసుకోకుండా ఢిల్లీలో పెట్టిన ప్రెస్మీట్లో కేసీఆర్‌పై, నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై రేవంత్‌రెడ్డి బురదజల్లే ప్రయత్నం చేశాడు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నపుడు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్‌తో ప్రభుత్వ పెద్దలు తరచూ సమీక్షలు నిర్వహించేవారు. రేవంత్‌రెడ్డి కనీసం ఇప్పటి వరకు వైద్యనాథన్‌తో ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. కానీ, కేసు గెలువడంతో ‘అంతా నా క్రెడిటే’ అంటూ గొప్పలు చెప్పుకొంటున్నాడు.
భూములు అమ్ముకునేందుకు ఆతృత
కేసీఆర్ కష్టపడి భూములను కాపాడితే.. ఇప్పుడు వచ్చిన తీర్పును ఆసరాగా చేసుకొని మియాపూర్‌లోని రూ.50 వేల కోట్ల విలువైన భూములను అమ్ముతానంటూ రేవంత్‌రెడ్డి ప్రకటించడం చూస్తుంటే ఆయన భూముల అమ్మకంపై ఎంత ఆతృతగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ‘భూములు అమ్మి ప్రభుత్వాన్ని నడుపుతా’ అని దేశంలో ఒక్క రేవంత్‌రెడ్డి తప్ప ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రీ చెప్పలేదు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి 24 గంటలు కూడా కాకముందే భూములు అమ్ముతానని ప్రకటించడంతోపాటు రెవెన్యూ అధికారులందరినీ శుక్రవారం ఉదయమే భూముల వద్దకు పంపించాడు. కలెక్టర్‌తో ప్రెస్‌మీట్ పెట్టించాడు. మీడియాను ప్రత్యేకంగా తీసుకెళ్లి రాజకీయ లబ్ధిపొందే ప్రయత్నం చేశాడు.
అక్కడ ఉన్న భూమిని కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాతే సుప్రీంకోర్టుకు వెళ్లి కాపాడినట్టు బిల్డప్ ఇచ్చాడు. మియాపూర్‌లోని 550 ఎకరాల ఈ భూమిని అమ్మితే కనీసం 50 వేల కోట్లకుపైగానే వస్తుంది. దీంతో ప్రభుత్వాన్ని నడుపుతానన్న ఆలోచనలో రేవంత్‌రెడ్డి ఉన్నాడు. ఏండ్లుగా వివాదాల నడుమ సాగిన భూములు చివరికి ప్రభుత్వానివే అని తేలిన క్రమంలో వాటి సంరక్షణ, భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా చేస్తామని చెప్పడం ఉత్తమ పాలకుడి లక్షణం. కానీ, సీఎం రేవంత్‌రెడ్డి ఆ భూములు అమ్మేస్తామని వెంటనే ప్రకటించేశారు. సర్కార్‌ను నడుప చేతకాని సీఎం ‘భూములు అమ్మి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతా.. భూములమ్మి ప్రాజెక్టులు కడుతా’నంటూ డబ్బాకొడుతున్నాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

