బీజేపీ సర్క్స్!
‘సర్'పై వెల్లువెత్తుతున్న ఆరోపణలపై, వ్యక్తమవుతున్న అనుమానాలపై దేశ ప్రజానీకానికి సమాధానం చెప్పాల్సింది కేంద్ర ఎన్నికల సంఘం. సర్ అనబడే ‘సవాలక్ష రంధ్రాల’ జల్లెడ కార్యక్రమానికి కర్త, కర్మ, క్రియ అదే కాబట్టి తన సచ్ఛీలతను, పారదర్శకతను నిరూపించుకోవాల్సింది ఈసీనే. కానీ విచిత్రంగా బీజేపీ మాట్లాడుతున్నది. ఈసీ ఏదో తన జేబుసంస్థ అయినట్టు బీజేపీ తల్లడం మల్లడం అవుతున్నది. కందకు లేని దురద కత్తిపీటకెందుకు?
- ‘సర్’పై సందేహాల వెల్లువ.. జవాబివ్వాల్సిన బాధ్యత ఈసీది
- బీజేపీకి ఏం సంబంధం?.. ఎందుకీ ఉలికిపాటు ర్యాలీలు?
- గుమ్మడికాయల దొంగలా బీజేపీ.. తిరంగా ముసుగులో హంగామా
- రాజ్యాంగం, చట్టాలను తుంగలో తొక్కుతూ కమలనాథుల పరిహాసం
- రాజ్యాంగబద్ధ సంస్థకు రాజకీయ పార్టీ వత్తాసు ఏమిటని సర్వత్రా చర్చ
- రాజకీయ ప్రయోజనాల కోసమే ఈసీని బీజేపీ రక్షిస్తున్నదని విమర్శలు
- బీజేపీ గెలుపు కోసమే ‘సర్’ తెచ్చారంటూ ఇప్పటికే విపక్షాల మండిపాటు
- పుష్కర పాలనలో బీజేపీ హయాంలో విమర్శలకు అడ్డాగా మారిన ఈసీ
- ‘సర్’పై ఎన్నికల సంఘానికి మద్దతుగా దేశవ్యాప్తంగా బీజేపీ 40 ర్యాలీలు
- బీజేపీకి పాలించే అర్హత లేదు
- దేశంలో 13 కోట్ల ఓట్లు తొలగించి ‘లోక్తంత్ర బచావో’ పేరిట ర్యాలీలా?
- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
‘సర్’పై వెల్లువెత్తుతున్న ఆరోపణలపై, వ్యక్తమవుతున్న అనుమానాలపై దేశ ప్రజానీకానికి సమాధానం చెప్పాల్సింది కేంద్ర ఎన్నికల సంఘం. సర్ అనబడే ‘సవాలక్ష రంధ్రాల’ జల్లెడ కార్యక్రమానికి కర్త, కర్మ, క్రియ అదే కాబట్టి తన సచ్ఛీలతను, పారదర్శకతను నిరూపించుకోవాల్సింది ఈసీనే. కానీ విచిత్రంగా బీజేపీ మాట్లాడుతున్నది. ఈసీ ఏదో తన జేబుసంస్థ అయినట్టు బీజేపీ తల్లడం మల్లడం అవుతున్నది. కందకు లేని దురద కత్తిపీటకెందుకు? ఈసీని అడిగితే బీజేపీ బదులిస్తున్నది. అది చాలక పాదయాత్రలు, ప్రచారయాత్రలు, పాకుడు యాత్రలు చేస్తున్నది. డబ్భు, ఎనభై ఏండ్ల వయసులో బీజేపీ అగ్రనేతలు ఒగరుస్తూ, రొప్పుతూ కాళ్లీడ్చుకుంటూ దేశమంతా తిరుగుతున్నారు. సర్ అనబడే కార్యక్రమమేదో పవిత్ర కార్యమన్నట్టుగా, దాన్ని ప్రశ్నించడమే పాపమన్నట్టుగా చిత్రీకరిస్తూ తిరంగా ర్యాలీలతో తిప్పలు పడుతున్నది.

