RTC Strike | హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రారంభించి, పూర్తిచేసిన ఆర్టీసీ విలీన ప్రక్రియకు కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేండ్ల తర్వాత తలొగ్గింది. కార్మికుల సమ్మెతో దారిలోకి వచ్చిన ప్రభుత్వం.. విలీన ప్రక్రియకు కమిటీ వేసేందుకు మాత్రమే సుముఖత వ్యక్తంచేసింది. నాడు కేసీఆర్ ప్రకటించిన అపాయింటెడ్ డేను తిరిగి ప్రకటించేందుకూ కమిటీ వేస్తామని పట్టుబట్టడంతో జేఏసీ నేతలు చివరివరకూ పోరాడి.. ప్రభుత్వ ప్రతిపాదనలకు అంగీకరించారు. యూనియన్ల పునరుద్ధరణ అంశా న్ని మ్యానిఫెస్టోలో పెట్టి ఇన్నాళ్లూ మోసగించిన ప్రభుత్వం.. చర్చల్లో కూడా అదే నాన్చివేత ధోరణిని అవలంబించింది. యూనియన్ల పునరుద్ధరణపై కార్మిక సంఘాల నేతలు ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోవాలని పట్టుబట్టడంతో, దానిపై ఆర్టీసీ యాజమాన్యంతో ప్రత్యేకంగా మాట్లాడిన తర్వాతే ఒక నిర్ణయానికి వస్తామని పేర్కొన్నది.
అయినా, కార్మిక నేతలు ససేమిరా అని పట్టుబట్టడంతో దానిపై కూడా నిర్ణయం తీసుకొని, గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఒకవైపు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకుంటే.. గుర్తింపు కార్మిక సంఘాలు ఎలా ఉంటాయని ప్రభుత్వ పెద్దలు మెలిక పెట్టినట్టు తెలిసింది. దీనిపై కార్మిక నేతలు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల్లా తామూ ఉంటామని పట్టుబట్టడంతో.. అప్పుడు సానుకూల నిర్ణయం ప్రకటించినట్టు తెలిసింది. కాగా, ఆర్టీసీ కార్మికులు పీఆర్సీ విషయంలోనూ పట్టుబట్టారు. వారు డిమాండ్ చేసినంత కాకుండా 11శాతం పీఆర్సీ ఇచ్చేందుకు సర్కార్ సుముఖత వ్యక్తంచేసింది.
శంకర్‌గౌడ్ అంత్యక్రియల తర్వాత తాత్సారం
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ అంత్యక్రియలు ముగిసిన తర్వాత జరిగిన చర్చల్లో ప్రభుత్వం తీవ్రమైన తాత్సారం చేసిందని కార్మికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం ఉదయం సరిగ్గా 11 గంటలకు ప్రారంభమైన చర్చలు.. రాత్రి 11.30 వరకూ కొనసాగాయి. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ వరకూ ఉన్నతాధికారుల కమిటీ చర్చల్లో ఎలాంటి పురోగతి లేకపోవడంతో మంత్రుల కమిటీ రంగంలోకి దిగాల్సి వచ్చింది. రాత్రి శంకర్‌గౌడ్ అంత్యక్రియలు ముగియడంతో ప్రభుత్వం ఊపిరి పీల్చుకున్నది.
ఆ తర్వాత చర్చల్లో తాత్సారం చేసింది. ఒకవైపు కార్మిక సంఘాల నేతలను చర్చల్లో కూర్చోబెట్టి.. మంత్రులు, అధికారులు, తమ పనులు చేసుకుంటూ వచ్చారు. మంత్రుల కమిటీతో చర్చల్లో కొంత పురోగతి కనిపించినప్పటికీ.. ఆర్థికపరమైన అంశాలపై పూర్తి నిర్ణయాధికారం తీసుకొనేందుకు భట్టి విక్రమార్క అవసరం పడింది. ఆయన వారిని మధ్యలోనే వదిలేసి.. ఇతర సమావేశాలకు హాజరయ్యారు. అవి పూర్తికావడంతో మళ్లీ కార్మికులతో చర్చల్లో పాల్గొన్నారు. నాన్చిన తర్వాత రాత్రి 11.30కు చర్చలు ముగిసినట్టు అధికారికంగా ప్రకటించారు.
