హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): కేవలం చలానాలు, వసూళ్లపైనే దృష్టి పెడుతున్న ట్రాఫిక్ పోలీసులు, వాహనదారుల భద్రతను ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తనిఖీల పేరిట ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిసూ వాహనదారులను ఇబ్బంది పెడుతున్నారనేందుకు ఆదివారం జరిగిన ఘటన మరో ఉదాహరణగా నిలిచింది. వాహనాలను ఆపే క్రమంలో ఎదురు నిలబడడం, వెంటనే హ్యాండిల్ పట్టుకొని లాగడం, వాహనాల కీని లాక్కోవడం లాంటి చర్యలతో కింద పడి వాహనదారులు గాయలపాలవుతున్న ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి.
ఇలానే వాహనాల తనిఖీ పేరిట ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ చూపిన అత్యుత్సాహం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నది. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను తనిఖీ చేయడమే కాకుండా వాహనదారుడిని పట్టుకొని లాగడంతో అదుపు తప్పి అతడు ఆర్టీసీ బస్సు కింద పడి అక్కడికక్కడే చనిపోవడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనతో ట్రాఫిక్ సిబ్బంది పనితీరుపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని అమలాపురం ప్రాంతానికి చెందిన జోష్‌బాబు కొంతకాలం క్రితమే వచ్చి హైదరాబాద్‌లోని గాజులరామారం రోడామిస్త్రీనగర్‌లో స్థిరపడ్డాడు. వృత్తిరీత్యా కార్పెంటరైన జోష్బాబుకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12.45 గంటల సమయంలో జీడిమెట్ల వైపు నుంచి పంజాగుట్ట వెళ్లేందుకు బైక్‌పై వస్తుండగా బాలానగర్ ట్రాఫిక్ పీఎస్ ఎదుట కానిస్టేబుల్ గోపాల్ మరో ఇద్దరు హోంగార్డులతో కలిసి వాహనాల తనిఖీ చేస్తున్నాడు.
ఈ క్రమంలో కానిస్టేబుల్ గోపాల్ బైక్‌పై వస్తున్న జోష్‌బాబును ఆపే క్రమంలో అతడిని పట్టుకొని లాగాడు. దీంతో అదుపుతప్పిన జోష్‌బాబు కిందపడిపోవడం తో అదే సమయంలో వచ్చిన ఆర్టీసీ బ స్సు అతడి తలపై నుంచి వెళ్లింది. దీంతో జోష్‌బాబు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. కండ్లముందే జరిగిన ఈ ఘోరాన్ని చూసి వాహనదారులు, స్థానికులు కోపంతో కానిస్టేబుల్‌ను కొట్టేందుకు ప్రయత్నించారు. వారి ఆందోళనతో బాలానగర్-జీడిమెట్ల ప్రధాన రహదారి స్తంభించిపోవడంతో పోలీసులు వచ్చి లాఠీలు ఝుళిపించి అక్కడి నుంచి చెదరగొట్టారు. జోష్‌బాబు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీకి తరలించారు.
కానిస్టేబుల్ మద్యం మత్తులో పక్కకు లాగడం వల్లే జోష్‌బాబు బస్సు కింద పడి చనిపోయాడని మృతుడి కుటుంబ సభ్యులు, స్థానికులు చెప్పారు. మృతుడి సోదరుడు నాగ ఫణీంద్ర బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా గోపాల్‌పై కేసు నమోదు చేశారు.
కానిస్టేబుల్ మద్యం మత్తులో ఉన్నట్టు వస్తున్న ఆరోపణల మేరకు అతడిని వైద్యపరీక్షల కోసం గాంధీ దవాఖానకు పంపారు. సదరు కానిస్టేబుల్ మద్యం మత్తులో లేడని వాదిస్తున్న పోలీసులు, అతడికి వెంటనే బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ ఎందుకు చేయలేదని మృతుడి కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు.