ఆత్మహత్యలే పరిష్కారమా?
ఐటీ రంగం.. ఊహించని జీతాలు, విలాసవంతమైన జీవితం, ఒక కంపెనీ కాకపోతే మరో కంపెనీలో ఎక్కువ ప్యాకేజీతో ఉద్యోగం. ఈ ప్రభ క్రమంగా మసకబారుతున్నది.
- భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్న ఐటీ కంపెనీలు
- లేఆఫ్‌లతో వేలాది మంది టెకీల భవిష్యత్తు ఆగమాగం
- కీలక స్థానాల్లో దక్షిణ రాష్ర్టాలకు చెందిన వారే అత్యధికం
- తెలంగాణ ఉద్యోగులపైనే మొదటి పిడుగు
- తీవ్ర వేదన, మానసిక ఒత్తిడికి గురవుతున్న ఉద్యోగులు
- స్థానికులను తొలగిస్తే తీవ్ర పరిణామాలేనని కంపెనీలకు కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్చరిక
- తెలంగాణలో సీఎం అలాంటి భరోసా ఇవ్వలేదని ఆవేదన
- హైదరాబాద్ నగరంలో కలకలం రేపుతున్న టెకీల ఆత్మహత్యలు
- అక్టోబర్ 12-27 మధ్య ఆరుగురి బలవన్మరణం
- ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదన్న నిపుణులు
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): ఐటీ రంగం.. ఊహించని జీతాలు, విలాసవంతమైన జీవితం, ఒక కంపెనీ కాకపోతే మరో కంపెనీలో ఎక్కువ ప్యాకేజీతో ఉద్యోగం. ఈ ప్రభ క్రమంగా మసకబారుతున్నది. కంపెనీలు ఏఐని సాకుగా చూపి, అడ్డగోలుగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీంతో ఉపాధి కోల్పోయిన వారు తీవ్రంగా కుంగిపోతుండగా, ఉద్యోగాలు చేస్తున్నవారు సైతం ‘తర్వాత తామేనేమో?’ అనే దిగులుతో మానసిక ఒత్తిడిలో కూరుకుపోతున్నారు. ఇది సాధారణంగా అన్ని రంగాల్లో కనిపించే ఒత్తిడే. కానీ ఐటీ ఉద్యోగులు ఇటీవల ఆత్మహత్యల వైపునకు మళ్లడం ఆందోళన కలిగిస్తున్నది.
ఇన్నాళ్లూ భరోసాగా ఉన్న ఉద్యోగం, సంపాదన ఇకపై ఉండవన్న ఆలోచనే వారిలో వణుకు పుట్టిస్తున్నది. దీనికితోడు రూ.లక్షల జీతమంటూ ఇంట్లో చెప్పుకొని, రిచ్ లైఫ్ అంటూ బంధువుల్లో పేరు తెచ్చుకొని, కుటుంబం అంతా స్థిరపడినట్టేనని కలలుగన్న వారికి లేఆఫ్‌లు కుంగదీస్తున్నాయి. జీవితం ఒక్కసారిగా ఊహించని విధంగా తిరగబడుతుండటంతో తట్టుకోలేక చాలామంది ఐటీ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆర్థిక సమస్యలు, ఉద్యోగాల్లో సవాళ్లతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అయితే చాలా రాష్ర్టాలు అక్కడ కంపెనీలకు స్థానికులను తొలగించొద్దంటూ సూచనలు చేస్తున్నా.. తెలంగాణ ప్రభుత్వానికి మాత్రం ఆ సోయి లేదని ఐటీ ఉద్యోగులు వాపోతున్నారు.
35 ఏండ్లలోపువారే అధికం
హైదరాబాద్‌లో గత నెల 12-27వ తేదీల మధ్య ఆరుగురు ఐటీ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకోవడం ఆ రంగంలోని విపత్కర పరిస్థితికి సాక్ష్యంగా మారింది. ఇటీవల బలవన్మరణాలకు పాల్పడుతున్న వారిలో అధికంగా 35 ఏండ్ల లోపువారే కావడం మరో విషాదం. ఈ ఏడాది ఫిబ్రవరి 4న మియాపూర్‌కు చెందిన 31 ఏండ్ల వయసున్న ఓ ఐటీ ఉద్యోగి తన ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని తనువు చాలించారు. ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలో కోడింగ్ చేసేవారు. పని ఒత్తిడితో సతమతం అవుతున్నానని తరచూ చెప్పేవారని ఆయన భార్య పేర్కొన్నారు. జూలై 29న నార్సింగిలోని పుప్పాలగూడలో ఒక అపార్ట్మెంట్లోని 10వ అంతస్తు నుంచి దూకి మరో టెకీ ఆత్మహత్య చేసుకున్నారు.