Bjp
(పిన్నింటి గోపాల్)
హనుమకొండ, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/(స్పెషల్ టాస్క్ బ్యూరో): ‘నచ్చిన పార్టీకి ఓటేయడం భారతీయ ప్రజాస్వామ్య స్ఫూర్తి. అయితే, ఇది గతం. నచ్చిన ఓటరుతో ఓటు వేయించుకోవడం ఇప్పుడు నయా ట్రెండ్.. ఇదీ ‘సర్’తోనే సాధ్యం. ఈసీ తోడుంటే, బీజేపీ ఎప్పుడూ ఢిల్లీ వెంటే!!’.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ కామెంట్ ప్రస్తుత భారతీయ రాజకీయ ముఖచిత్రాన్ని సరిగ్గా ప్రతిబింబిస్తున్నదని చెప్పొచ్చు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను తప్పుబడుతూ.. దీన్ని తీసుకొచ్చిన కేంద్ర ఎన్నికల సంఘాన్ని(ఈసీ) ప్రతిపక్ష పార్టీలతోపాటు సామాన్యులు కూడా నిలదీస్తున్నారు. అయితే, ఈ వ్యవహారంతో అసలేం సంబంధం లేని బీజేపీ.. అనూహ్యంగా సీన్లోకి రావడం, ఈసీకి, ‘సర్’కు మద్దతుగా ర్యాలీలు నిర్వహిస్తుండటం ఇప్పుడు దేశమంతటా చర్చనీయాంశమైంది. ఎన్నికల్లో గెలుపు కోసం ఈసీని బీజేపీ వాడుకొంటున్నదని, అందుకే, ‘సర్’ వ్యవహారంలో ఈసీకి మద్దతుగా భారీ ర్యాలీలు చేపట్టి.. రక్షణగా నిలుస్తున్నదని రాజకీయ విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు.
ఈసీ కోసం 40 ర్యాలీలు
ఏడాదిన్నర కిందట బీహార్‌లో చేపట్టిన ‘సర్’ ప్రక్రియతో మొదలైన వివాదాలు, విమర్శలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి కోర్టుల్లోనూ లెక్కకు మించి పిటిషన్లు నమోదవుతున్నాయి. దేశంలోని రాజకీయ పార్టీలు, మేధావులు, సామాన్య ప్రజానీకం ఇలా అంతా ఒక్కటై ‘సర్’ ప్రక్రియలోని లోపాలను ఎండగడుతున్నారు. సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరకుండానే ఈసీ ఏకపక్షంగా ‘సర్’ నిబంధనలు రూపొందించడం, ‘సర్’లోని లోపాలను దేశ అత్యున్నత న్యాయస్థానం సైతం తప్పుబట్టడం, అన్నింటికీ మించి ‘సర్’లో తొలగించిన ఓట్లపై పెద్దయెత్తున దుమారం రేగడం వెరసి ఈసీ ఏకపక్ష వైఖరిని ప్రతీఒక్కరూ ప్రశ్నిస్తున్నారు.
ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగస్ఫూర్తితో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాల్సిన ఈసీ.. విశ్వసనీయతను, ప్రతిష్ఠను కోల్పోయిందంటూ ఈసీ మాజీ కమిషనర్లు సైతం దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈసీకి మద్దతుగా ‘సర్’ను సపోర్ట్ చేస్తూ రాజకీయ పార్టీ అయిన బీజేపీ తీసుకొన్న నిర్ణయం దేశవ్యాప్తంగా విమర్శలకు దారి తీస్తున్నది. అర్హులైన కోట్ల మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్న ఈసీపై ప్రజలు తిరగబడుతుంటే… బీజేపీ కేంద్ర నాయకత్వం ఢిల్లీ నుంచి గల్లీదాకా ఈసీకి అండగా నిలుస్తూ.. 25 రోజుల వ్యవధిలో ఏకంగా 40 ర్యాలీలు చేపడుతుండటం వివాదంగా మారింది.
