(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): దశాబ్దకాలం పాటు ఇష్టా రాజ్యంగా.. ఒక రకంగా నియంతృత్వ పోకడలతో అంతా తానే అన్నట్టు వ్యవహరించిన ప్రధాని నరేంద్ర మోదీ తడబడుతున్నారు. సంప్రదింపులు, సమీక్షలు వంటి పదాలకు అర్థం తెలియదన్నట్టు ఏకపక్షంగా చట్టాలను చేసిన ఒకప్పటి బీజేపీ అధినాయకత్వం.. ఇప్పుడు ప్రతీ విషయంలో పీఛేముడ్ అన్నట్టు వ్యవహరిస్తున్నది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా అధికారంలోకి వస్తామనుకొన్న కమళ దళానికి ప్రజలు షాక్ ఇచ్చారు. మిత్రపక్షాల మద్దతు ఉంటేనే ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితిని తీసుకొచ్చారు. దీంతో మూడో టర్మ్‌లో మునుపటి దుందుడుకుతనాన్ని తగ్గించుకొన్న మోదీ సర్కారు.. ‘ఆపరేషన్ సిందూర్’లో అంతర్జాతీయంగా మద్దతును కూడగట్టేందుకు ప్రతిపక్షాల మీద ఆధారపడే స్థితికి వచ్చింది. మొత్తంగా గడిచిన సంవత్సర కాలంలో ‘మోదీ.. డౌన్ ఫాల్’ ప్రారంభమైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనికి పలు ఉదాహరణలను కూడా ఉటంకిస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 400కి మించి సీట్లు సాధిస్తామని బీజేపీ పెద్దలు ప్రగల్భాలు పలికారు.
మోదీ ఫొటో చూపిస్తే ఓట్లు పడతాయని ఊదరగొట్టారు. అయితే, పదేండ్లపాలనలో మోదీ ఇచ్చిన అసత్య హామీలను ఎన్నికల సమయంలో ప్రజలు గుర్తు చేసుకొన్నారు. నల్లధనం తీసుకువచ్చి ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షలను జమ చేస్తానని నమ్మించడం, పెద్ద నోట్లను రద్దు చేసినా స్విస్ బ్యాంకుల్లో నగదు మూడురెట్లు పెరగడం, మేకిన్ ఇండియా నినాదం జోకిన్ ఇండియాగా మారడం, రూపాయి పతనం, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాల హామీ అటకెక్కడం, రైతుల ఆదాయం రెట్టింపు హామీ నీటి మూటవ్వడం, ధరలు కొండెక్కడం వెరసి మోదీ ఇచ్చిన వందకు పైగా హామీలు ఏవీ అమలు కాకపోవడంతో 2024 ఎన్నికల్లో బీజేపీకి గట్టిగా బుద్ధి చెప్పాలని ఓటర్లు నిర్ణయించుకొన్నారు. దీనికి తగ్గట్లుగానే 400 సీట్లు వస్తాయని భావించిన మోదీ పరివారానికి షాక్ ఇస్తూ.. మ్యాజిక్ ఫిగర్‌ను కూడా దాటనీయకుండా 240 స్థానాలకే బీజేపీని పరిమితం చేశారు. దీంతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సంకీర్ణ భాగస్వామ్య పక్షాలపై మోదీ ఆధారపడాల్సి వచ్చింది. అక్కడే మోదీ డౌన్ ఫాల్ ప్రారంభమైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వరుస వైఫల్యాలు ఇలా..
