బంగారు రుణాలకు బకాయిల సెగ
బంగారం రుణాలకు బకాయిల సెగ గట్టిగానే తాకుతున్నది. దేశంలో వేగంగా విస్తరిస్తున్న తాకట్టు బంగారు రుణాల విభాగంలో వసూళ్ల ఒత్తిడి గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి.
- ఆరు నెలల్లో దాదాపు రెట్టింపైన ఎన్పీఏలు
- జాగ్రత్తగా రుణాలివ్వాలని ఎన్‌బీఎఫ్‌సీలకు ఆర్బీఐ సూచన
న్యూఢిల్లీ, నవంబర్ 24 : బంగారం రుణాలకు బకాయిల సెగ గట్టిగానే తాకుతున్నది. దేశంలో వేగంగా విస్తరిస్తున్న తాకట్టు బంగారు రుణాల విభాగంలో వసూళ్ల ఒత్తిడి గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. 2026 మార్చితో ముగిసేనాటికి 0.16 శాతంగా ఉన్న బంగారు రుణాల్లో నిరర్థక ఆస్తుల విలువ 2026 ఆగస్టు చివరి నాటికి 0.30 శాతానికి చేరిందని ట్రాన్స్‌యూనియన్ సిబిల్ తాజాగా వెల్లడించింది. బంగారం ధరలు భారీగా తగ్గడం, రుణగ్రహీతలపై అప్పుల భారం పెరగడం, రుణ నిబంధనల్లో మార్పులు రావడం వల్ల రుణదాతలకు కొత్త సవాళ్లు ఎదుర్కొవాల్సి వస్తున్నదని పేర్కొంది.
దీంతో దూకుడుగా రుణాలివ్వొద్దని, బంగారు రుణాల పోర్ట్‌ఫోలియోలను మరింత జాగ్రత్తగా పరిశీలించాలని రిజర్వ్ బ్యాంక్..నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల హెచ్చరించింది. ఎన్బీఎఫ్సీ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లతో జరిగిన సమావేశంలో బంగారం ధరలు పడిపోవడంతో లోన్ టు వాల్యూ(ఎల్టీవీ) నిష్పత్తులు పెరగడం, తాకట్టు రక్షణ తగ్గడంపై ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం. ఎల్టీవీ అంటే తాకట్టుగా పెట్టిన బంగారం విలువతో పోలిస్తే ఇచ్చే రుణం నిష్పత్తి. వేగంగా పెరిగిన రుణాల నేపథ్యంలో ఆర్బీఐ ఈ జాగ్రత్త సూచనలు చేసింది. బంగారు నగలపై ఉన్న బకాయి రుణాలు 2026 సెప్టెంబర్‌లో ఏడాది ప్రాతిపదికన 66 శాతం పెరిగి రూ.3.74 లక్షల కోట్లకు చేరాయని సెంట్రల్ బ్యాంక్ గణాంకాలు వెల్లడించాయి. ఇది 2025 సెప్టెంబర్‌లో రూ.2.25 లక్షల కోట్లు, 2024 సెప్టెంబర్‌లో రూ.1.50 లక్షల కోట్లుగా ఉన్నాయి.
అధిక రుణ ఖాతాలే కారణం
బహుళ బంగారు రుణ ఖాతాలు ఉన్న రుణగ్రహీతలు వాయిదాల చెల్లింపుల్లో ఆలస్యాలకు ప్రధాన కారణమని ట్రాన్స్‌యూనియన్ సిబిల్ గుర్తించింది. ఇప్పటికే ఉన్న అప్పుల బాధ్యతలు తీర్చడంలో ఇబ్బంది పడుతున్న వారికి కూడా బంగారం తాకట్టుపై రుణాలు వెళ్తుండటంపై రంగంలోని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల రుణాల వసూళ్ల నాణ్యతలో వచ్చిన క్షీణతలో ఎక్కువ భాగం సవరించిన నియంత్రణ నిబంధనలకు రుణగ్రహీతలు అలవాటు పడుతున్న ప్రక్రియ వల్లేనని కూడా సంస్థ పేర్కొన్నది. బంగారు రుణాల వృద్ధి బలంగానే కొనసాగుతున్నప్పటికీ, పెరుగుతున్న బకాయిలు, ఒకే వ్యక్తి పలుచోట్ల రుణాలు తీసుకోవడం, బంగారం ధరల్లో ఒడిదుడుకులు మరింత నిశిత పర్యవేక్షణ అవసరాన్ని సూచిస్తున్నాయి. ప్రస్తుతం కనిపిస్తున్న చెల్లింపుల ఒత్తిడి తాత్కాలికమేనా లేక అధిక రుణ నష్టాలకు దారితీస్తుందా అన్నది కీలక ప్రశ్నగా మారింది.
దేశీయ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర జనవరిలో సుమారు రూ.1.80 లక్షల గరిష్ఠం నుంచి 30 శాతానికిపైగా తగ్గి దాదాపు రూ.1.25 లక్షలకు పడిపోయింది. బంగారం ధరలు తగ్గితే రుణదాతల ఎల్టీవీ నిష్పత్తి పెరుగుతుంది. రుణ చెల్లింపులు ఆగిపోయినప్పుడు నష్టాలను భరించేందుకు తాకట్టుపై ఉండే రక్షణ కూడా తగ్గే అవకాశం ఉన్నది. సంప్రదాయంగా గడువు చివర ఒకేసారి చెల్లించే రీపేమెంట్లకు బదులు, నిర్ణీత వ్యవధులకు వడ్డీ చెల్లింపులు, ఈఎంఐ ఆధారిత రుణ ఉత్పత్తులు రావడం కూడా కొందరు రుణగ్రహీతలకు సర్దుబాటు సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తున్నది. అధిక ప్రాతిపదిక, మందగించిన డిమాండ్, బంగారం ధరల తగ్గుదల కారణంగా బంగారు రుణాల నిర్వహణలోని ఆస్తుల ఏయూఎం వృద్ధి 2026-27 ఆర్థిక సంవత్సరంలో 40 శాతానికి తగ్గవచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. 2025-26లో ఈ వృద్ధి 78 శాతంగా ఉన్నదని తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