స్వతంత్రంగా ఉండాల్సిన కేంద్ర ఎన్నికల కమిషన్‌కు మద్దతుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, అగ్రనేత అమిత్ షాతోపాటు ఆ పార్టీ కేంద్ర నాయకులు ప్రధాన నగరాల్లోని రోడ్లపై ర్యాలీలు తీస్తూ.. కేంద్ర ఎన్నికల కమిషన్ గొప్పగా పని చేస్తున్నదని సర్టిఫికెట్లు ఇవ్వడం దుమారం రేపుతున్నది. ప్రజాస్వామ్య వ్యవస్థలో అతి ముఖ్యమైన ఎన్నికల ప్రక్రియను నిర్వహించే కేంద్ర ఎన్నికల కమిషన్.. దేశంలోని ఓ ప్రధాన రాజకీయ పార్టీ ఇలా కలిసిపోవడం ఎక్కడా జరుగలేదనే రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
‘సర్’ విషయంలో పరస్పర ప్రయోజనాల కోసమే ఈసీకి బీజేపీ తొలినుంచీ మద్దతు ఇస్తున్నదని చర్చ జరుగుతున్నది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ దేశంలోని అన్ని వ్యవస్థలకు నాయకత్వం వహించాలి. ప్రభుత్వంలోని ప్రతి అధికార వ్యవస్థ పారదర్శకంగా, నిబంధనల మేరకు నడిచేలా పర్యవేక్షించాలి. అయితే, ఇవేమీ పట్టని బీజేపీ ప్రభుత్వం మాత్రం ఒక్కటే చేయిస్తున్నది. ఎన్నికల్లో తమ పార్టీ గెలుపు కోసమే అన్ని వ్యవస్థలను వాడుకొంటున్నది.
ఈడీ, సీబీఐ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలతో ప్రత్యర్థి పార్టీల నాయకత్వాలను ఇబ్బందులు పెట్టడం కొనసాగిస్తూనే… ఈసీతో ఓటర్ల ఎంపిక విధానాన్ని బీజేపీ తమకు అనుకూలంగా అమల్లోకి తీసుకొస్తున్నదని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాదు, ‘సర్’పై దాఖలైన పలు కేసులు సుప్రీంకోర్టులో ఇప్పటికే ఉన్నాయి. వాటిపై విచారణ కొనసాగుతున్నది. ఇలాంటి సమయంలో న్యాయవ్యవస్థ పరిధిలో ఉన్న ‘సర్’ వ్యవహారాన్ని సమర్ధిస్తూ.. బీజేపీ బహిరంగంగా ఈసీకి మద్దతునివ్వడాన్ని రాజ్యాంగ పండితులు తప్పుపడుతున్నారు. ఇది ఒకరకంగా న్యాయవ్యవస్థ గౌరవాన్ని దెబ్బతీయడమేనని విమర్శిస్తున్నారు.

Ballotsprotests
శేషన్ సార్.. మీరు సూపర్
‘సర్’ ప్రక్రియపై వివాదం కొనసాగుతున్న వేళ, ఈసీ విశ్వసనీయతపై వివాదం కొనసాగుతున్న సమయంలో ఈసీకి పదో ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా 1990 నుంచి 1996 వరకు విధులు నిర్వహించిన టీఎన్ శేషన్ గురించి సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ప్రజాస్వామ్యంలో అతి ముఖ్యమైన ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, శాంతియుతంగా నిర్వహించడమే ఎన్నికల కమిషన్ ప్రధాన విధి అని శేషన్ గట్టిగా నమ్మేవారు. పదవీకాలం మొత్తం దీని కోసమే గట్టిగా పనిచేశారు. దీంతో అప్పటివరకూ గందరగోళంగా, విచ్చలవిడిగా ఉన్న ఎన్నికల నిర్వహణ గాడిలో పడింది. బ్యాలెట్ పేపర్లను చింపేసే ధోరణి, పోలింగ్ కేంద్రాల ఆక్రమణ, గంపగుత్తగా ఒకే పార్టీకి ఓటేసే దౌర్జన్యాలను ఆయన నియంత్రించారు.
విధుల విషయంలో శేషన్ ఎంత నిక్కచ్చిగా ఉంటారో చెప్పడానికి అప్పటి మధ్యప్రదేశ్ ఎన్నికలను ఉదాహరణగా చెప్పవచ్చు. కుమారుడి గెలుపు కోసం అప్పటి మధ్యప్రదేశ్ గవర్నర్ తన రాజ్యాంగ పదవిని కూడా మరచిపోయి ప్రచారం చేస్తే, దాన్ని తప్పుబట్టిన శేషన్.. ఆ ఎన్నికను సస్పెండ్ చేశారు. ఇలాంటి మరెన్నో ఘటనలతో ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల కంటే ఓటర్లు గొప్ప వాళ్లు అనే అభిప్రాయాన్ని ఆయన తీసుకొచ్చారు. శేషన్ తర్వాత వచ్చిన వారు ఆ స్థాయిలో కాకున్నా అదే తీరుగా పనిచేస్తూ వచ్చారు. అయితే, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం పనితీరు క్రమంగా మసకబారున్నదన్న వాదనలు పెరుగుతున్నాయి.