మూడోసారి అధికారంలోకి వచ్చినప్పటికీ ధరలను కట్టడి చేయడంలో ఎన్డీయే సర్కారు ఘోరంగా విఫలమైంది. యువతకు ఉద్యోగాలు ఇవ్వడంలోనూ ఫెయిలైంది. దీన్ని ధ్రువపరుస్తూ.. 11 ఏండ్ల మోదీ ప్రభుత్వ పాలనలో ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి రెండు అంశాలు అతి పెద్ద వైఫల్యాలని ‘ఇండియాటుడే-సీ వోటర్’ ఇటీవల చేసిన సర్వేలో ఏకంగా 42 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇక, రూపాయి పతనం, కంపెనీల మూసివేత, ఎగుమతుల క్షీణతతో దేశ ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అన్నింటికీ మించి మోదీ మూడో దఫా పాలనలో శాంతి-భద్రతలు అదుపు తప్పాయి. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో హత్యలు, లైంగిక దాడులు, దోపిడీలు నిత్యకృత్యంగా మారిపోయాయి. పహల్గాం ఉగ్రదాడి మాయని మచ్చగా మారింది. ఇక, పహల్గాం ఉగ్రదాడి అనంతరం జరిగిన ఆపరేషన్ సిందూర్ ఒకవైపు భారత సైన్యానికి గొప్ప పేరును తీసుకురాగా, దౌత్యం విషయంలో విఫలమైన మోదీ ప్రభుత్వానికి తలవంపులనే మిగిల్చింది. అందుకే, పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’పై భారత సైన్యాన్ని ప్రశంసించిన ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్, ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే.. మోదీ పేరును కూడా ఎక్కడా ప్రస్తావించ లేదు.
విదేశీ దౌత్యంలోనూ ఫెయిల్
పహల్గాం ఉగ్రదాడి విషయంలో అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్థాన్‌ను దోషిగా నిలబెట్టడంలోనూ మోదీ ప్రభుత్వం విఫలమైంది. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణకు తానే కారణమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలుమార్లు ప్రకటించుకొన్నా.. మోదీ దాన్ని గట్టిగా ఖండించలేకపోయారు. సంకెళ్లు వేసి భారతీయులను సైనిక విమానాల్లో వెనక్కి పంపించిన ట్రంప్ చర్యలను చూస్తూ ఉండిపోయారే తప్ప ఏమీ చేయలేదు. భారత్‌పై అమెరికా విధించిన సుంకాల విషయంలోనూ చేతులెత్తేశారు. రష్యాతో వ్యాపారం చేస్తే ఆంక్షలు విధిస్తామని నాటో సభ్య దేశాలు భారత్‌ను హెచ్చరించినా దీటుగా బదులు చెప్పలేకపోయారు. ఇలా చెప్పుకొంటూ పోతే దౌత్యపరంగా ప్రతీ విషయంలో మోదీ సర్కారు విఫలమవుతూనే వస్తున్నది.
పొరుగు దేశాలతోనూ అంతే..
పొరుగున ఉన్న దాదాపు అన్ని మిత్ర దేశాలూ ఇప్పుడు భారత్‌కు దూరమై చైనాకు అనుకూలంగా మారాయి. దీంతో ప్రధాని మోదీ విదేశాంగ విధానంలో, దౌత్య సంబంధాలను నెరపడంలో విఫలమైనట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది అంతర్జాతీయంగా భారత్‌కు డ్యామేజేనేనని చెప్తున్నారు. మాల్దీవుల్లో ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో భారత్‌కు వ్యతిరేకిగా పేరుపొందిన మహమ్మద్ ముయిజ్జు గెలిచి అధ్యక్షుడయ్యారు. చైనా నుంచి పెద్దయెత్తున రుణాలు వస్తుండటంతో వీలుచిక్కినప్పుడల్లా భారత్‌పై ఆయన విమర్శలు ఎక్కుపెడుతున్నారు. సరిహద్దు కయ్యాలతో భారత్‌లో ఉద్రిక్తతలకు కారణమవుతున్న పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్‌తో చైనా లోగుట్టు మైత్రీ బంధం బహిరంగ రహస్యమే. ఇక బంగ్లాదేశ్‌లో మహమ్మద్ యూనస్ నేతృత్వంలో ఏర్పడ్డ తాత్కాలిక ప్రభుత్వం, గతంలో చైనాతో సరిహద్దు వివాదాలను ఎదుర్కొన్న భూటాన్‌తో పాటు మారిషస్ కూడా చైనాలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వంతో ఇప్పుడు సత్సంబంధాల కోసం ఉవ్విళ్లూరుతున్నాయి. శ్రీలంకలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనుర కుమార దిసనాయకే మార్క్సిస్ట్ నేత. వెరసి భారత్ చుట్టూరా ఉన్న పొరుగు దేశాలన్నీ ప్రస్తుతం ఇండియాను కాదని చైనా స్నేహ హస్తాన్ని కోరుకొంటున్నాయి. దీంతో డ్రాగన్ కుయుక్తులను తిప్పికొట్టడంలో దౌత్యపరంగా మోదీ ఫెయిలయ్యారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
డౌన్‌ఫాల్ అర్థమయ్యే..