ఆయన వయసు 27 ఏండ్లు మాత్రమే. మానసిక ఒత్తిడితో బాధపడుతూ అర్ధాంతరంగా తనువు చాలించారని కుటుంబ సభ్యులు తెలిపారు. అక్టోబర్ 6న గచ్చిబౌలిలో ఓ యువతి ఆత్మహత్య కలకలం రేపింది. నానక్‌రామ్‌గూడలోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఆమె.. కొంతకాలగా ఉద్యోగ భద్రతపై ఆందళన చెందుతున్నదని, మానసిక కుంగుబాటుతో బాధపడుతున్నదని స్నేహితులు తెలిపారు. అక్టోబర్ 16న హర్యానాకు చెందిన 36 ఏండ్ల సాఫ్ట్వేర్ ఉద్యోగి కొండాపూర్ ప్రాంతంలోని ఒక సర్వీస్ అపార్ట్మెంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. విశాఖపట్నానికి చెందిన 25 ఏండ్ల సాఫ్ట్వేర్ ఉద్యోగి మాదాపూర్‌లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీది నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. నగరంలో ఇలాంటి ఘటనలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నదని నిపుణులు చెప్తున్నారు.
చాలెంజింగ్కు తోడు లేఆఫ్స్!
అద్దాల మేడల్లాంటి కార్పొరేట్ కార్యాలయాలు, అందులో ఉద్యోగం చేస్తున్న వారి జీవనశైలిని చూసి అందరూ ఆశ్చర్యపోతుంటారు. కానీ పరిమితికి మించి ఖర్చు, వెంటాడే ఈఎంఐల రూపంలో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయని ఉద్యోగులు చెప్తున్నారు. నిర్ణీత గడువులోపు ప్రాజెక్టులు పూర్తిచేయాలంటూ టార్గెట్లు, గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చోవాల్సి రావడం, విదేశీ క్లయింట్లతో సమావేశాలు ఇలా అనేక ఒత్తిళ్లు ఉంటాయని ఆందోళనకు గురవుతున్నారు. దీనికితోడు పనివేళలు తరచూ మారుతుంటాయని, నిద్రలేమి సమస్య తలెత్తుతున్నదని చెప్తున్నారు. ఈ ఒత్తిళ్లను తగ్గించుకోవడానికి చాలామంది మద్యం, మత్తు పదార్థాల వైపు మళ్లుతుంటారని పేర్కొన్నారు. వీకెండ్స్‌లో భారీగా ఖర్చుచేసి పబ్బులు, క్లబ్బులకు వెళ్తుంటారని, ఆ తర్వాత అప్పుల ఊబిలో చికుకుపోతుంటారని వివరించారు. తమ వేతనంలో అధిక భాగం అప్పులు తీర్చడానికే సరిపోతుందని ఓ టెకీ వాపోయారు.
దీనికితోడు లేఆఫ్స్ భయం వెంటాడుతున్నదని తెలిపారు. నివేదికల ప్రకారం ఈ ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.90 లక్షల మంది వరకు ఐటీ ఉద్యోగాలు కోల్పోయారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారంటూ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇటీవలే ఇన్ఫోడేటా అనే కంపెనీ భారత్‌లో 550 మంది ఉద్యోగులను ఇలాగే తొలగించడం సంచలనంగా మారింది. మైక్రోసాఫ్ట్ తన సిబ్బందిలో 27 శాతం మందికి వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్(వీఈవో) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒరాకిల్ సుమారు 30 వేల మందిని తీసేసింది. అమెజాన్, మెటా, డ్రాప్‌బాక్స్ సైతం ఉద్యోగులను సాగనంపాయి. ఈ లేఆఫ్‌లకు ఏఐ, ఆటోమేషన్ కారణాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కంపెనీలు బడ్జెట్‌ను తగ్గించుకొని, ఏఐ వైపు మళ్లుతున్నాయని పేర్కొంటున్నారు. ఓవైపు లేఆఫ్స్, మరోవైపు కొత్త ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలు తగ్గడంతో ఐటీ ఉద్యోగులంతా తీవ్ర అభద్రతాభావంతో, మానసికంగా కుంగిపోతున్నారని చెప్తున్నారు. దీంతో చాలామంది ఇతరులతో చెప్పుకోలేక, పరిష్కారం కనిపించక ఆత్మహత్య చేసుకుంటున్నారు.
