శుష్క చర్మస్య తాడనమ్.. ఎవరి కోసం ఈ సదస్సు
ఢిల్లీలో రాహుల్‌గాంధీ తన పొలిటికల్ మైలేజీ కోసం చేపట్టిన కార్యక్రమానికి పోలోమంటూ వేలాది మంది కాంగ్రెస్ నాయకులు తరలిపోయారు తప్ప..ఒక్క మంత్రి, ఒక్క నాయకుడు రాష్ట్రంలో కరువు పరిస్థితుల మీద శ్రద్ధ పెట్టింది లేదు. ఒక్క పర్యటన చేసిందీ లేదు.
- సంక్షుభిత సమయంలో ప్రజలకేదీ భరోసా?
- రాహుల్ ఇమేజీ కోసమే సమ్మిట్ ప్రయాస
(ఎస్జీవీ శ్రీనివాస్‌రావు)
అన్నం నాస్త్యుదకం నాస్తి.. నాస్తి తామ్బూలచర్వణమ్
మన్దిరేషు మహోత్సాహః.. శుష్క చర్మస్య తాడనమ్
అన్నం నాస్తి.. ఉదకం అంటే నీరు నాస్తి.. తాంబూల సేవనం కూడా నాస్తి.. నాస్తి!. అక్కడ కనబడే ఆ హడావుడి అంతా ఎండిపోయిన చర్మం మీద వాయింపుల డబడబలు.. డిబడిబలే! ఏదైనా మంచి ఆరోగ్యకరమైన బలిష్ఠమైన జీవకళ ఉట్టిపడే పశువు చర్మంతో చేసిన మృదంగమైతే అది వెలువరించే లయబద్ధమైన నాదానికి ఒళ్లు పులకరించి, ఉద్వేగభరితమై శరీరం రోమాంచితమవుతుంది. అంతేతప్ప కృంగి, కృషించి, నీరసించి, చావు దగ్గరపడ్డ బక్కచిక్కిన పశువు చర్మంతో చేసిన మృదంగ వాద్యంలో ఏముంటుంది? ఒట్టి చప్పుళ్ళ దబదబలు..డబడబలు తప్ప!!.
అచ్చం మన రాష్ట్ర ప్రభుత్వ పాలనా ఇంతే! మాటలు కోటలు దాటుతుంటే.. చేతలు గడపకూడా దాటవు! సచివుల్లో ఎవరికీ మినహాయింపు లేకుండా అంతా డబడబలు దబదబల బాపతే! సంక్రాంతి వరాలు ఉగాదికి.. ఉగాది హామీలు దసరాకి.. దసరా కోతలు దీపావళికి మారాయే తప్ప ఏవీ ఆచరణలోకి రాలేదు. వరాల సంగతి దేవుడెరుగు. రాష్ట్రంలో రైతులకు నీళ్లు లేవు. కరెంటు లేదు. పంటలు లేవు. విద్యార్థులకు ఫీజులు లేవు. చాలా విభాగాల్లో చిరుఉద్యోగులకు ఆరేసి నెలలుగా జీతాలు లేవు. తెలంగాణ ఉద్యమ నినాదాలు నీళ్లు, నిధులు, నియామకాలు. ఇందులో నీళ్లను ఏపీకి సర్కార్ అప్పగించేసింది. నిధులను ఢిల్లీకి తరలిస్తున్నది. నియామకాల ప్రక్రియ మూలకు పడింది. రాష్ట్రంలో ఏ వర్గమూ ఆనందంగా లేదు. ఏ రంగమూ ముందుకు వెళ్లడం లేదు. అటు వర్షాలు లేవు. ఇటు రేపటికి ప్రజల దాహం తీర్చేంత నీరూ లేదు.