సీజేఐ లేకుండా ఎంపిక
కేంద్ర ఎన్నికల కమిషనర్ల ఎంపిక ప్రక్రియ విధానాన్ని మార్చడంతోనే బీజేపీ ఈ వ్యవస్థను విధ్వంసం చేయడానికి పునాదిగా మార్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. కేంద్ర ఎన్నికల కమిషనర్ల ఎంపికలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ప్రమేయం ఉండాలనే విధాన నిర్ణయాన్ని తొలగిస్తూ.. సీజేఐ స్థానంలో కేంద్ర క్యాబినెట్ మంత్రిని భర్తీ చేస్తూ 2024 జనవరి 2న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో నచ్చిన వాళ్లను ఎన్నికల కమిషనర్లుగా నియమించుకునే అవకాశం బీజేపీకి దక్కింది.
ఈ తాజా చట్టంతో పారదర్శక ఎన్నికల విధానానికి తిలోదకాలు ఇచ్చినట్టు అయ్యిందని విశ్లేషకులు విమర్శలు వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఈసీ విశ్వసనీయతను క్రమంగా తగ్గించేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నట్టు పలువురు చెప్తున్నారు. ఇదిలా ఉండగా.. 2024లో మహారాష్ట్ర, హర్యానా, జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఎన్నికల్లో ఓట్ల లెక్కింపులో భారీ తేడా కనిపించినట్టు ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ ఓ కథనంలో పేర్కొనడం ఎన్నికల నిర్వహణలో ఈసీ పారదర్శకతను ప్రశ్నిస్తోంది. మొత్తం 51 నియోజకవర్గాల్లో పోలైన ఓట్లు, లెక్కించిన ఓట్లలో వ్యత్యాసం కనిపించినట్టు ఆ కథనం తేల్చిచెప్పింది.
వివాదాల ‘సర్’
దేశవ్యాప్తంగా వివాదంగా మారిన ‘సర్’ ప్రక్రియపై ఈసీలోనే అసమ్మతి నెలకొన్నదన్న విషయం ఇటీవల బయటకురావడం సంచలనంగా మారింది. ఈసీలోని ఇద్దరు కమిషనర్లు ‘సర్’పై పదేపదే అసమ్మతి వ్యక్తం చేసినా పట్టించుకోలేదని ఓ జాతీయ పత్రిక తెలిపింది. ఫారమ్ 6లో మార్పులు, ఓటర్ల జాబితా డేటా కేంద్రీకరణకు సంబంధించిన ఆందోళనలు సహా 10 నెలల వ్యవధిలో ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్సింగ్ సంధూ, వివేక్ జోషి కనీసం 14 సార్లు అధికారికంగా అభ్యంతరాలు తెలిపినట్టు ఆ కథనం వెల్లడించింది. అయినప్పటికీ, దీనిపై ఈసీ ఏకపక్షంగానే ముందుకు వెళ్లినట్టు వివరించింది. ఇది రాజకీయంగా పెను దుమారాన్ని రేపింది.
ఇక, ఫారమ్ 6, ఫారమ్ 7 దరఖాస్తుల విషయంలోనూ ఈసీపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వచ్చాయి. ఫారమ్ 6తో అర్హులైన పౌరులు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, గతంలో ఓటు వేసి, ‘సర్’ ప్రాథమిక ముసాయిదా జాబితాలో పేరులేని వారు.. ఫారమ్ 6తో మళ్లీ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని ఈసీ పేర్కొనడం వివాదమైంది. ఇదిలా ఉండగా.. ఫారమ్ 7 సాయంతో నమోదైన ఓటర్ల పేర్లపై అభ్యంతరం వ్యక్తం చేయవచ్చు. ఏకంగా తొలగించాలని కూడా కోరవచ్చు. దేశవ్యాప్తంగా కోట్ల మంది ఓటర్ల పేర్లను తొలగించడానికి ఇవే కారణమయ్యాయనే విమర్శలు ఉన్నాయి. ధ్రువీకరణ లేకుండా సమర్పించే ఫారమ్ 7తో ఓటరు జాబితా నుంచి ఇతరుల పేర్లను తొలగించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సుప్రీంకోర్టులోనూ ఈ అంశంపై వివాదం కొనసాగుతున్నది.