నాటి కేసీఆర్ విలీనానికి కాంగ్రెస్ కలరింగ్
ఆర్టీసీ కార్మికుల దశాబ్దాల నాటి కల ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం. ఈ ప్రక్రియను 2023లోనే నాటి సీఎం కేసీఆర్ పూర్తిచేశారు. 2023 మే, జూన్ నెలల్లోనే ప్రక్రియ చేపట్టి.. ఆగస్టులో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పాస్ చేసి, గవర్నర్‌కు పంపారు. నాటి గవర్నర్ తమిళిసై దానిపై అభ్యంతరం తెలుపడంతో.. మళ్లీ ప్రభుత్వాధికారులను, ఆర్టీసీ కార్మికులను లోక్‌భవన్‌కు పంపి.. గెజిట్ విడుదల చేయించడంలో కీలకపాత్ర పోషించారు. అనంతరం గవర్నర్ నుంచి ఆమోదం రావడంతో ఉన్నతాధికారులతో కమిటీ వేశారు. అదే ఏడాది సెప్టెంబర్ 30న అపాయింటెడ్ డే కూడా ప్రకటించారు. ఎన్నికల కోడ్ రావడంతో ఆ ప్రక్రియ పూర్తిగా ఆగిపోయింది.
ఇదే అంశంతో ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు విలీన ప్రక్రియతోపాటు, యూనియన్ల పునరుద్ధరణ, పీఆర్సీ వంటి అంశాలను కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టింది. దానిని విశ్వసించిన కార్మికులు నాడు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసినా.. అధికారంలోకి వచ్చాక ఆ హామీలను అమలు చేయడానికి దాదాపు రెండున్నరేండ్ల సమయం తీసుకున్నది. ఒక కార్మికుడు అగ్నికి ఆహుతి అయితే కాని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిర్ణయం ప్రకటించేందుకు ముందుకురాలేదు. ఆర్టీసీ విలీన ప్రక్రియను కేసీఆర్ మొత్తం పూర్తిచేస్తే.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దానిపై ఓ కమిటీ వేసి పూర్తి చేసేందుకు కొంత సమయం అడిగింది. మొత్తానికి కేసీఆర్ పూర్తిచేసిన విలీనానికి.. కాంగ్రెస్ చివర్లో కలరింగ్ ఇచ్చింది.
అర్ధరాత్రి నుంచే బస్సుల రాకపోకలు
ఆర్టీసీలో సమ్మె ముగియడంతో శుక్రవారం అర్ధరాత్రి నుంచే మొదటి డ్యూటీ బస్సులు రోడ్డెక్కాయి. మూడు రోజులుగా వేలాది మంది ఆర్టీసీ కార్మికులు సమ్మెలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. తమ డిపోల పరిధిలో కార్మిక జేఏసీ నిర్వహించే అన్ని నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వివిధ రూపాల్లో తమ ఆందోళన, ఆవేదనను తెలియజేస్తూ.. ప్రభుత్వ కండ్లు తెరిపించే ప్రయత్నం చేశారు. సమ్మె చర్చలు ఓ కొలిక్కి రావడంతో అంతా యథావిధిగా విధులకు హాజరుకానున్నారు. ఈ పోరాటంలో కార్మికుడు శంకర్‌గౌడ్ ప్రాణాలు కోల్పోవడం బాధాకరంగా ఉన్నదని కార్మికులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం కమిటీలతో కాలయాపన చేస్తూ.. విలీన ప్రక్రియను మరింత ఆలస్యం చేస్తే.. తమ ఉగ్రరూపం చూడాల్సి వస్తుందని హెచ్చరికలు జారీచేశారు.