ఢిల్లీలో రాహుల్‌గాంధీ తన పొలిటికల్ మైలేజీ కోసం చేపట్టిన కార్యక్రమానికి పోలోమంటూ వేలాది మంది కాంగ్రెస్ నాయకులు తరలిపోయారు తప్ప..ఒక్క మంత్రి, ఒక్క నాయకుడు రాష్ట్రంలో కరువు పరిస్థితుల మీద శ్రద్ధ పెట్టింది లేదు. ఒక్క పర్యటన చేసిందీ లేదు. ఏ ఒక్క కాంగెస్ నాయకుడు కూడా ఒక్క రైతును పరామర్శించిందీ లేదు. కిందా మీదా పడి రైతులు ఖరీఫ్ పంటలు తీశారు. ఆ ధాన్యం కొనుగోళ్ల మాటెత్తినవాళ్లు లేరు. యూరియా మొదలుకొని.. కరెంటు..నీళ్లు.. అన్ని కష్టాలు పడి తీసిన పంట. కల్లాలలో జాలిగా చూస్తున్నది. ఎండా వానలకు తడుస్తున్నది. అయినా ఒక్క మంత్రి, ఒక్క నాయకుడు ధాన్యం కొనాలని అడిగిన పాపాన పోలేదు. ఈ ఘనకార్యాలు చాలన్నట్టు ప్రభుత్వమే క్రాప్ హాలిడే ప్రకటించడంతో రోజుకో రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. రాష్ర్టానికి జీవగర్రలాంటి వ్యవసాయరంగం కుప్పగూలిన పరిస్థితిలో ఉంది. కరెంటు పరిస్థితి దైవాధీనంగా మారింది. సరిగ్గా ఈ సమయంలో సర్కార్‌కు భారత్ గ్లోబల్ సమ్మిట్ గుర్తుకు వచ్చింది.
ఎన్నికల ముందు కాంగ్రెస్ మ్యానిఫెస్టో కమిటీ చైర్మనే ఇపుడు రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆనాటి మ్యానిఫెస్టోను తలదన్నే లక్ష్యాలను ఈ సమ్మిట్ పత్రంలో ప్రకటించేశారు. ఈ సదస్సు ఎందుకయ్యా? అంటే మారుతున్న ప్రపంచంలో ఇండియాను, ప్రధానంగా హైదరాబాద్‌ను చర్చలకు వేదికగా మార్చడం కోసమట. అంతేకాదు ..మహాత్మా గాంధీ ప్రవచించిన అహింస, సహనం, సహజీవనం… అలాగే నెహ్రూ ప్రవచించిన అలీన విధానం, వ్యూహాత్మక అంతర్జాతీయ సహకారం ఈ సదస్సుకు స్ఫూర్తి అట. భారత్ 80వ స్వాతంత్య్ర సంవత్సరం, నెహ్రూ 137వ జయంతితో ఈ సదస్సు నిర్వహణ ముడిపడి ఉందట. ఇక ఎజెండా ఏమిటంటే భౌగోళిక సమీకరణాల మార్పు, అంతర్జాతీయ సంస్థల సంస్కరణ, ప్రపంచ శాంతి, సహజీవనం అట. పెట్టుబడుల ఆకర్షణకు ప్రపంచ శాంతికి, సహజీవనానికి, వాతావరణ మార్పులకు, సంక్షేమ విధానాలకు, లింగ వివక్ష నిర్మూలనకు, సామాజిక న్యాయానికి ఏం సంబంధమో ఆ పత్రం రాసిన కళాకారులకే తెలియాలి.
సరే, చేతిలో పెన్ను, దాంట్లో ఇంకు ఉంటే ఏమైనా రాయవచ్చు. కానీ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది? మనం దేనికోసం ఈ సదస్సు నిర్వహిస్తున్నాం? గమనించకుండా అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల మధ్య సహకారం గురించి వాతావరణ పరిరక్షణలో అందరి భాగస్వామ్యం గురించి, ప్రభుత్వాల జవాబుదారీతనం గురించి.. ప్రజాస్వామ్యం భవిష్యత్తు గురించి చర్చిస్తామనడమేమిటి? దానికి ఎన్ని వేదికలు లేవు? ఇంకానయం ఇరాన్ మీద అమెరికా దాడుల మీద.. ఉక్రెయిన్ మీద రష్యాదాడుల మీద చర్చించి శాంతి నెలకొల్పి బంగారం ధర నేలకు దించుతాం, అమెరికా ట్రంప్‌ను వంచుతాం అనలేదు. బతికిపోయాం.