ఓటరుకు తెలియకుండా మరొకరు వారి పేరిట ఫారమ్ 7 సమర్పించడం, ఎన్నికల కమిషన్ ముసాయిదా జాబితాలో ఇలాంటి వారి పేర్లను తొలగించడం దేశవ్యాప్తంగా జరిగిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఫారమ్ 7 దుర్వినియోగం జరిగిందని పలు రాష్ర్టాల్లో జరిగిన అంతర్గత విచారణలోనూ నిర్ధారణ జరిగింది. తెలంగాణలోనూ ఇలాంటి అక్రమాలపై పలువురు బీఎల్వోలను ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసింది. బీజేపీ ప్రభుత్వం ఆదేశాల మేరకే ఈసీ.. ఈ ఫారమ్ 6, ఫారమ్ 7లో మార్పులు చేసిందని ప్రతిపక్ష నేతలు, ఎన్నికల మాజీ కమిషనర్లు, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. కేంద్ర ఎన్నికల కమిషన్ రాజ్యాంగ సంప్రదాయాలు, విధానాలతోపాటు పార్లమెంట్ ఆమోదించిన చట్టాలను ఉల్లంఘించిందని విమర్శిస్తున్నారు.
సొంత పార్టీ నేత కూడా విమర్శలు
ఒకవైపు ‘సర్’ ప్రక్రియకు సంబంధించి ఈసీకి మద్దతుగా బీజేపీ భారీ ర్యాలీలను చేపడుతుంటే, అదే బీజేపీకి చెందిన సీనియర్ నేత, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ‘సర్’పై తీవ్రస్థాయిలో మండిపడటం ఇటీవల సంచలనంగా మారింది. యూపీలో ఇటీవల చేపట్టిన ‘సర్’ కారణంగా 1.27 కోట్ల మంది హిందువుల ఓట్లు గల్లంతయ్యాయని ఆయన ఆరోపించారు. యోగి వ్యాఖ్యలతో ఏదైనా ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని ఓట్లను తొలగించవచ్చన్న వాదనకు బలం చేకూరినట్టు విపక్ష నేతలు చెప్తున్నారు.
‘గుమ్మడికాయల దొంగ ఎవరు? అంటే భుజాలు తడుముకొన్నట్టు’గా ఉంది.. ప్రస్తుత బీజేపీ వైఖరి!
అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఎన్నికల నిర్వహణ అనే బృహత్తర కార్యాన్ని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) గడిచిన ఏడెనిమిది దశాబ్దాలుగా నిర్వహిస్తున్నది. అయితే, అదే ఈసీ ఇటీవల ‘సర్’ పేరిట తీసుకొంటున్న తప్పుడు నిర్ణయాలపై ప్రతిపక్ష పార్టీలు, మేధావుల నుంచే కాదు.. సామాన్య ప్రజల నుంచి కూడా తీవ్రమైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి, ప్రజల నుంచి వ్యక్తమవుతున్న ప్రశ్నలకు ఈసీ జవాబు చెప్పాల్సి ఉండగా.. అనూహ్యంగా తెరపైకి వచ్చిన బీజేపీ.. ఈసీ పక్షాన వకాల్తా పుచ్చుకున్నది.
‘సర్’ విషయంలో ఈసీది తప్పేమీ లేదంటూ కాళ్లకు బలపం కట్టుకొని మరీ 25 రోజుల వ్యవధిలో దేశవ్యాప్తంగా ఏకంగా 40 భారీ ర్యాలీలను ప్లాన్ చేసింది.