ఆత్మహత్యలు వద్దు: నిపుణులు
మానసిక ఒత్తిడిలో ఉన్నా, ఉద్యోగం కోల్పోయినా ఆత్మహత్యే పరిష్కారం కాదని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. సూసైడ్ ఆలోచనలు వచ్చినా, తీవ్ర ఒత్తిడిలో ఉన్నా, సమస్యను ఎవరితోనైనా పంచుకోవాలని అనుకుంటున్నా సహకరించేందుకు అనేక హెల్ప్‌లైన్ సెంటర్లు సిద్ధంగా ఉన్నాయని పేర్కొంటున్నారు. ఉదాహరణకు ప్రభుత్వరంగ హెల్ప్‌లైన్ ‘టెలిమానస్’-14416 లేదా 18008914416 (టోల్ ఫ్రీ), స్నేహ ఫౌండేషన్-04424640050, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ హెల్ప్‌లైన్- 9152987821 వంటివాటిని సంప్రదించవచ్చని వారు సూచిస్తున్నారు. ఒకవేళ సమస్య తీవ్రంగా ఉంటే మానసిక నిపుణులను సంప్రదించి, కౌన్సిలింగ్ పొందాలని చెప్తున్నారు.
పదేండ్లలో ఐఐటీ విద్యార్థుల ఆత్మహత్యలు రెట్టింపు !
- 20 ఏండ్లలో మొత్తం 171 మంది విద్యార్థుల బలవన్మరణాలు
న్యూఢిల్లీ, నవంబర్ 13: గడచిన దశాబ్ద కాలంలో దేశంలోని ఐఐటీ క్యాంపస్‌లలో విద్యార్థుల ఆత్మహత్యలు, అసహజ మరణాలు రెట్టింపయ్యాయి. 2006 జనవరి నుంచి 2026 సెప్టెంబర్ మధ్య కాలంలో దేశంలోని ఐఐటీ క్యాంపస్‌లలో మొత్తం 171 మంది విద్యార్థుల ఆత్మహత్యలు, అసహజ మరణాలు నమోదైనట్టు సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) ద్వారా లభించిన సమాధానాలు, మీడియా కథనాల ఆధారంగా రూపొందించిన ఒక నివేదిక తెలియచేసింది. ఈ 20 ఏండ్ల కాలాన్ని సమాన భాగాలుగా విభజించలేము. 2006 నుంచి 2015 మధ్య కాలంలో విద్యార్థుల ఆత్మహత్యలు, అసహజ మరణాలకు సంబంధించి 51 ఘటనలు నమోదయ్యాయి.
2016 నుంచి 2026 సెప్టెంబర్ వరకు ఈ సంఖ్య రెట్టింపై, 120కి పెరిగింది. సంవత్సరాల వారీగా ఉన్న డాటాలో కొన్ని చోట్ల గణనీయమైన పెరుగుదల కనిపిస్తున్నది. 2014లో 13 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోగా, ఆ తర్వాత 2018లో 11 మంది, 2019లో 12 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 2020 దశకంలో ఈ సంఖ్యలు మళ్లీ పెరిగాయి. 2022, 2023, 2024 సంవత్సరాల్లో ఒక్కొక్క ఏడాది 14 మరణాలు నమోదయ్యాయి. ఈ గణాంకాలలో అత్యధిక వార్షిక సంఖ్య 2025లో 16గా ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికే విద్యార్థుల ఆత్మహత్యలకు సంబంధించి 13 ఘటనలు నమోదయ్యాయి. మరణాలకు ఒకే కారణం ఉందని దీని ద్వారా నిర్ధారించలేము. వ్యక్తిగత, విద్యాపరమైన, ఆర్థిక పరిస్థితులు భిన్నంగా ఉండవచ్చు.
ఏ క్యాంపస్‌లో అధికం?
ఐఐటీ ఖరగ్‌పూర్‌లో అత్యదికంగా 29 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు లేదా అసహజ మరణాలకు గురయ్యారు. ఆ తర్వాతి స్థానాల్లో ఐఐటీ మద్రాసు(26), ఐఐటీ కాన్పూర్(21) ఉన్నాయి. ఐఐటీ ఢిల్లీలో 17 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోగా, ఐఐటీ బొంబాయి, ఐఐటీ గౌహతిలో చెరో 14 మంది చొప్పున ఆత్మహత్యలు నమోదయ్యాయి. ఐఐటీ హైదరాబాద్‌లో 9, ఆ తర్వాత ఐఐటీ రూర్కీలో 8, ఐఐటీ పాట్నాలో 7 ఆత్మహత్యలు నమోదయ్యా యి.మిగిలిన మరణాలు బీహెచ్‌యూ వారణాసి, భువనేశ్వర్, ఐఐటీ-ఐఎస్ఎం ధన్‌బాద్, గాంధీనగర్, రోపర్ నుంచి జోధ్‌పూర్, తిరుపతి, ధార్వాడ్, గోవా, ఇండోర్ ఐఐటీల్లో చోటుచేసుకున్నాయి. జమ్మూ, భిలాయ్, పాలకాడ్ ఐఐటీలలో ఆత్మహత్యలు నమోదు కాలేదు.