రాజకీయ అభూత కల్పనల ఇమేజ్‌తో గత పదేండ్లు నెట్టుకొచ్చిన మోదీ పాలన ఏపాటిదో ఇప్పుడు ఓటర్లకు తెలుసొచ్చింది. ఇదే సమయంలో ప్రజల్లో తన ఛరిష్మా తగ్గిపోతున్నదని కూడా మోదీ గ్రహించారు. అందుకే, 2024 ఎన్నికల కంటే ముందు ఆరెస్సెస్‌తో బీజేపీకి పని లేదని నడ్డా వంటి వారితో ఇంటర్వ్యూలు ఇప్పించిన మోదీ.. ఇప్పుడు అదే ఆరెస్సెస్‌తో సఖ్యంగా ఉండేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారని విశ్లేషకులు చెప్తున్నారు. ఇందులో భాగంగానే.. 11 ఏండ్లలో ఎన్నడూ లేని విధంగా నాగ్‌పూర్‌లోని ఆరెస్సెస్ కేంద్ర కార్యాలయానికి గత మార్చిలో ప్రధాని మోదీ వెళ్లారని, భాగవత్‌తో భేటీ అయ్యారని గుర్తు చేస్తున్నారు. డౌన్ ఫాల్ అర్థమయ్యే మోదీ ఇదంతా చేస్తున్నట్టు విశ్లేషిస్తున్నారు.
ఏడాదిలో తెలిసొచ్చింది..
గత రెండు పర్యాయాలు ఏకఛత్రాధిపత్యం సాగించిన మోదీ.. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా సంకీర్ణ డిమాండ్లకు తలొగ్గుతున్నారు. ఆర్టికల్ 370, జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు, మూడు సాగు చట్టాల విషయంలో మిత్రపక్షాలు సహా ఎవరి మాట వినకుండా గతంలో ఏకపక్షంగా ముందుకు వెళ్లిన మోదీ ప్రభుత్వం.. ఈ ఏడాదిపాలనలో తన నిర్ణయాలపైనే యూటర్న్ తీసుకొన్నది. 2024 ఎన్నికల ప్రచారంలో కులగణన డిమాండ్‌ను కొట్టేసిన మోదీ ప్రభుత్వం దాన్ని సమాజాన్ని చీల్చే ప్రయత్నంగా అభివర్ణించింది. అయితే, ఎన్నికల ఫలితాల అనంతరం సీన్ రివర్స్ కావడంతో 2026 అక్టోబర్ 1న ప్రారంభించే జనగణనలో కులగణనను కూడా చేర్చింది.
లాటెరల్ ఎంట్రీ నియామకాల్లో తన మునుపటి ఆదేశాలను కేంద్రం వెనక్కి తీసుకొన్నది. యూనిఫైడ్ పింఛన్ పథకం, వక్ఫ్ సవరణ బిల్లుల విషయంలో ప్రతిపక్షాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొన్నది. ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా అంతర్జాతీయ మద్దతు కూడగట్టడానికి ఏర్పాటు చేసిన కమిటీలో ప్రతిపక్ష నేతలకు చోటునిచ్చింది. ఇక, గత పదేండ్లలో ఈడీ, సీబీఐ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో విపక్ష నేతలను లక్ష్యంగా చేసుకొన్న మోదీ సర్కారు.. ఇప్పుడు ఆ దూకుడును కూడా తగ్గించింది. అందుకే, గత పదేండ్లలో ప్రతీ రోజూ విపక్ష నాయకుల ఇండ్లల్లో ఈడీ, సీబీఐ దాడులు జరగ్గా, ఇప్పుడు గడిచిన ఏడాదిలో అది పూర్తిగా తగ్గిపోయింది. 2014-22 మధ్య 2,974 చోట్ల ఈడీ, సీబీఐ దాడులు జరగ్గా, 2024-25 మధ్య పదుల సంఖ్యలోనే ఈ సోదాలు జరిగినట్టు గణాంకాలు చెప్తున్నాయి.