నిజానికి ఈసీ అనేది పార్లమెంట్ ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పడిన సంస్థ ఏమీకాదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్-324 ప్రకారం ఏర్పాటైన రాజ్యాంగబద్ధ స్వతంత్ర సంస్థ. అంటే, ఈసీకి ఏ రాజకీయ పార్టీతో, ప్రభుత్వాలతో ఎలాంటి సంబంధం లేదు. అయినప్పటికీ, ఈసీకి మద్దతుగా అన్నీతానై బీజేపీ ముందుకు రావడం, నితిన్ నబీన్, అమిత్ షా వంటి ఉద్దండులు ర్యాలీలు చేపట్టడం సర్వత్రా విమర్శలకు దారితీస్తున్నది. ఈ పరిణామాల నేపథ్యంలో ‘బీజేపీ గెలుపు కోసం ఈసీ పనిచేస్తున్నది. ఈసీకి రక్షణగా బీజేపీ నిలబడుతున్నది.. దీనికి తాజా ఘటనలే రుజువు’ అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
బిహార్‌లో ‘సర్’ లీలలు ఇలా..
‘సర్’ ప్రక్రియలో భారీగా ఓట్లు తొలగించడం వల్లే తమ పార్టీలు ఓడిపోయాయని అటు తమిళనాడు మాజీ సీఎం ఎంకే స్టాలిన్, ఇటు బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ ఆరోపించడం రాజకీయవర్గాల్లో సంచలనంగా మారింది. ఇప్పుడు ఈ జాబితాలో బీహార్ కూడా చేరినట్టు తెలుస్తోంది. బీహార్‌లోని 243 నియోజకవర్గాలకు గత నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో సుమారు 4.93 కోట్ల మంది తమ ఓటుహక్కును వినియోగించుకొన్నారు.
అయితే, దాదాపు కోటి ఓట్లతో బీజేపీ 89 సీట్లను గెలుచుకోగా, 1.15 కోట్ల ఓట్లను సాధించిన విపక్ష ఆర్జేడీ మాత్రం 25 స్థానాలకే పరిమితమైంది. ఇక, 96 లక్షల ఓట్లు సాధించిన బీజేపీ మిత్రపక్షం జేడీయూ మాత్రం 85 సీట్లను గెలుచుకోవడం గమనార్హం. అంతేకాదు, కేవలం 10 వేల ఓట్ల తేడాతో బీజేపీ+జేడీయూ కూటమి కలిసి 33 స్థానాలు గెలుచుకోగా, 5 వేల ఓట్ల తేడాతో 13 సీట్లలో ఈ కూటమి విజయాన్ని నమోదు చేసింది. కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ విక్టరీ మార్జిన్ 95 ఓట్ల నుంచి 1300 ఓట్లుగా ఉండటం గమనార్హం. దీంతో బీహార్‌లో జరిగిన ‘సర్’ ప్రక్రియపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో టార్గెట్ బీఆర్ఎస్
కేంద్రంలోని బీజేపీ మొదటినుంచీ తెలంగాణలో బీఆర్ఎస్ను లక్ష్యంగా చేసుకున్నది. ‘సర్’ ప్రక్రియలోనూ ఈసీ ద్వారా ఇదే చర్యలను కొనసాగిస్తున్నది. ప్రస్తుత అంచనాల ప్రకారం.. దేశంలోనే అత్యధికంగా 27శాతం ఓటర్లను తెలంగాణలో తొలగించే ప్రక్రియ కొనసాగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే వెల్లడయ్యే ఓటర్ల తుది జాబితాలో ఈ మేరకు వివరాలు వెల్లడికానున్నట్టు తెలిసింది. సర్‌కు ముందు తెలంగాణలో 3.38 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ‘సర్’ ప్రాథమిక దరఖాస్తు ప్రక్రియ ముసిగిన తర్వాత 2.64 కోట్లకు తగ్గింది. వీరిలో 92.88 లక్షల మంది ఈసీ నోటీసులు జారీ చేసింది. అన్ని ప్రక్రియల తర్వాత రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 2.45 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచిన అసెంబ్లీ సెగ్మెంట్లలోనే ఎక్కువగా ఓటర్లను తొలగిస్తున్నట్టు ఈసీ విడుదల చేసిన గణాంకాలను బట్టి అర్థమవుతున్నది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2023లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 సీట్లు