కర్ణాటక తరహా భరోసా ఏది?
ఇటీవల కర్ణాటకలో స్థానికులను కావాలనే పక్కనపెడుతున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. కంపెనీలు రిక్రూట్ చేసుకునే సమయంలో రెజ్యుంలో కన్నడ అని ఉంటే వివక్ష చూపుతున్నారంటూ కంపెనీల ఎదుట పలువురు ఆందోళన చేపట్టారు. కొన్ని కంపెనీలు ఉద్దేశపూర్వకంగా కన్నడిగులను పక్కన పెడుతున్నారంటూ ఉద్యమమే ప్రారంభించారు. దీనికి అనేక కన్నడ సంఘాలు సైతం మద్దతు పలికాయి. దీంతో ప్రభుత్వం సైతం స్పందించింది. ‘బెంగళూరులోని పలు ఐటీ కంపెనీలు కన్నడిగులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు విముఖత చూపాయన్న వార్తలు దిగ్భ్రాంతిని కలిగించాయి. ఐటీ ఉద్యోగాల్లో స్థానికులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం తీవ్రంగా భావిస్తున్నది.
ఇప్పటికే ఇలాంటి కంపెనీలపై చర్యలు తీసుకున్నాం. కన్నడిగుల హక్కులు, అవకాశాలు, గౌరవానికి భంగం కలుగుతుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఉద్దేశపూర్వకంగా కన్నడిగులను పక్కనపెట్టే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ఐటీ కంపెనీలను హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం ఇదే తరహాలో ఎందుకు స్పందించడం లేదని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎందుకు భరోసా కల్పించడం లేదని ఇక్కడి ఐటీ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. దాదాపు అన్ని కంపెనీల్లో కీలక స్థానాల్లో దక్షిణాదివారే ఉన్నారని, లేఆఫ్స్‌తో తొలిదెబ్బ తెలంగాణ ఉద్యోగుల మీదే పడుతున్నదని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి, కంపెనీలతో చర్చలు జరుపాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే టెకీల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
‘హైదరాబాద్‌లోని చాలా ఐటీ కంపెనీల్లో కీలక స్థానాల్లో దక్షిణాదికి చెందినవారే ఉన్నారు. ఉద్యోగులను తొలగించినప్పుడు వారిలో తొలిదెబ్బ తెలంగాణ ఐటీ ఉద్యోగులపైనే పడుతున్నది. కంపెనీలన్నీ అమెరికా కేంద్రంగా పనిచేస్తుండటంతో కీలక పోస్టుల్లో ఉన్న వారు ఏ జాబితా ఇస్తే, వారినే తొలగిస్తున్నాయి. దీంతో తెలంగాణ ఉద్యోగులకే అన్యాయం జరుగుతున్నది. ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఐటీ ఉద్యోగులు సైతం ప్రస్తుతం సేఫ్‌జోన్‌లోనే ఉన్నారు. కర్ణాటకలోని ఐటీ కంపెనీలు స్థానికులను ఉద్యోగాల నుంచి తీసేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని ఆ రాష్ట్ర సీఎం డీకే శివకుమార్ ఇటీవలే తీవ్రంగా హెచ్చరించారు. మరి తెలంగాణ సీఎం ఇదే తరహాలో ఐటీ ఉద్యోగులను ఎందుకు రక్షించడం లేదు?’
-మెరుగు శ్రీధర్ (ఒరాకిల్ ఫైల్స్)
కర్ణాటకలోని కొన్ని కంపెనీలు కన్నడిగులను కావాలనే పక్కన పెడుతున్నట్టు మాకు ఫిర్యాదులు అందుతున్నాయి. రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. ఉద్దేశపూర్వకంగా కన్నడిగులను ఉద్యోగంలోకి తీసుకోని అనేక కంపెనీలపై ఇప్పటికే ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ఇకపై ఏదైనా కంపెనీ కావాలనే స్థానికులను పక్కనపెడితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది.
– గత నెల 25న కర్ణాటక సీఎం డీకే శివకుమార్ హెచ్చరిక
కానీ తెలంగాణలో పలు కంపెనీలు వందలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నా, రేవంత్‌రెడ్డి సర్కార్ మాత్రం కిక్కురుమనడం లేదు. కనీసం కంపెనీల యాజమాన్యాలతో చర్చలు జరుపడం లాంటి చర్యలూ తీసుకోవడం లేదు. దీంతో ఉద్యోగాలు కోల్పోయినవారు తీవ్ర మానసిక ఒత్తిడికి గురై బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