అసలు రాష్ట్రంలో ఏం జరుగుతున్నది? రాష్ట్రం ఎలా ఉన్నది? ప్రజలు ఎదుర్కుంటున్న ఇబ్బందులేమిటి? హైదరాబాద్‌లో తాగునీళ్ల పరిస్థితి ఏమిటి? ప్రభుత్వం ఈ సమయంలో చేయాల్సింది ఏమిటి? రోమ్ నగరం తగలబడుతుంటే గిటారు వాయించినట్టు.. ప్రజలు కష్టాల్లో ఉన్న సమయంలో ఇలాంటి సదస్సులు నిర్వహించడం కంటే క్రూర పరిహాసం మరొకటి ఉండదు. కేసీఆర్ ప్రభుత్వం కరోనా సమయంలో ఖజానా ఖాళీగా ఉన్నా రైతులకు రైతుబంధు వేసింది. ఊరూరా కాంటా పెట్టి చివరి గింజ వరకూ ధాన్యం కొనుగోలు చేసింది. ఏ రైతు కన్నీరు పెట్టకుండా చూసింది. ఇపుడు పరిస్థితి ఏమిటి? రాష్ట్రంలో 70శాతం మంది ప్రజలు ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయం మీద, దాని అనుబంధ రంగాల మీద ఆధారపడి బతుకుతున్నారు. ఆ వ్యవసాయం ఇపుడు వెంటిలేటర్ మీద ఉంది. రైతులు ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. సామాజిక సృ్పహ ఉన్న ప్రభుత్వమైతే ముందు రైతులను ఆదుకోవాలి.
పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలి. వ్యవసాయ అనుబంధరంగమైన చేతివృత్తుల వారిని ఆదుకోవాలి. గ్రామాలనుంచి వలసలు నివారించాలి. నిరాశలో ఉన్న యువతకు ఊరట కలిగించాలి. విద్యారంగాన్ని, వైద్యరంగాన్ని బాగు చేసి పేదలను ఆదుకోవాలి. గ్రామాల్లో ప్రజలకు ఏదో రూపంలో డబ్బులు అందేలా చూడాలి. రహదారులు బాగు చేయాలి. తెలంగాణకు లైఫ్‌లైన్ అని పిలిచే చెరువులను బాగు చేయాలి. ఇలాంటి కష్టకాలంలో వాడుకునేందుకే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. దాన్ని బాగు చేసి నీళ్లు ఎత్తాలి. ఇవన్నీ వదిలేసి ఈ సదస్సులు సంరంభాలతో కాలహరణం చేయడం, పెద్దలను ప్రసన్నం చేసుకోవాలని చూడడం కాంగ్రెస్ అనబడే పార్టీకి మొదటినుంచీ ఉన్న పెద్ద రోగం. సర్కార్ ఇలాగే వ్యవహరిస్తే ప్రజలే పూనుకొని ఆ రోగాన్ని వదిలిస్తారు.
హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న భారత్ సమ్మిట్ నిర్వహణలో తెలంగాణ ప్రభుత్వంతోపాటు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ( ఏఐసీసీ) కూడా భాగస్వామిగా ఉన్నది. ‘కొత్త ప్రపంచాన్ని నిర్మిద్దాం’ అనే నినాదంతో నిర్వహిస్తున్న ఈ సదస్సులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ కీలక ఉపన్యాసం ఇవ్వబోతున్నారు. దీనిని బట్టే అర్థమవుతున్నది ఈ ఆర్భాటం వెనుక అసలు లక్ష్యం ఏమిటో..! ఇదంతా రాహుల్‌గాంధీకి అంతర్జాతీయ స్థాయిలో ఇమేజ్ బిల్డప్ కోసం పడుతున్న ప్రయాస తప్ప మరేమీ లేదన్న అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తంచేస్తున్నారు.
ఈ సమ్మిట్ నిర్వహణలో కీలక భాగస్వామిగా ఉన్నందున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ సమ్మిట్ వల్ల రాష్ర్టానికి ఎన్ని పెట్టుబడులు వస్తాయి? ఎన్ని ఉద్యోగాలు సృష్టిస్తారు? ఎన్ని అంతర్జాతీయ పరిశోధనాసంస్థలు హైదరాబాద్‌కు తరలివస్తాయి? రాష్ట్ర యువతకు కలిగే ప్రయోజనాలేమిటి? ఈ ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు లభించకపోతే ఈ సమ్మిట్ ఓ రాజకీయ క్రీడగానే మిగిలిపోతుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