గెలిచింది. వివిధ కారణాలతో ఈ నియోజకవర్గాల్లోని 39.12 లక్షల ఓటర్లను (53.3 శాతం) ప్రాథమిక ముసాయిదా జాబితాలో తొలగించారు. గ్రేటర్ హైదరాబాద్‌లో బీఆర్ఎస్ బలంగా ఉన్న సెగ్మెంట్లలో సగటున 27 శాతం వరకు ఓటర్లను సర్ ప్రక్రియలో తొలగిస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన 64 సెగ్మెంట్లలో 20.37 లక్షల మంది ఓటర్లను… బీజేపీ గెలిచిన ఎనిమిది సెగ్మెంట్లలో కలిపి 2.97 లక్షల మంది ఓటర్లను తొలగించినట్లు ముసాయిదా జాబితాలో పేర్కొన్నారు. దీన్నిబట్టి బీఆర్ఎస్ ఓటర్లే టార్గెట్‌గా రాష్ట్రంలో ‘సర్’ ప్రక్రియ కొనసాగుతున్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కోట్లాది ఓట్ల తొలగింపు
‘సర్’ అనేది కొత్త ప్రక్రియ ఏమీకాదు. దేశంలో ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఇది జరుగుతున్నది. 2002లోనూ ఇది దేశవ్యాప్తంగా పకడ్బందీగానే జరిగింది. అయితే, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ‘సర్’ ప్రక్రియ తీరు మొత్తం మారింది.
ఓటర్ల జాబితా ప్రాథమిక నిబంధనలు, ప్రమాణాలను పక్కనబెడుతూ.. ఎన్నికల్లో గెలుపు ఒకే ప్రాతిపదికగా ఈసీ ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. బీజేపీ విజయాల కోసమే ఈసీ ప్రత్యేకంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ వచ్చిందన్న అభియోగాలు కూడా పెరుగుతున్నాయి. విపక్ష నేతలు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, డీఎంకే అధినేత స్టాలిన్, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ సహా పలువురు నేతలు చేసిన ఆరోపణలు ఈ వాదనలకు మరింత బలాన్ని ఇస్తున్నాయి.
ప్రజల అభ్యంతరాలను, రాజకీయ పార్టీల అభిప్రాయాలను పట్టించుకోకుండా దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ నిర్వహించిన ‘సర్’ ప్రక్రియలో ఏకంగా 14-15 శాతం మేర ఓట్లు గల్లంతయినట్టు నివేదికలు చెప్తున్నాయి. ఇప్పటివరకూ ‘సర్’ పూర్తైన 24 రాష్ర్టాలు, ప్రక్రియ కొనసాగుతున్న మిగతా రాష్ర్టాల తుది, ప్రస్తుత డ్రాప్ట్ రోల్ డేటాను విశ్లేషిస్తే, దేశవ్యాప్తంగా 13.75 కోట్ల మంది ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉన్నట్టు సమాచారం. సగటున ప్రతి రాష్ట్రంలో 10 శాతం కంటే ఎక్కువ మంది ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలిగిస్తున్నట్టు గణాంకాలను బట్టి అర్థమవుతున్నది.
‘సర్’తో సెగ ఇలా…
దేశ జనాభా140 కోట్లు
ఓటర్లు 99.1 కోట్లు
‘సర్’లో తొలగించిన13.75 కోట్లు
‘సర్’ తర్వాత మిగిలే ఓటర్లు 85.35 కోట్లు
ఎట్లా ఉండాలి.. ఎట్లా నడుస్తున్నది?
- ఈసీ ఏర్పాటు: 1950 జనవరి 25
- ఎలా ఏర్పాటైంది?రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఈసీ ఏర్పాటైంది. ఏ పార్లమెంట్ చట్టమూ ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేయలేదు.
- ప్రభుత్వానికి ఈసీతో సంబంధం ఉందా?కేంద్రంలో, రాష్ట్రంలో ఏ ప్రభుత్వానికీ ఈసీతో సంబంధం ఉండదు. ఈసీ అనేది రాజ్యాంగబద్ధ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ.
- పార్టీలు ఈసీతో సంబంధం కలిగిఉంటాయా?రాజకీయ పార్టీలతో ఈసీకి ఎలాంటి సంబంధం ఉండదు. ఈసీ ముందు అన్ని పార్టీలూ సమానమే!
- ఇప్పుడు ఏం జరుగుతున్నది?‘సర్’ విమర్శలు ఎదుర్కొంటున్న రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఈసీకి.. రాజకీయ పార్టీ అయిన బీజేపీ మద్దతు తెలుపుతూ ర్యాలీలు నిర్వహిస్తున్నది.
ఈసీ తీరుపైనా, సర్ నిర్వహణపైనా అభ్యంతరాలుండేది రాజకీయ పార్టీలకు, ప్రజలకు. వాటికి జవాబివ్వాల్సింది.. రాజ్యాంగ సంస్థ అయిన ఎలక్షన్ కమిషన్. మరి ఎలక్షన్ కమిషన్ తరఫున బీజేపీ ఎందుకు వకాల్తా పుచ్చుకుంటున్నది? ఎందుకు ర్యాలీలు తీస్తున్నది. ఈసీపై, సర్‌పై అభ్యంతరాలను కప్పిపుచ్చేందుకు ఎందుకు దేశభక్తి పాటపాడుతున్నది?
జనాభాలో 15 శాతం తొలగింపు

‘సర్’ ప్రక్రియ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్నది. ‘సర్’ పేరిట దేశవ్యాప్తంగా 15 శాతం మందిని జాబితా నుంచి తొలగించారు. కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహారశైలి సరిగా లేదు. ఓటర్ల సంఖ్యను భారీగా తగ్గించడంతో జనాభా నియంత్రణ అనబడే బృహత్ కార్యాన్ని సైతం ఈసీ గొప్పగా (వ్యంగ్యంగా) పూర్తి చేస్తున్నది. ప్రస్తుత సర్ ప్రక్రియలో ఎక్కడా మంచి ఉద్దేశం అనేదేలేదు.
– మాజీ సీఈసీ ఎస్‌వై ఖురేషీ (06.09.2026)
యూపీలో 1.27 కోట్ల హిందూ ఓట్లు గాయబ్

Yogiadityanath
‘సర్’ ప్రక్రియలో ఉత్తరప్రదేశ్‌లో 1.27 కోట్ల మంది హిందువుల ఓట్లు గల్లంతయ్యాయి. ‘సర్’ ప్రక్రియలో అవకతవకలు ఉన్నాయి.
– యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ (17.11.2026)
బీజేపీ గెలుపునకే ‘సర్’

Mamata
బెంగాల్లో బీజేపీని గెలిపించడానికే ఈసీ ‘సర్’ను తీసుకొచ్చింది. ‘సర్’ కారణంగా అసలైన ఓటర్లు కూడా తమ ఓటు హక్కును కోల్పోయారు. ముఖ్యంగా టీఎంసీ సానుభూతిపరులు, ముస్లింల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించారు.
– టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ , (26.09.2026)
డిలీషన్ డ్రామా అందుకే!

Mk Stalin
ఓడించడం సాధ్యంకాని పక్షంలో డిలీషన్ డ్రామాకు తెరతీస్తారు.బీజేపీ విజయసూత్రం అదే. ఇందులో భాగంగానే లక్షితఓటర్లను ‘సర్’ పేరిట తొలగిస్తున్నది.
– డీఎంకే అధినేత స్టాలిన్ (25.07.2025)
‘సర్’తో 50 కోట్లకు మన జనాభా

Arvind Kejriwal
‘సర్’ సాయంతో ఈసీ మన దేశ జనాభాను 140 కోట్ల నుంచి 50 కోట్లకు తగ్గిస్తున్నది. దీనికి అధికార బీజేపీ వంతపాడుతున్నది.
– ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ (31.08.2026)
బీఆర్ఎస్ ఓట్లే టార్గెట్‌గా కుట్రలు

Ktr
‘సర్’ పేరిట బీఆర్ఎస్ అనుకూలుర ఓట్లను తొలగించే కుట్రలకు బీజేపీ, కాంగ్రెస్ తెగబడుతున్నాయి. వాటిని కలిసికట్టుగా తిప్పికొట్టాలి. ‘సర్’పై బీఆర్ఎస్ అప్రమత్తంగా ఉండాలి.
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (16.05.2026)


Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

